సత్యవీణ మొండ్రేటి… తన అక్షరాలతో సమాజంలో మార్పు తెచ్చేందుకు తపిస్తున్నారు. సమాజాన్ని అలుముకున్న రుగ్మతలను తన రచనల ద్వారా ప్రపంచం ముందు పెడుతున్నారు. ఏండ్లుగా సమాజాన్ని పట్టిపీడిస్తున్న కుల, మత, లింగ వివక్షలను రూపుమాపేందుకు అక్షరాలనే తన ఆయుధంగా మలుచుకున్నారు. అంతేకాదు వృద్ధులు, పేదలు, వికలాంగుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు తనవంతుగా సాయం అందిస్తున్న ఆమె పరిచయం ఆమె మాటల్లోనే…
నేను పుట్టి పెరిగింది కాకినాడలోని కొండయ్య పాలెం గ్రామంలో. అమ్మ సుబ్బాయమ్మ, నాన్న చిన్న వెంకట్రావు. నాన్న మున్సిపాలిటీలో ఉద్యోగం చేసేవారు. అమ్మ గృహిణి. వాళ్లకు మేము ముగ్గురు అమ్మాయిలం ముగ్గురు అబ్బాయిలం. నేను రెండో అమ్మాయిగా జన్మించాను. ఆప్యాయత అనురాగాల మధ్య, బంధుమిత్రుల సమక్షంలో ఆనందంగా గడిచింది నా బాల్యం. కొండయ్యపాలెంలోని మన్సిపల్ స్కూల్లో నా ప్రాథమిక విద్యను పూర్తి చేశాను. తర్వాత ఆండాలమ్మ కాలేజీలో ఇంటర్మీడియట్, పీఆర్ కాలేజీలో డిగ్రీ, పీజీ పూర్తి చేశాను. ఇలా చదువు మొత్తం కాకినాడలోనే పూర్తి చేశాను.
సాహిత్యంతో పరిచయం
నా చిన్నతనంలో తాతయ్య కొనిచ్చిన బాల బొమ్మల రామాయణం, బాల బొమ్మల భారతం పుస్తకాలతో నా సాహిత్య పరిచయం మొదలయింది. ఇలా చిన్నతనంలోనే ఎన్నో పుస్తకాలు చదివే అవకాశం నాకు దొరికింది. నేను రాయడానికి కారణం కూడా బాల్యంలో నేను చదివిన పుస్తకాలే. మల్లాదివెంకట కృష్ణమూర్తి, ముప్పాళ్ళ రంగనాయకమ్మ, కోడూరి కౌసల్య ఇలా ప్రముఖుల పుస్తకాలు చదివేదాన్ని. రచనల్లో వీళ్లే నాకు స్ఫూర్తి. కాలేజీ రోజుల్లో రాయడం మొదలుపెట్టాను. ఇప్పటి వరకు ప్రతిలిపిలో 200 వరకు కథలు రాశాను. అలాగే ప్రజా డైరీకి కథలు, కవితలు రాశాను. ఇప్పటి వరకు సత్యవాక్కులు, వీణానాధాలు, రామం భజే, విజ్ఞతా విపంచి, స్వామి స్వరాలు అనే పుస్తకాలు ముద్రించాను. అలాగే వెయ్యకి పైగా కవితలు, గజల్స్, రుబాయిలు రాసాను.
సాహిత్యమే ఔషధం
సాహిత్యం సమాజ దర్పణం.. సాహిత్యం ద్వారా సమాజాన్ని అలుముకొని ఉన్న రుగ్మతలకు ఔషధాన్ని అందించవచ్చు. నాటి స్వాతంత్య్ర సమరానికైనా, నేటి ఉద్యమాలకైనా విప్లవ సాహిత్యమే విజయ పతాకమని నా ఉద్దేశం. సమాజంలో ఉత్పన్నమవుతున్న ఎన్నో సమస్యలకు సాహిత్యమే పరిష్కార మార్గాలు చూపుతుంది. కలం అనేది రుధిర రహిత రణరంగ ఆయుధం.
సమాజం కోసం…
మనం రాసే అక్షరాలకు చేసే పనులకు పొంతన ఉండాలి. కాబట్టి కేవలం రాయడం మాత్రమే కాదు సమాజంలో మార్పు కోసం నా వంతుగా సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాను. నాకు చేతనైనంత వరకు నిర్భాగ్యులకు చేయూతనిస్తున్నాను. మలి వయసులో ఏ తోడూ లేక ప్రేమానురాగాల కోసం తపించిపోతున్న వృద్ధుల జీవితాలకు ఆసరా ఇస్తున్నాను. ఇది నాకెంతో తృప్తిని ఇస్తుంది. అలాగే నా రచనలతో సమాజంలో చైతన్యాన్ని కలిగించాలి. సమాజంలో కొందరైనా నా రచనలు చదివి జీవితాలను సరిదిద్దుకోవాలన్నా ఆకాంక్ష.. అలాగే నా శేష జీవితాన్ని సమాజ సేవా కార్యక్రమాలలో గడపాలని నిర్ణయించుకున్నాను. అందుకే ఎం.వి.వి.టి ఆశిష్ ఇంటర్నేషనల్ కల్చరల్ ఆర్గనైజేషన్ ద్వారా సమాజ సేవ చేస్తున్నాను. విద్యార్థులకు, వికలాంగులకు, బడుగు వర్గాలకు నాకు వీలైంతన చేయూతనందిస్తున్నాను.
పురస్కారాలు
సాహిత్య రంగంలోనూ, సేవా రంగంలోనూ నేను చేస్తున్న కృషికి గుర్తుగా అనేక పురస్కారాలు అందుకున్నాను. సాహితీ రత్న, శ్రీ శక్తి జాతీయ పురస్కారం, సాహిత్య సృజన, అంతర్జాతీయ మహిళా పురస్కారం, మదర్ థెరిస్సా పురస్కారం, సావిత్రిబాయి పూలే పురస్కారం, కవయిత్రి మొల్ల జాతీయ పురస్కారం, మహాకవి కాళిదాసు పురస్కారం… ఇలా ఎన్నో అందుకున్నాను. ప్రతి పురస్కారం కర్తవ్య సాధనవైపు నన్ను మరింత ముందుకు నడిపిస్తుందని నమ్ముతున్నాను.
సమ సమాజానికై…
నా కుటుంబ సహకారంతోనే నా రచనలను కొనసాగించగలుగుతున్నాను. గతంలో ఉద్యోగం చేసేదాన్ని. అప్పుడు కూడా నా రచనలకు అవరోధం కాలేదు నా ఉద్యోగం. అయితే పిల్లల చదువు కోసం జాబ్ మానేసాను. నా సమయాన్ని పిల్లలకు కేటాయించడంతో పాటు సాహిత్య అభివృద్ధికి కూడా ఉపయోగించుకున్నాను. అయితే పిల్లలు మరీ చిన్నగా ఉన్నప్పుడు కొన్ని రోజులు రాయడం ఆపాల్సి వచ్చింది. పిల్లలు సెటిలయ్యాక మళ్ళీ నా రచనలను ప్రారంభించాను. ఒక రచయిత్రిగా సమాజంలో ఉన్న మూఢ నమ్మకాలు, కులం, మతం, వర్ణ వివక్షలు, కలిమిలేముల కలతలు నా సాహిత్యం ద్వారా రూపుమాపి అరమరికలు లేని సమాజం కోసం వసుదైక కుటుంబం కోసం పాటుపడాలనేది నా లక్ష్యం. అలాగే మన మాతృ భాష తెలుగు అభివృద్ధి కోసం నా జీవితాన్ని అంకితం చేస్తాను.
- అచ్యుతుని రాజ్యశ్రీ



