2025లో ప్రపంచబ్యాంక్ ప్రపంచంలో నిరుపేదల సంఖ్య, అంటే బొత్తిగా ఏమీ లేనివారి సంఖ్య చాలా వేగంగా తగ్గిపోతున్నదంటూ ప్రకటించింది. ఈ తగ్గుదల ప్రత్యేకించి ఆసియా ఖండంలో ఎక్కువగా జరిగి నట్టు తెలిపింది. దీన్ని ఆధారం చేసుకుని ఇప్పటికే చాలా ప్రచారం జరిగింది. ప్రపంచబ్యాంక్ ప్రకటించినదే నిజం అయితే అది చాలా ఆనందాన్ని కలిగించే విషయమే. కాని ఆ ప్రకటన వాస్తవం కాదు. ఈ బూటకపు ప్రకటన ప్రపంచబ్యాంక్, ప్రభుత్వాలు గత కొన్ని దశాబ్దాలుగా ఆచరిస్తున్న గణాంకాల తారుమారు నుంచి పుట్టు కొచ్చింది. ఈ తప్పుడు పద్ధతి మీద ఎన్ని విమర్శలు వచ్చినా వాళ్లకి ఖాతరు లేదు. గత యాభై సంవత్సరాలుగా పేదలు చేసే ఖర్చు స్థాయిని తక్కువ చేసి చూపిస్తున్నారు. అంటే, ఆ కనీసస్థాయి ఖర్చు కన్నా ఎక్కువ ఖర్చు చేస్తున్న వారంతా పేదరికంలో లేనట్టే లెక్క. అందుచేత ఆ స్థాయిని ఎంత తక్కువ గా చూపితే పేదరికం అంత తక్కువగా ఉన్నట్టు చెప్పుకోవచ్చు. ఈ కనీస స్థాయిని కూడా క్రమంగా తగ్గిస్తూ వచ్చారు. ఇప్పుడు అది ఎక్కడి దాకా వచ్చిందంటే మనిషన్నవాడెవడూ అంత తక్కువ ఖర్చుతో బతకడం అసాధ్యం.
ఇండియాలో నిరుపేదలు జనాభాలో 5.25 శాతం మాత్రమే ఉన్నారంటూ ప్రపంచబ్యాంక్ ప్రకటించింది. తలసరి రోజు ఖర్చు రూ.62గా నిర్ధారించి అంతకన్నా తక్కువ ఆదాయం వస్తున్నవారు 5.25 శాతం మాత్రమే ఉన్నారని ప్రకటించింది. ఇక నీతి ఆయోగ్ 2022-23 నాటికి దేశంలో 5 శాతం మాత్రమే నిరుపేదలు ఉన్నట్టు ప్రకటించింది. గ్రామాల్లో రూ.57, పట్టణాల్లో రూ.69 చొప్పున రోజుకు తలసరి ఆదాయం గనుక వస్తే వారంతా నిరుపేదలు కానట్టే లెక్కించింది. ఈ సొమ్ముతో గ్రామాల్లో 2.9 లీటర్ల నీరు మాత్రమే వస్తుంది. అదే పట్టణాల్లో 3.5 లీటర్ల నీరు మాత్రం కొనగలుగుతారు. పేదరిక స్థాయి నిర్ధారించేటప్పుడు ఆ సొమ్ముతో రోజువారీ ఆహారపు అవసరాలతోబాటు వైద్యానికి, దుస్తులు వగైరాలకు, రవాణాకు, అద్దెకు కూడా చెల్లించగలిగేలా ఉండాలి. ఇప్పుడు నిర్ణయించిన స్థాయిలో బతకాలంటే వాళ్ళు ఇల్లూ వాకిలీ లేని బిచ్చగాళ్ళుగా మాత్రమే మిగులుతారు. ఈ లెక్కన చూస్తే మరో ఏడాది నాటికి ఇండియాలో నిరుపేదలు అనేవారే లేరంటూ ప్రభుత్వం ప్రకటించవచ్చు. ఎందుకంటే ఇంత తక్కువ స్థాయిలో బతకలేక ఆ నిరుపేదలంతా అప్పటికి చచ్చివూరుకుంటారు. కనీస పౌష్టికాహార స్థాయిని బట్టి పేదరికపు స్థాయిని గనుక నిర్ణయిస్తే అది ప్రభుత్వం నిర్ణయించినదానికి మూడు రెట్లైనా ఉంటుంది. ఆ స్థాయికి దిగువన ఇప్పుడు 65 శాతం ప్రజలు పడిపోయారు.
”సామర్ధ్యాన్ని పెంపొందించే శిక్షణ” పేరుతో మూడవ ప్రపంచ దేశాలలోని ఆర్థికవేత్తలకు పేదరికపు అంచనాల మీద శిక్షణ నివ్వడానికి ప్రపంచబ్యాంక్ తన సలహాదారు లను పంపుతోంది. వీళ్ల సలహా మేరకు చైనాలో పేదరికపు స్థాయిని నిర్ణయించారు. అక్కడ 1978 నాటి ధరల ప్రకారం ఏడాదికి వంద యువాన్లు వస్తే పేదరికంలో లేనట్టే లెక్క. దానిని 1997 ధరల స్థాయికి సవరించి, ఆహారేతర ఖర్చులను కూడా కలిపి రోజుకు తలసరి ఆదాయం 8.8 యువాన్లుగా తేల్చారు. ఆ సొమ్ముతో కేవలం 2.1 లీటర్ల మంచి నీరు మాత్రమే వస్తుంది. 2019 నాటికి ఈ ప్రాతిపదికన చైనాలో అసలు నిరుపేదలే లేకుండా పోయారు. దీనిని ఒక విజయంగా ప్రపంచబ్యాంక్ ప్రచారం చేసింది. ఆ తర్వాత 2020లో కనీసస్థాయిని పదకొండు యువాన్లకు పెంచారు. విశ్లేషకుల అంచనాల ప్రకారం ఇప్పటికీ చైనాలో కనీస స్థాయిలో జీవించాలంటే నెలకు తలసరి ఆదా యం కనీసం వెయ్యి యువాన్లు ఉండాలి. అధికారిక పేదరికపు స్థాయి కన్నా ఇది మూడు రెట్లు ఎక్కువ. ఈ మాత్రం ఖర్చు చేయలేని స్థితిలో ఉన్నవారు నేటికీ చైనా జనాభాలో ఐదో వంతు ఉన్నారు. అందుచేత అక్కడ నిరుపేదలు సున్నా శాతం అని, ఇండియాలో ఐదు శాతం అని చెప్పుకోవడం ఒట్టిమాటే.
అయితే, ఇటీవల చైనాలో శిక్షణ పొందిన పలువురు కార్యకర్తలను వేలాదిమందిని గ్రామీణ ప్రాం తాలకు పంపి అక్కడి ప్రజలు వాస్తవంగా గడుపుతున్న జీవనాన్ని పరిశీలించి నిరుపేదలుగా ఉన్నవారిని స్థానిక సంఘాల సహాయంతో గుర్తించి వారికి భారీ మొత్తాలను సహాయంగా అందించి వాళ్లు పేదరికం నుంచి బయట పడడానికి నిర్దిష్టమైన చర్యలను తీసుకోవడం మొదలుపెట్టింది. ఒకమేరకు అదే విధమైన పద్ధతిలో ఇక్కడ కేరళలో ప్రభుత్వం వలంటీర్ల, స్వచ్ఛంద సంస్థల నెట్‌వర్క్ సహాయంతో దుర్భర దారిద్య్రంలో బతుకుతున్న వారిని గుర్తించి వారికి తగు విధంగా పునరావాసానికి సహాయం అందించడంలో జయప్రదమైంది.
ప్రపంచబ్యాంక్ మాత్రం ఇటువంటిదేమీ చేయడం లేదు. నిరుపేదరికపు స్థాయిని అమెరికన్ డాలర్లలో రోజుకు మూడు డాలర్లుగా నిర్ధారించింది. ఆ ప్రకారం చూస్తే ఇప్పుడు డాలరు-రూపాయి మారకపు విలువ ప్రకారం పేదరికపు స్థాయి రూ.270గా ఉండాలి. కాని వాస్తవ మారకపు రేటు ప్రకారం కాకుండా అందులో 0.28 శాతం రేటు ప్రకారం మాత్రమే లెక్కిస్తోంది! ఇక్కడి అధికారిక పేదరిక స్థాయికి దగ్గరగా ఉండేట్టు వాస్తవ మారకపు రేటును సవరిస్తోంది!
