నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ మండలంలోని అంకిరెడ్డిగూడెం గ్రామ శివారులోని ఎన్‌హెచ్–65పై సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. కార్తికేయ ట్రావెల్స్‌కు చెందిన బస్సు హైదరాబాద్ వైపు వెళ్తుండగా.. వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ఇంటర్సిటీ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో వరుసగా నాలుగు బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి.
ఈ ప్రమాదంలో కార్తికేయ ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తున్న సిద్ధాని దుర్గాప్రసాద్ (34), సిద్ధాని శృతి మనోజన (23) గాయపడ్డారు. గాయపడిన వారిని 108 అంబులెన్స్‌లో చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ బాచుపల్లి మమత ఆస్పత్రికి పంపారు. ప్రమాదంలో పలువురు బస్సులకు నష్టం వాటిల్లింది. ఈ ఘటనపై చౌటుప్పల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. ఇంటర్సిటీ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ తిరుపతి సురేష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని సబ్ ఇన్స్పెక్టర్ నర్సిరెడ్డి తెలిపారు.



