Monday, December 22, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకుటుంబ సభ్యుల సహకారంతోనే నాయకుల ప్రజా పోరాటాలు

కుటుంబ సభ్యుల సహకారంతోనే నాయకుల ప్రజా పోరాటాలు

- Advertisement -

సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు
బండారు చందర్రావు సతీమణి సత్యవతిని పరామర్శించిన రాఘవులు, పార్టీ ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు

నవతెలంగాణ-భద్రాచలం
ప్రజా సమస్యలపై నిరంతరాయంగా పోరాటాలు నిర్వహించే నాయకులకు కుటుంబ సభ్యుల సహకారం ఎంతో అవసరమని, నాయకుల పోరాట చరిత్రలో వారి పాత్ర మరువలేనిదని సీపీఐ(ఎం) పొలిట్‌ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఆదివారం బండారు చందర్రావు సతీమణి బండారు సత్యవతిని బీవీ రాఘవులు, సీపీఐ(ఎం) ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పరామర్శించారు. ఆమె ఆరోగ్యం పై ఆరా తీసి యోగక్షేమాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ.. భద్రాచలం డివిజన్‌ ఉద్యమ నిర్మాతలైన బండారు చందర్రావు, బత్తుల భీష్మారావు, ఎలమంచి సీతారామయ్య, పీవీఆర్‌ చంద్రం, శ్యామల వెంకట్‌ రెడ్డి తదితర నాయకులు వారి కుటుంబ సభ్యుల సహకారంతోనే ఈ ప్రాంతంలో పార్టీని నిర్మించ గలిగారని అన్నారు. ప్రతిరోజూ ఎంతోమంది కార్యకర్తలు వివిధ పనుల నిమిత్తం భద్రాచలానికి వచ్చిన సందర్భంలో బండారు చందర్రావు ఇంటికి వస్తే.. ప్రతి ఒక్కరికి సత్యవతి భోజనం పెట్టి మరీ పంపించేదని గుర్తు చేశారు.

చందర్రావు ఇల్లు అంటే పార్టీ కార్యాలయంగానే పిలిచేవారని అన్నారు. చందర్రావు.. ఎమర్జెన్సీ సమయంలో అజ్ఞాతంలో గడిపినప్పుడు కూడా చిన్నపిల్లలతో బండారు సత్యవతి ఎంతో ధైర్యంగా నిలబడ్డారని తెలిపారు. పేద, బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పోరాటాలు నిర్వహిస్తున్న బండారు చందర్రావుని మావోయిస్టులు అత్యంత దారుణం గా హత్య చేసినప్పటికీ సత్యవతి ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా తన ఇద్దరు కుమా రులను పార్టీకి అందించి ఆదర్శంగా నిలిచారని అన్నారు. బండారు సత్యావతికి సంబంధించి పార్టీ నాయకుల కుటుంబాలే బంధువులని, వారితోనే ఇప్పటికీ సత్సంబంధాలను కొనసాగిస్తున్నారని తెలిపారు. ఉద్యమానికి బండారు సత్యవతి ఇచ్చిన స్ఫూర్తి అభినందనీయమని కొనియాడారు.

ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన చందర్రావు, భీష్మారావు : వి.శ్రీనివాసరావు
బండారు చందర్రావు, బత్తుల భీష్మారావు మరణించి 40 సంవత్సరాలు గడిచినప్పటికీ ఆ ప్రాంత ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని సీపీఐ(ఎం) ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. బండారు చందర్రావు, బత్తుల భీష్మారావు పేర్లతో చింతూరు మండల కేంద్రంలో నిర్వహించిన అమరవీరుల సంస్కరణ సభ ముంపు మండలాల్లో ఉద్యమస్ఫూర్తిని నింపిందని తెలిపారు.
చందర్రావు, భీష్మారావు స్ఫూర్తితో వారి కుటుంబ సభ్యులు ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఉద్యమకారులకు ఆదర్శంగా నిలిచా రని అన్నారు.

బండారు సత్యవతి తీవ్ర అనారోగ్యంతో మంచానికే పరిమితమైనప్పటికీ ఇప్పటికీ తనలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలన్న ఆసక్తి కనిపిస్తుందని, అది కేవలం విప్లవ పార్టీ కార్యకర్తలకే సాధ్యమవుతుందని అన్నారు. బండారు సత్యవతి సలహాలు, సూచనలు నేటితరం కార్యకర్తలకు ఎంతో అవసరమని తెలిపారు. ఈ పరామర్శలో సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బండారు రవికుమార్‌, భద్రాద్రి జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్‌, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు ఎర్రశెట్టి వెంకట రామారావు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -