Monday, December 22, 2025
E-PAPER
Homeరాష్ట్రీయం'వీబీ జీ రామ్‌ జీ'ని రద్దు చేయాలి

‘వీబీ జీ రామ్‌ జీ’ని రద్దు చేయాలి

- Advertisement -

కేవీపీఎస్‌, టీజీఎస్‌ డిమాండ్‌
హైదరాబాద్‌లోని సుందరయ్య పార్కు ఎదుట బిల్లు ప్రతుల దహనం

నవతెలంగాణ – ముషీరాబాద్‌
కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి నూతనంగా తెచ్చిన వీబీ జీ రామ్‌ జీ బిల్లును రద్దు చేయాలని కేవీపీఎస్‌, టీజీఎస్‌ సంఘాలు డిమాండ్‌ చేశాయి. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్‌), తెలంగాణ గిరిజన సంఘం (టీజీఎస్‌) రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య పార్కు వద్ద వీబీ జీ రామ్‌ జీ బిల్లు ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. స్కైలాబ్‌ బాబు మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆర్‌ఎస్‌ఎస్‌ ఎజెండాను అమలు చేయడంలో భాగంగానే ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి రాముడి పేరుతో బిల్లు తీసుకొచ్చిందని విమర్శించారు. జాబ్‌కార్డుల రేషనలైజేషన్‌ పేరుతో ఇప్పటికే కోట్లాదిమంది ఉపాధి కూలీల కార్డుల తొలగింపు ప్రక్రియ ప్రారంభించారని తెలిపారు. ఇప్పుడు ఉపాధి పనులకు కూలీలకు చెల్లించే నిధులను ఎవరు చెల్లించాలనే దానిపై స్పష్టత లేదన్నారు.

వీబీ జీ రామ్‌ జీ పథకానికి వ్యతిరేకంగా ఈ నెల 22వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో జరగనున్న నిరసన కార్యక్రమాల్లో పార్టీలకతీతంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. టీజీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ శ్రీరాం నాయక్‌ మాట్లాడుతూ.. 20 ఏండ్లుగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ చట్టం ద్వారా గిరిజనులు, దళితులు, బలహీన వర్గాలు, పేద ప్రజలకి లబ్ది చేకూరుస్తున్న ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయడం దుర్మార్గమని అన్నారు. ఆర్థిక లోటుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రాష్ట్రాలు ఉపాధి హామీ పథకం నిధులను చెల్లించకపోతే ఉపాధి పనులే ప్రమాదంలో పడే ప్రమాదం ఉందన్నారు. దేశ ప్రజల ఉపాధికి తూట్లు పొడిచి, కోట్లాదిమంది పేద ప్రజల ఉపాధి దెబ్బ తీయడమే బీజేపీ చెబుతున్న దేశభక్తా అని ప్రశ్నించారు. ప్రజలు జాతిపితగా పిలిచే మహాత్మా గాంధీ పేరును సైతం తొలగించి దేశ ప్రజలను అవమానించిందని ఆవేదన వ్యక్తం చేశారు. అవాజ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ అబ్బాస్‌ మాట్లా డుతూ.. గాంధీని గాడ్సే హత్య చేస్తే గాడ్సే వారసు లైన ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ.. మహాత్మాగాంధీ పేరును తొలగించి మరోసారి హత్య చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కొత్త చట్టంలో పనికి హామీ లేకపో వడంతోపాటు ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడే విధంగా ఉందన్నారు. బ్యాంకులను లూటీ చేస్తున్న దొంగలకు లక్షల కోట్ల రూపాయలు తాయిలాల రూపంలో చెల్లిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. ఉపాధి కూలీలకు కేవలం లక్ష కోట్ల రూపాయలు చెల్లించలేమని చెప్పడం దుర్మార్గమని విమర్శిం చారు. చేతి వత్తిదారుల సమన్వయ కమిటీ రాష్ట్ర నాయకులు ఆశయ్య మాట్లాడుతూ.. కోట్లాదిమంది ఉపాధి కూలీల పొట్టను కొట్టే విధంగా తెచ్చిన వీబీ జీ రామ్‌ జీ పథకాన్ని రద్దు చేసి మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని తిరిగి అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం. ధర్మా నాయక్‌, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్‌, కేవీపీఎస్‌ హైదరాబాద్‌ కార్యదర్శి బి. సుబ్బారావు, నాయకులు జి రాములు, శ్రీనివాస్‌, అర్జున్‌, బాబురావు ,సంతోష్‌ పి. వెంకన్న, టీజీఎస్‌ హైదరాబాద్‌ అధ్యక్ష కార్యదర్శులు వి. రాంకుమార్‌, ఎం.బాలు నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -