Tuesday, December 23, 2025
E-PAPER
Homeఖమ్మంగ్రామాభివృద్ధిలో ప్రజలదే కీలక పాత్ర

గ్రామాభివృద్ధిలో ప్రజలదే కీలక పాత్ర

- Advertisement -

– ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య
నవతెలంగాణ – అశ్వారావుపేట : సర్పంచ్‌తో పని చేయించుకోవడం ప్రజల హక్కని, అదే సమయంలో ప్రజలు సైతం స్థానిక పాలక వర్గాలకు సహకరిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించినప్పుడే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య పిలుపునిచ్చారు.

సోమవారం కావడిగుండ్ల లో నిర్వహించిన సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ విజయోత్సవ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ మండల కార్యదర్శి వాసం బుచ్చి రాజు అధ్యక్షతన జరిగిన ఈ సభలో గుమ్మడి నరసయ్య మాట్లాడుతూ, గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయని అన్నారు. గ్రామాభివృద్ధి స్థానికంగా ఎన్నికైన పాలకవర్గాల పనితీరుపై ఆధారపడి ఉంటుందని, ప్రజలు నిత్యం ఎదుర్కొనే తక్షణ సమస్యల పరిష్కారంలో పంచాయతీ సభ్యులు ముందుండి పనిచేయాలని సూచించారు. ఐదేళ్ల కాలంలో ప్రజల మనసు గెలిచే విధంగా సర్పంచులు, వార్డు సభ్యులు పనిచేయాలన్నారు.

ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత హామీల పేరుతో ప్రజలను మభ్యపెట్టి, అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయడంలో విఫలమవుతున్నాయని ఆయన విమర్శించారు. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి అమలు చేయలేదని, రైతు భరోసా, రుణమాఫీ, ఉచిత బస్సు వంటి అంశాల్లో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తామని చెప్పి, వాటిని విస్మరిస్తున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాల ద్వారానే ఉద్యమిస్తుందని, పాలకుల ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరుస్తుందని చెప్పారు. నూతనంగా ఎన్నికైన గ్రామ పాలకవర్గాల ఆధ్వర్యంలో ప్రజలంతా కలిసికట్టుగా గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా పార్టీ కేంద్ర కమిటీ నాయకులు కెచ్చెల రంగారెడ్డి మాట్లాడుతూ, భారతదేశంలో బ్రిటిష్ పాలనకు ముందే గ్రామ పంచాయతీలు ఉన్నాయని గుర్తు చేశారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం ఎర చూపడాన్ని ప్రజలు తిరస్కరించి, కావడిగుండ్ల లో సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించడం అభినందనీయమని అన్నారు. ఎన్నికైన ప్రతినిధులు ప్రజల కోసం పనిచేసి గ్రామాభివృద్ధికి పాటుపడాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ కార్యదర్శి గోకినపల్లి ప్రభాకర్, కావడిగుండ్ల సర్పంచ్ బాడిశ లక్ష్మణరావు, జిల్లా నాయకులు కంగాల కల్లయ్య, మాజీ సర్పంచులు కంగాల భూ లక్ష్మి, గొంది లక్ష్మణరావు, మండల నాయకులు కుంజా అర్జున్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -