Monday, December 22, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంపెన్షనర్లపై కేంద్రం కుట్ర

పెన్షనర్లపై కేంద్రం కుట్ర

- Advertisement -

టాప్రా జాతీయ నాయకులు జనార్ధన్‌రెడ్డి
పెన్షనర్లు సామాజిక బాధ్యత వహించాలి : మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
పెన్షనర్లకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకుండా తప్పించుకుంటున్న ప్రభుత్వం : మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
తెలంగాణ ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసియేషన్‌ నల్లగొండ జిల్లా మహాసభ

నవతెలంగాణ-మిర్యాలగూడటౌన్‌
ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు పెన్షన్‌ రాకుండా కేంద్ర ప్రభుత్వం కుట్రచేస్తోందని, దీన్ని సంఘటిత శక్తితో ఎదుర్కోవాలని తెలంగాణ ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసియేషన్‌ జాతీయ నాయకులు జనార్దన్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఎస్‌ఆర్‌ ఫంక్షన్‌హాలులో నిర్వహించిన తెలంగాణ ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసియేషన్‌ (టీఏపీఆర్‌పీఏ-టాప్రా) నల్లగొండ జిల్లా మహాసభలో సంఘం జాతీయ నాయకులు జనార్దన్‌రెడ్డితోపాటు మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షులు నూకల జగదీష్‌ చంద్ర అధ్యక్షతన జరిగిన సభలో జనార్ధన్‌రెడ్డి, నారాయణరెడ్డి మాట్లాడారు. ఉద్యోగ విరమణ చేసిన వారికి తప్పనిసరిగా పెన్షన్‌ అందించడం రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని అన్నారు. దాన్ని కాలరాసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యత్నిస్తున్నదని విమర్శించారు. ఆర్థిక సంక్షోభాన్ని బూచిగా చూపించి 2026 నుంచి పెన్షన్‌ పాలసీలో మార్పులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు.

పెట్టుబడిదారులు, కార్పొరేట్‌ శక్తుల చేతిలో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వం.. వారి సలహా మేరకే పెన్షన్‌పై దాడి చేస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ దివాళాకోరు విధానాలపై పోరాటానికి టాప్రా సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం జూలకంటి మాట్లాడుతూ.. దేశంలో సామాజిక రుగ్మతలను తొలగించే బాధ్యత పెన్షనర్లపై ఉందన్నారు. 30 నుంచి 40 ఏండ్లకు పైగా ఉద్యోగం చేసి వృద్ధాప్యంలో ఉద్యోగ విరమణ పొందిన వారు వారి జీవనం కోసం ఇచ్చే పెన్షన్‌ బెనిఫిట్స్‌పై కుట్రలు చేయడం అన్యాయమన్నారు. మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్లకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతుందని విమర్శించారు. ఖజానాలో డబ్బులు లేవని తనను కోసినా డబ్బులు లేవని చెప్పడం ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్‌రెడ్డికి తగదన్నారు. ఈ మహాసభలో టాప్రా జిల్లా కార్యదర్శి శ్యాంసుందర్‌, ఆహ్వాన సంఘం అధ్యక్షులు మధుసూదన్‌రెడ్డి, టాప్రా రాష్ట్ర కమిటీ సభ్యులు రమేశ్‌, ఎల్‌.మాధవరెడ్డి, నాయకులు డాక్టర్‌ లింగా అరుణ, కృష్ణారెడ్డి, అబ్దుల్‌ ఖాదర్‌, కొక్కడాల గోవర్ధన్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -