తక్కువ పెట్టుబడితో గోల్డ్ అంటూ మోసం!
‘సిరి’ గోల్డ్ మర్చంట్స్ దగాపై కేసు
బీజేపీ నేతలు నెల్లూరి, కూసంపూడి ‘చీటింగ్’
విషయం బయటకు పొక్కటంతో నిందితుల మల్లగుల్లాలు
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
బంగారం ధరలు రోజురోజుకు భారీగా పెరుగుతుం డటంతో సామాన్యుల ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఒకప్పుడు తులం బంగారం కొనగలిగిన స్థోమత ఉన్నవారు కూడా ఇప్పుడు గ్రాము బంగారం కొనడానికి ఆపసోపాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తక్కువ పెట్టుబడితో ఆశించిన బంగారం మీ సొంతమవుతుందనీ.. ఆశలు కల్పిస్తూ పుట్టుకొస్తున్న కొన్ని గోల్డ్ మర్చంట్స్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థలు మోసానికి పాల్పడుతున్నాయి. అందులో ఒకటే సిరి గోల్డ్ మర్చంట్స్ ప్రయివేట్ లిమిటెడ్ అనే సంస్థ.
తక్కువ పెట్టుబడికి గోల్డ్ పేరుతో దగా..!
సిరి గోల్డ్ ఫైనాన్స్ పేరుతో బంగారం ఇస్తామంటూ కనీసం రూ.15,000 పెట్టుబడి పెడితే బంగారం వ్యాపారంలో భారీ లాభాలు వస్తాయని నమ్మించారు. వేల మంది నుంచి డిపాజిట్లు సేకరించారు. అయితే బాధితులకు హామీ ఇచ్చిన లాభాలు గానీ, అసలు గానీ తిరిగి ఇవ్వలేదు. దాంతో వారు ఈ సంస్థ తీరుపై ఆరా తీశారు. ఆధారాలు చూపకపోవడంతో మోసం చేశారని నిర్ధారణకు వచ్చారు. దీనిపై ఖమ్మం జిల్లా కల్లూరు మండలానికి చెందిన యాస నాగేశ్వరావు హైదరాబాద్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. రూ.5,000 చెల్లిస్తే రూ.15,000 ఇస్తామంటూ నిందితులు మహిళలకు బంగారం ఆశ చూపించారు.
కరపత్రాలు, బ్రోచర్లతో సామాన్య ప్రజలను లక్ష్యంగా చేసుకొని వేలాదిమంది నుంచి అక్రమంగా డిపాజిట్ల రూపంలో డబ్బులు వసూలు చేశారు. కరపత్రాలు, బ్రోచర్లలో పేర్కొన్న దానికి భిన్నంగా సిరి గోల్డ్ ఫైనాన్స్ కంపెనీని నిర్వహిస్తుండటంతో బాధితులు పలుమార్లు సంస్థ డైరెక్టర్లు అయిన నెల్లూరు కోటేశ్వరరావు, కూసంపూడి రవీందర్లను సంప్రదించారు. వారు ”కంప్యూటర్లు హ్యాంగ్ అయ్యాయి” వంటి పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో ఉన్న కంపెనీ కార్యాలయానికి బాధితులు పలుమార్లు వెళ్లారు. అక్కడ కూడా వెబ్ పోర్టల్లో తమ వివరాలు లేవని సిబ్బంది చెప్పటంతో మోసపోయామని నిర్ధారణకు వచ్చారు.
నేతలని నమ్మితే..!
కోటేశ్వరావు, రవీందర్లను నమ్మి తాను సిరి గోల్డ్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టానని, అందుకు తనకు ఐడీ నంబర్ 79105334 ఇచ్చినట్టు బాధితుడు యాస నాగేశ్వరావు తెలిపారు. తనలాగే అనేకమంది నుంచి రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు వసూలు చేసినట్టు కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. కొన్ని రోజులుగా ఎలాంటి రాబడులు రావడం లేదని, గోల్డ్‌కు సంబంధించిన డైరెక్టర్లు చెప్పడంతో నాగేశ్వరావు పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చిందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పెట్టుబడుల పేరుతో తనను మోసం చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని, తనతో పాటు తనలాంటి అనేక మంది ఇలా మోసపోయారని వాపోయారు. దీనిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్లు 316(2), 318(4) కింద నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
చీటింగ్ కేసు నమోదు
హైదరాబాద్‌లోని ఉప్పల్ కేంద్రంగా పనిచేస్తున్న సిరి గోల్డ్ మర్చంట్స్ ప్రయివేట్ లిమిటెడ్ అనే సంస్థలో పెట్టుబడుల పేరుతో రూ.20 కోట్ల మేర మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలపై అక్కడి సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు కేసు నమోదు చేశారు. నెల్లూరి కోటేశ్వరరావుతో పాటు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కూసంపూడి రవీందర్‌పైనా ఈ కేసు నమోదు చేశారు.
ఓర్వలేకే కుట్రలు : నెల్లూరి కోటేశ్వరరావు
తన రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేక ప్రత్యర్థులు కుట్రపూరితంగా అక్రమ కేసులు బనాయించారని, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని నెల్లూరి కోటేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. తనపై ఆరోపణలను ఖండిం చారు. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నాలను తిప్పికొడతాననే విశ్వాసం వ్యక్తం చేశారు.



