ఏపీలో సీఐటీయూ మహాసభ సందర్భంగా పలుచోట్ల పోటీలు
యంత్రాంగం : విశాఖలో జరగనున్న సీఐటీయూ అఖిల భారత మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా వివిధ రూపాల్లో కళా ప్రదర్శనలు, పోటీలు ఆదివారం కూడా బీజేపీ ప్రభుత్వం సాగిస్తున్న అప్రజాస్వామిక దాడులను, లేబర్ కోడ్‌ల వంటి దుర్మార్గపు విధానాలను కళ్లకు కట్టాయి. కార్మిక వర్గ పోరాటాలకు దర్పణం పడుతూ.. విశాఖ నగర వ్యాప్తంగా అన్ని జోన్లలో ఏర్పాటు చేస్తున్న ఫొటో ఎగ్జిబిషన్లు ఆకట్టుకుంటున్నాయి. విశాఖ జిల్లా కంచరపాలెం జోన్ పరిధిలోని జీవీఎంసీ 52వ వార్డు శివనగర్ కుట్టు సెంటర్ వద్ద సీఐటీయూ పతాకాన్ని సీఐటీయూ సీనియర్ నాయకులు ఎం.నాగేశ్వరరావు ఆవిష్కరించారు. డాబా గార్డెన్స్‌లోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో ప్రముఖ కార్టూనిస్ట్ బి హరి వెంకటరమణ జడ్జిగా కార్టూన్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిల్డ్రన్స్ క్లబ్ రాష్ట్ర కన్వీనర్ కె.రమాప్రభ, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ఎ.అజశర్మ, ప్రజానాట్యమండలి నాయకులు జి.రమణ, సిహెచ్.మాధవి తదితరులు పాల్గొన్నారు.
ఎన్‌టిఆర్ జిల్లా విజయవాడ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేటలో బొమ్మల సెంటర్ వద్ద శ్రామిక ఉత్సవాలు నిర్వహించారు. కళాకారులు భరతనాట్యం, కూచిపూడి, కోలాటం, వెస్ట్రన్ డాన్స్, కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌ల వల్ల కార్మిక కుటుంబాలు పడుతున్న ఇబ్బందులను పాటలు, నృత్యాల రూపంలో ప్రదర్శించారు. సీఐటీయూ ఎన్‌టిఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌సిహెచ్.శ్రీనివాస్, అధ్యక్షులు ఎ.వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు డి.కాశీనాథ్, సెంట్రల్ సిటీ అధ్యక్షులు ఎంవి.సుధాకర్, ప్రధాన కార్యదర్శి కె.దుర్గారావు కళాకారులకు ప్రశంసాపత్రం, మెమొంటోలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక నిర్ణయాలపై పెద్దఎత్తున పోరాడాలని పిలుపునిచ్చారు. కర్నూలు నగరంలో కరపత్రాలు పంచుతూ పోస్టర్లు గోడలకు అతికించి ప్రచారం నిర్వహించారు. బైకులకు, ఆటోలకు స్టిక్కర్లు అంటించారు. కార్మికుల ఇళ్లపై జెండాలు కట్టుకున్నారు. కార్మిక వాడవాడలలో తోరణాలు కట్టి జెండాలను ఎగురవేశారు. సీఐటీయూ నగర ప్రధాన కార్యదర్శి ఆర్ నరసింహులు పాల్గొన్నారు.