ఇలా వివిధ దేశాల్లో అధికారిక లెక్కల్లో పేదరికపు స్థాయిని ఎందుకింత హీనమైన స్థాయికి దిగజార్చు తున్నారు? ఆ స్థాయిలో ప్రాణాలను నిలబెట్టుకోవడమే అసాధ్యం అన్న వాస్తవాన్ని తెలిసి కూడా ఎందుకిలా చేస్తున్నారు? చాలా దశాబ్దాలుగా ప్రభుత్వాలు ఈ పేదరికపు స్థాయిని లెక్కించే విధానాన్ని పౌష్టికాహార లభ్యత అన్న అంశంతో విడగొట్టి లెక్కించడం మొదలుపెట్టాయి. ఇది ప్రపంచబ్యాంక్ ఆదేశాల మేరకే జరుగుతోంది. మొట్టమొదట లెక్కించిన కనీస పేదరిక స్థాయి మాత్రమే సరైన పద్ధతిలో, కనీస స్థాయి పౌష్టికాహార లభ్యత అన్న ప్రమాణాన్ని పాటిస్తూ నిర్ధారించడం జరిగింది. ఇక ఆ తర్వాత లెక్కించిన ప్రతీసారీ, మొదటి లెక్క ప్రకారం నిర్ధారించిన దానిని ధరల సూచీ ఆధారంగా సవరిస్తూ వచ్చారు. అలా సవరించిన తర్వాత ఆ సొమ్ముతో కనీస పౌష్టికాహారం పొందగలుగుతున్నారా లేదా అన్నది మాత్రం ఎక్కడా పరిశీలించిన పాపాన పోలేదు. ఈ ధరల సూచీని లెక్కించే విధానం ఏమిటి? కొన్ని కనీస అవసరాలైన వస్తువులను, సేవలను కలిపి వాటిలో ఏది ఎంత అవసరమో నిర్ధారిస్తారు.ఆ ప్రకారం ఆ వస్తువులను, సేవలను పొందడానికి ఎంత ఖర్చవుతుందో నిర్ణయిస్తారు. ఇది ప్రారంభ సంవత్సరంలో మాత్రమే. దానిని బేస్ ఇయర్ (ప్రాతిపదిక సంవత్సరం) అంటారు ఇక ఆ తర్వాత లెక్కించిన ప్రతీసారీ వాటి వాస్తవ ధరలలో వచ్చిన మార్పులను పట్టించుకోరు. మొత్తం మార్కెట్‌లో ధరల హెచ్చుతగ్గులను బట్టి సవరిస్తూంటారు.
ఇండియాలో ఈ బేస్ ఇయర్ 1973. చైనాలో అది 1978. 1973లో ఇండియాలో కనీస స్థాయి లెక్క వేసినప్పుడు గనుక అప్పటి ప్రభుత్వం ”మేము 1921 నాటి ధరలను తీసుకుని వాటిని ఆ తర్వాత పెరిగిన రేటు ప్రకారం సవరిస్తాం” అనిగాని ప్రకటించి వుంటే ఎంత హాస్యాస్పదంగా ఉండేది? అప్పుడు ప్రభుత్వం అలా చేయలేదు. ఆనాటి వాస్తవ ధరలనే లెక్కలోకి తీసుకుంది. కాని ఇప్పడు ప్రభుత్వంగాని, ప్రపంచ బ్యాంక్ గాని 52 సంవత్సరాల క్రితపు ధరల ప్రాతిపదిక మీదనే లెక్కిస్తామంటున్నాయి! ఈ దేశంలో చదువుకున్న పబ్లిక్ ఎవరికీ ఈ ప్రభుత్వం, ప్రపంచబ్యాంక్ అనుసరిస్తున్న పద్ధతి ఎంత అర్ధరహితమో తెలియదు గనుకనే ప్రభుత్వపు ఆటలు సాగుతున్నాయి.
1973 నాటికి గ్రామీణ భారతంలో రోజుకు 2200 కేలరీల శక్తినిచ్చే ఆహారాన్ని కనీసం తీసుకోగల గాలంటే ఒక వ్యక్తికి నెలకు రూ.49 ఆదాయం అవసరం అని నిర్ధారించారు. ఆ మేరకు ఆదాయం పొందలేక పోతున్నవారు ఆనాటికి 56.4 శాతం జనాభా ఉన్నారు. ఇది దాదాపు వాస్తవ పరిస్థితిని సూచించింది. అదే పౌష్టికాహార ప్రమాణాలను అనుసరించి 2011-12లో లెక్కించినప్పుడు నెలకు ఒక వ్యక్తికి గ్రామీణ ప్రాంతంలో కనీసం రూ.1320 ఖర్చు అవుతుందని తేలింది. ఆ ప్రకారం ఆదాయం పొందలేకపోతున్నవారు 66.8 శాతం అని లెక్క వస్తోంది. అంటే నిరుపేదలు 56.4 నుండి 66.8 శాతానికి గణనీయంగా పెరిగారని కనిపిస్తోంది. కాని ప్రభుత్వం ఆ విధంగా పౌష్టికాహార లభ్యత అన్న ప్రమాణాన్ని పరిగణించకుండా కేవలం 1973 నాటి ధరలను 2011-12 నాటి ధరల సూచీలో వచ్చిన పెరుగుదలను బట్టి సవరించి అధికారిక పేదరిక స్థాయిని రూ.816గా నిర్ధారించింది. ఆ మేరకు ఆదాయం పొందలేకపోతున్నవారు 25.7 శాతం మాత్రమేనని ప్రకటిం చింది. పౌష్టికాహార లభ్యత ప్రమాణంగా లెక్కించిన దానికి, అంటే రూ. 1320కి ప్రభుత్వ లెక్కకి తేడా ఎంత వచ్చిందో చూడండి ! అంటే వాస్తవంగా పౌష్టికాహారం పొందలేకపోతున్నవారినందరినీ లెక్కించే బదులు, చాలా తక్కువమందిని మాత్రమే నిరుపేదలుగా గుర్తించడం జరిగిందన్నమాట.
ఇలా ప్రతీసారీ అధికారిక లెక్కలు పేదరిక స్థాయిని అంతకంతకూ తగ్గిస్తూనే వస్తున్నాయి. అది కాస్తా ఇప్పుడు అసందర్భమైన, అర్ధం లేని స్థాయికి చేరింది. ఇలా జరుగుతుందని నేను 2013లో ఒక వ్యాసంలో హెచ్చరించాను కూడా. ప్రభుత్వం నిర్ణయించిన పేదరిక స్థాయి కనీసం ప్రాణాలనైనా నిలబెట్టుకో డానికి కూడా పనికిరాదు. ఆ నిరుపేదలు జీవించివుండరు. అందుచేత మా దేశంలో నిరుపేదలే లేరు అని చెప్పుకోవడం కన్నా అర్ధం లేనిది ఏమైనా ఉంటుందా? మనకన్నా చాలా ఆలస్యంగా పేదరిక స్థాయిని లెక్కించడం మొదలు బెట్టినందువల్ల చాలా ఆఫ్రికన్ దేశాలలో ఇప్పుడున్న కనీస పేదరిక స్థాయి మన దేశంలోని స్థాయి కన్నా ఎక్కువగానే ఉంది.
