ధనవంతులకు సానుకూలంగా చట్టాల్లో మార్పులు
బీజేపీ ప్రభుత్వ కార్మిక, కర్షక, వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాలు
ఈ నెల 26న రాష్ట్రవ్యాప్త ఆందోళనలు
జనవరి 8నుంచి19 వరకు ప్రచారజాతాలు
19న కార్మిక, కర్షక ఐక్యతా దినం
జిల్లా కేంద్రాల్లో భారీ ప్రదర్శనలు, సభలు
రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల పిలుపు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
‘కేంద్రలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజల హక్కులను కాలరాయడమే కాక, రాష్ట్రాల హక్కులను హరిస్తూ చట్టాలు చేసింది. ఓ వైపు ప్రజాసంక్షేమం గురించి వల్లిస్తూనే.. మరోవైపు కార్పొరేట్లకు లక్షల కోట్లు దోచిపెడుతున్నది. అత్యంత ప్రమాదకరమైన నాలుగు లేబర్ కోడ్‌లు, వీబీ జీ రామ్ జీ, విత్తన బిల్లు, విద్యుత్ సవరణ చట్టం తదితర చట్టాలను తీసుకొచ్చి కార్మికుల, రైతుల, వ్యవసాయ కార్మికుల హక్కులను కాలరాసింది’. ఈ విధానాలను నిరసిస్తూ.. ఆదివారం హైదరాబా ద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా కొన్ని సూచనలతో ఆమోదించారు.
సంపద సృష్టిస్తున్న వర్గాలపై మోడీ కక్ష సాధింపు
ఈ దేశ జీడీపీని పెంచే వర్గాలు, సంపద సృష్టించే ఉత్పత్తి వర్గాల పట్ల మోడీ ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగుతున్నదని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు విమర్శించారు. నియంతృత్వంగా, అప్రజాస్వామికంగా అడ్డూ అదుపు లేకుండా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న చట్టాలు, హక్కులను హరించి వేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక రంగంలోనూ, భావజాల రంగంలో నూ సంపన్నుల ప్రయోజనాలే లక్ష్యంగా సవరణలు చేసి, కార్మికుల శ్రమను మరింత దోచుకునేందుకు తలుపులు బార్లా తెరిచిందని విమర్శిం చారు. ఏ ఒక్క చిన్న విషయాన్ని వదిలి పెట్టకుండా..చట్టాల పేర్ల మార్పుతో సహా హిందూత్వ విధానాలు జొప్పించేందుకు దూకుడుగా ముందుకు సాగుతున్నదని చెప్పారు.
శ్రమ నీతి ద్వారా శ్రమించటమే కార్మికుల ధర్మమనీ, ఫలితం మాత్రం కేంద్రం చూసుకుంటుందని సూత్రీకరణ చేయటం విడ్డూరమన్నారు. పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం మొన్నటి వరకు కార్మికుల తొలగింపు అత్యంత కష్టతరంగా ఉండేదని, కానీ..కేంద్రం తాజాగా తీసుకొచ్చిన లేబర్‌కోడ్‌లు ఫైర్ అండ్ హైర్ విధానానికి అనుమతిస్తున్నాయని చెప్పారు. మానవీయ పరిస్థితులు, తొలగింపు పరిహారాలు ఇవన్నీ లేకుండానే నియమించుకునే, తొలగించే స్వేచ్ఛను యాజమాన్యాలకు లేబర్‌కోడ్‌లు ఇస్తున్నవని తెలిపారు. ఈ రకమైన కార్మిక వ్యతిరేక విధానాలు ఆ కోడ్‌ల ద్వారా యాజమాన్యాలకు అనుకూలంగా ఉన్నాయనీ, అందుకే వీటిని రద్దు చేసే వరకు పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
రైతు వ్యతిరేక బిల్లులను రద్దు చేయాలి
కార్పొరేట్ అనుకూల జాతీయ విత్తన బిల్లు, 2003 విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి సుదర్శన్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఒంటెత్తు విధానాలతో కార్మికుల, కష్టజీవులపై దాడికి పూనుకు న్నదని విమర్శించారు. ఇది కార్మికులు, కర్షకులపై మాత్రమే దాడి కాదనీ, మొత్తం ఫెడరిలిజం, ప్రజాస్వామ్యంపై దాడి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. విత్తన బిల్లు, విద్యుత్ చట్టం అమలైతే.. రైతులు, ప్రజలు తీవ్ర కష్టాలెదుర్కొంటారని చెప్పారు. రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు ఐక్యంగా సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
అబద్ధాలతో ఊదరగొడుతున్న బీజేపీ
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను తీసుకొచ్చి వారి జీవితాలపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతు న్నదని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో యాజామాన్యాలకు ఉపయోగపడే విధానా లతో కూడిన నాలుగు లేబర్ కోడ్‌లను తీసుకు రావటం కార్మికుల హక్కులను హరించట మేనని విమర్శించారు. పైగా ఈ చట్టాలు, ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి పథకాన్ని తీసుకు రావటం కార్మికు ల, కూలీల ప్రయోజనాల కోసమేనని చెప్పటం పచ్చి అబద్ధాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. మందబలంతో పార్లమెంట్‌లో తీసుకొ చ్చిన బిల్లులు, చట్టాలను వెంటనే రద్దు చేయాలనీ డిమాండ్ చేశారు. అప్పటి వరకు పోరాటాలు తప్పవని హెచ్చరించారు.
