డిసెంబర్ 26 నుంచి అమలు
మోడీ సర్కారు మరో బాదుడు
సామాన్యుడికి తప్పని ఇక్కట్లు
న్యూఢిల్లీ : కేంద్రంలోని మోడీ సర్కారు దేశ ప్రజలపై మరో భారం మోపింది. టికెట్ ధరలను పెంచుతూ భారతీయ రైల్వే ప్రకటన చేసింది. ప్రతి 500 కిలోమీటర్ల దూరం ప్రయాణానికి నాన్ ఏసీ టికెట్లపై రూ.10 అదనపు భారం పడనున్నది. పెరిగిన రైల్వే ఛార్జీలు డిసెంబర్ 26 నుంచి అమలులోకి వస్తాయి. సబర్బన్ రైలు ప్రయాణ ఛార్జీలను రైల్వే పెంచలేదు. అయితే ఎక్కువ దూరం ప్రయాణాలకు సంబంధించిన ఛార్జీలు పెరిగాయి. కాగా 215 కిలోమీటర్ల దూరం వరకు జనరల్ క్లాస్ రైలు టికెట్ల రేట్లలో ఎలాంటి మార్పూ లేదు.215 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరాలకు కిలోమీటరుకు ఒక పైసాను రైల్వే పెంచింది. అలాగే మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఎయిర్ కండిషన్డ్ లేని (నాన్ ఏసీ) కోచ్‌ల్లో ప్రయాణాలకు కిలోమీటరుకు 2 పైసలు పెంచింది. ఎయిర్ కండిషన్డ్ (ఏసీ) కోచ్‌లలో ప్రయాణ ఖర్చు కూడా కిలోమీటరుకు 2 పైసలు పెరిగింది. దీంతో నాన్ ఏసీ, ఏసీ కోచ్‌ల్లో ప్రయాణాలకు ప్రతి 500 కిలోమీటర్ల దూరానికి రూ.10 అదనంగా ఖర్చు పెరుగుతుంది. పెరిగిన కొత్త ఛార్జీలు డిసెంబర్ 26 నుంచి అమలులోకి వస్తాయని రైల్వే తెలిపింది.
ఛార్జీల పెంపు వల్ల రైల్వే ఆదాయం ఏటా రూ. 600 కోట్లు పెరుగుతుందని పేర్కొన్నది. రైల్వే ఉద్యోగుల వేతనాల ఖర్చు రూ.1,15,000 కోట్లకు, పెన్షన్ ఖర్చు రూ.60,000 కోట్లకు పెరిగిందని రైల్వే వివరించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రైల్వే కార్యకలాపాల మొత్తం ఖర్చు రూ.2,63,000 కోట్లకు పెరిగినట్టు పేర్కొన్నది. ఈ నేపథ్యంలో కార్గో, ప్రయాణీకుల ఛార్జీల పెంపుపై దృష్టి సారించినట్టు రైల్వే వెల్లడించింది. కాగా టికెట్ ధరలను పెంచడం ఇది ఈ ఏడాది రెండోసారి కావడం గమనార్హం. ఇప్పటికే ద్రవ్యోల్బణం ప్రభావంతో దేశంలో నిత్యవసరాల ధరలు తీవ్రమవుతున్నాయి. దీంతో సామాన్యుడి ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇప్పుడు రైల్వే ఛార్జీల బాదుడుతో వారి జేబులకు చిల్లులు పడనున్నా యి. నిరుద్యోగం, అమలులో లేని కనీసవేతనాలు, వేతనాలు పెరగకపోవడం వంటి పరిస్థితులతో కష్టాలను ఎదుర్కొంటున్న ప్రజలు.. తాజాగా మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనరల్ బోగీల సంఖ్య పెంచని రైల్వే.. టికెట్ ధరల పెంపుతో పేద, మధ్య తరగతి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నదని తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.