ఇండియాలో యాభై ఏండ్ల క్రితం ఏయే వస్తువులను, సేవలను కనీస అవసరాల ప్రాతిపదిక నిమిత్తం తీసుకున్నారో, అవే వస్తువులు, సేవలు నేటికీ కొనసాగుతున్నాయని కాసేపు అనుకుందాం. నిజానికి కాలాను గుణంగా కనీస అవసరాలు మారుతూవుంటాయి. ఆ మార్పును పరిగణనలోకి తీసుకోవాలి. కాని అలా తీసుకోక పోయినప్పటికీ, పాత స్థాయిలోనే అవసరాలు కొనసాగుతున్నాయని అనుకున్నప్పటికీ, వాటిలో వచ్చిన మార్పుల నైనా పరిగణనలోకి తీసుకోవాలి కదా. యాభై సంవత్సరాల క్రితం విద్య, వైద్యం ప్రభుత్వ వ్యవస్థ ద్వారా అందు తూ వుండేవి. అప్పుడు వాటి కోసం చేయవలసిన ఖర్చు నామమాత్రంగా ఉండేది. ఇప్పుడు ఆ సేవలు ప్రయి వేటు పరమయ్యాయి. వాటి ధరలు శరవేగంగా పెరిగిపోతూ వున్నాయి.ఇటు వైద్యానికి, చదువుకు, అటు ఆహారానికి ఖర్చు సర్దుబాటు చేయడం చాలా కుటుంబాలకు అసాధ్యం అయిపోతోంది. దీని వలన ఎక్కువమంది పేదల పౌష్టికాహార స్థాయి పడిపోతోంది. అంతేగాక, ఇంతవరకూ పేదలుగా పరిగణించబడనివారు కూడా ఇప్పుడు పేదరికస్థాయికి దిగువకు జారిపోతున్నారు. జాతీయ శాంపిల్ సర్వే గణాంకాల ప్రకారం ఇండియాలో గ్రామాల్లోను, పట్టణాల్లోను తలసరి పౌష్టికాహార లభ్యత చాలా వేగంగా పడిపోయింది.
ఒలింపిక్ క్రీడల్లో హైజంప్ చేసే క్రీడాకారుడు ఎంత ఎక్కువ ఎత్తు దాటి దూకగలిగితే అంత గొప్ప. అదే క్రీడాకారుడు గనుక తాను దాటవలసిన జంప్ బార్ (దాని పైకి ఎగిరి దూకాలి) ఎత్తును క్రమంగా తగ్గించు కుంటూ, తానే ఛాంపియన్‌ని అని చెప్పుకోవడం ఎంత అడ్డగోలుగా ఉంటుంది? ఒక స్కూల్ ప్రిన్సిపాల్ పరీక్షల్లో పాస్‌మార్క్‌ను 50 నుంచి 2కి తగ్గించి తన స్కూల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించినట్టు ప్రకటిస్తే ఎలా ఉంటుంది? వెంటనే ఆ ప్రిన్సిపాల్‌ను ఉద్యోగంలోంచి వెళ్లగొడతారు. కాని ఇదేమాదిరి తప్పుడు విధానాన్ని అమలు పరుస్తున్న ప్రపంచబ్యాంక్‌ను శిక్షంచే అంతర్జాతీయ వేదిక ఏదైనా ఉందా? ఐరాస ప్రత్యేక ప్రతినిధిగా నియ మించబడిన ఫిలిప్ ఆల్స్‌టన్ 2020లో నిష్టదరిద్రం మీద, మానవ హక్కుల ఉల్లంఘన మీద తీవ్ర ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయంటూ సమర్పించిన నివేదికను ప్రపంచబ్యాంక్ తోసిపుచ్చింది. ఆ నివేదిక ప్రపంచబ్యాంక్ పేదరికాన్ని లెక్కించ డానికి అనుసరిస్తున్న పద్ధతులు ఎంత అవాస్తవికమో ఎత్తి చూపింది. ఒక పక్క పెరుగుతున్న విద్య, వైద్యపు ఖర్చులతో కోట్లాదిమంది అదనంగా పేదరికంలోకి అనునిత్యమూ దిగజారి పోతూ వుంటే, కనీస పౌష్టికాహార లోపం వారిని జీవచ్ఛవాలుగా చేస్తూ వుంటే, మరోపక్క ప్రపంచబ్యాంక్ తన తప్పుడు లెక్కలతో నిరుపేదలు తగ్గిపోయారంటూ ప్రకటిస్తూ వారిని అవహేళన చేస్తూనే వుంది.
(స్వేచ్ఛానుసరణ)
ఉత్సా పట్నాయక్
పేదరికంపై ప్రపంచబ్యాంకు జిమ్మిక్కు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