విద్యుత్ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి
విద్యుత్ సవరణ చట్టాన్ని, విత్తన బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్ డిమాండ్ చేశారు. విత్తన చట్టాన్ని పూర్తిగా కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసమే రూపొందించారనీ, మేధావులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు ఈ చట్టాన్ని బహిష్కరించాలని పిలుపునిచ్చారని గుర్తు చేశారు. ఈ చట్టానికి వచ్చిన సవరణలను కేంద్ర ప్రభుత్వం తృణీకరించి కార్పొరేట్లకు అనుకూలంగా చట్టాలు చేస్తున్నదని చెప్పారు. ఆ సంస్థలు 80 శాతం విత్తన రంగాన్ని తమ ఆధీనంలో పెట్టుకున్నాయని తెలిపారు. రైతులను కార్పొరేట్ దోపిడీ నుంచి నివారించడానికి ఈ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ ఉత్పత్తి రాజ్యాంగం రీత్యా రాష్ట్ర జాబితాలోనిదని చెప్పారు. ఇంతకాలం రాష్ట్రాల పోరాటం వల్ల కేంద్రం చట్టం చేయలేదని తెలిపారు.
గత పార్లమెంట్ సమావేశాల్లో ”2003 విద్యుత్ సవరణ చట్టం” ఆమోదించిందని చెప్పారు. ఈ చట్ట ప్రకారం ఇక నుంచి విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ బాధ్యతలు కేంద్రం చూస్తుందని తెలిపారు. విద్యుత్ చార్జీలను కేంద్రమే ”విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్” ద్వారా నిర్ణయిస్తుందన్నారు. స్పార్ట్ మీటర్లు పెట్టి టారిఫ్ ముందుగానే వసూలు చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉచిత విద్యుత్ రద్దు చేస్తారని చెప్పారు. క్రాస్ సబ్సిడీ రద్దు చేయడం వల్ల వినియోగదారులందరూ ఉత్పత్తి ఖర్చు చెల్లించాలని చెప్పారు. ఇది రైతాంగానికి ప్రజలకు తీవ్ర నష్టమని చెప్పారు. పార్లమెంట్ ఆమోదించిన విద్యుత్ సవరణ చట్టాన్ని ఉపసంహరించాలని డిమాండ్ చేశారు.
విస్తృత ప్రచారం నిర్వహించాలి
ప్రభుత్వ రంగ సంస్థల్లోకి వంద శాతం విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తూ కేంద్ర బీజేపీ సర్కార్ నిర్ణయం చేసిందని ఏఐకేఎస్, సీఐటీయూ సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, ఎస్ వీరయ్య అన్నారు. ముఖ్యంగా ఇన్సూరెన్స్ రంగంలోకి విదేశీ పెట్టుబడులను ఆహ్వానించిందని తెలిపారు. ఈ నిర్ణయం విదేశీ బహుళ జాతి కంపెనీలకు ఇన్సూరెన్స్ రంగాన్ని అప్పగించడమేనని ఆందోళన వ్యక్తం చేశారు. విత్తన బిల్లు, విత్తన చట్టం వల్ల ప్రజలకు తీవ్ర నష్టాలు వాటిల్లుతాయని హెచ్చరించారు. వీటికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాపితంగా విస్తృతంగా ప్రచారం నిర్వహించాలనీ, గ్రూప్ మీటింగ్‌లు, సెమినార్లు, జాతాలు, కరపత్రాలు, పోస్టర్లు, సోషల్ మీడియా ద్వారా కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, ప్రజానీకంలో విస్తృతంగా తీసుకెళ్ళాలని సూచించారు.
పని హక్కుని కాలరాస్తే ఉద్యమం
పని హక్కుని కాలరాస్తే ఉద్యమం తప్పదని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రాములు హెచ్చరించారు. ఉపాధి హామీ స్థానంలో వీబీ జీ రామ్‌జీ పథకాన్ని తీసుకు రావటం ఆందోళన కరమన్నారు. ఉపాధి హామీ పట్ల చాలా కాలంగా చూపుతున్న వ్యతిరేకతకు పరాకాష్టే ఈ నిర్ణయమని విమర్శించారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వ్యవసాయకార్మికులు, రైతులు, కార్మికులు పోరాటాలు నిర్వహించాల్సిన పరిస్థితి ఆసన్నమైందని చెప్పారు. సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి ప్రసాద్, సీఐటీయూ ఆఫీసు బేరర్లు పాల్గొన్నారు.
”వికసిత్ భారత్- జీ రామ్ జీ”ని రద్దు చేయాలి
వామపక్షాల పోరాట ఫలితంగా 2005లో తెచ్చిన ”మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి గ్యారంటీ చట్టం”ను భూస్థాపితం చేసేందుకు మోడీ ప్రభుత్వం కక్ష కట్టిందని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి నాగయ్య విమర్శించారు. చట్టం స్థానంలో తీసుకొచ్చిన పథకంతో పేదలకు పెద్దగా ప్రయోజనం లేదని అన్నారు. చట్టాన్ని రూపొందించే నాడే.. మోడీ దీనికి వ్యతిరేకంగా మాట్లాడారనీ, ఇది విఫల చట్టమని వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. ప్రజల జీవితాలతో మోడీ ప్రభుత్వం ఆటలాడుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసేందుకు బీజేపీ ప్రభుత్వం మొదటి నుంచి నిధుల కోత విధిస్తున్నదని వివరించారు.
ఉపాధి పనికి ఇప్పటి వరకు కేటాయించిన కేటాయింపుల్లో ఇక నుంచి కేంద్రం వాటా తగ్గించి, రాష్ట్రాల వాటా పెంచిందని తెలిపా రు. 125 పని దినాలు కల్పిస్తున్నామని చెప్పటం పచ్చి అబద్ధమని, వ్యవసాయ సీజన్‌లో పని బంద్ పెట్టినప్పుడు పని దినాలు ఎలా పెరుగుతాయని ప్రశ్నించారు. వ్యవసాయ కార్మికులు అమాయకులనీ, ఏం చేసినా వారు మాట్లాడరనీ, పరమ అబద్ధాలతో ప్రచారం చేస్తున్నదని విమర్శించారు. వీబీ జీ రామ్ జీ ని రద్దు చేసి పాత చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆ రకమైన నిర్ణయం తీసుకునే వరకు పోరాటాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
ఆందోళనలు..పోరాటాలు..
కేంద్ర ప్రభుత్వం దేశ కార్మిక, కర్షక, వ్యవసాయ కూలీలకు సమస్త ప్రజానీకానికి సవాలు విసిరింది. కార్మిక, కర్షకుల వ్యతిరేక విధానాలను దూకుడుగా అమలు చేసేందుకు బరితెగించి ముందుకొస్తున్నది. దీన్ని వెనక్కి కొట్టాలంటే పోరాటాలే ఏకైక మార్గం. ఎంతటి వారైనా ప్రజా ఉద్యమాలకు తలవంచాల్సిందే.. అని సంయు క్తంగా మూడు సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ నెల 26న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలనీ, జనవరి 8నుంచి 18వరకు ప్రచార జాతాలు నిర్వహించాలనీ, జనవరి 19న కార్మిక, కర్షక ఐక్యతా దినం సందర్భంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రభావ వంతంగా ప్రదర్శనలు, సభలు నిర్వహించాలని పిలుపునిచ్చాయి.



