కార్పోరేట్ వ్యవస్థలో కుబేరుల సంఖ్య పెరుగుతున్నది. దేశానికి తిండి పెట్టే కర్షకులు మాత్రం ఆర్ధికంగా అధ:పాతాళంలోకి నెట్టబడుతున్నారు. గతంలో కంటే ప్రస్తుతం వ్యవసాయ రంగం నుండి లభిస్తున్న ఆదాయం తక్కువ. దేశ స్థూల జాతీయోత్పత్తిలో దీని వాటా 16.285 శాతం. విద్య,ఉపాధి అవకాశాల పెరుగుదలతో వ్యవసాయం రంగం మీద ఆధార పడే వారి సంఖ్య నేడు గణనీయంగా తగ్గింది. దేశంలో అత్యధిక జీడీపీ కంట్రిబ్యూటర్‌గా సర్వీసు రంగం సుమారు 55 శాతంతో అగ్రభాగంలో ఉంది. అయితే ఈనాటికీ అధిక శాతం మందికి ఉపాధి కల్పిస్తున్నది వ్యవసాయ రంగమే. 42 శాతం మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తుండగా, పరోక్షంగాను, ప్రత్యక్షంగాను దేశ జనాభా మొత్తంలో సుమారు 62 శాతం మందికి వ్యవసాయమే ప్రధాన జీవనాధారం.అయితే కర్షక జనజీవితం నిరంతరం ఒక మహా పోరాటంలా మారిపోయింది.
కష్టాలు కర్షకుల జన్మహక్కుగా మారిపోయి, కన్నీరు వారికి పేటెంట్ హక్కుగా మిగిలిపోయింది. అన్ని రంగాలు ఏదో ఒక సమయంలో నష్టాలు ఎదుర్కోక తప్పదు. ఇది జగమెరిగిన సత్యం. కాని పుట్టి పెరిగినప్పటి నుండి పోయేదాక ప్రకృతితో పోరాడుతూ, పెట్టుబడుల కోసం అందరికాళ్లు పట్టుకుంటూ, పంట వేసి, ఫలసాయం వచ్చేవరకు క్రిమి కీటకాలపై నిరంతరం యుద్ధం చేస్తూ అలసిపోయిన రైతన్నకు తీరా పంట చేతికొచ్చాక, దళారుల దగాకు బలైపోవడం సర్వసాధారణ అంశమైంది. అయినప్పటికీ కాడికి తెగనమ్ముకుని, అప్పులు తీర్చలేక భూములు తెగనమ్ముకోవడమో, ఇతర ప్రాంతాలకు వలసపోయి కూలీలుగా మారడం జరుగుతున్నది. అప్పులిచ్చిన వారి ఒత్తిళ్లు భరించలేక, అభిమానం చంపుకోలేక, ఆత్మహత్యలను తమ ఆర్థిక సమస్యలకు ఏకైక పరిష్కారంగా భావించి తనువు చాలిస్తున్న కర్షక జీవుల యథార్ధ గాథలను ఆలకించేవారు లేరు. కోట్లాది మందికి, ఆహారభద్రతను కల్పిస్తూ తన బతుకుకు భద్రత లేని వాతావరణంలో బతుకీడుస్తున్న రైతన్నల బాధలను రేఖామాత్రంగానైనా స్పృశించ గలుగుతున్నారా? అన్నదాతల ఆక్రందనలను జాతీయ సమస్యగా ఎందుకు పరిగణించడం లేదు?కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాధానం చెప్పాలి. అందరూ వాడే నిత్యావసర సరుకుల్లో చాలావరకు రైతులు పండించినవే ఉన్నాయి. వాటి ధరలు నేడు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఆ ఉత్పత్తులను పండించి రైతులు పంటలను మార్కెట్‌లోకి తీసుకెళ్తే ధర లేదంటున్నారు. ఎందుకింత వ్యత్యాసం? రైతన్నల వద్ద కారుచౌకగా కొనేసిన వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్‌లో తీసుకొచ్చేటప్పటికి అమాంతం రేట్లుపెంచి అమ్ముతున్నారు. దీనిపై మేధో మధనం జరగాలి.
ప్రముఖ వ్యవసాయ నిపుణుడు, జన్యుశాస్త్రవేత్త, ఎమ్.ఎస్.స్వామినాథన్ అధ్యక్షతన 2004లో ఏర్పడిన నేషనల్ కమిషన్ ఆన్ ఫార్మర్స్ (ఎన్.సి.ఎఫ్) కేంద్ర ప్రభుత్వానికి రైతులపై ఆరు నివేదికలు రూపొందించి పలు సిఫార్సులు సూచించింది. ఆహార భద్రత, బీమా సౌకర్యం, సాగు నీరు, భూసంస్కరణలు, రైతుల ఆత్మహత్యల నివారణ వంటి పలు అంశాలను, వాటికి పరిష్కార మార్గాలను సూచించడమే కాకుండా రైతులకు ప్రధాన సమస్యగా మారిన కనీస మద్దతు ధరపై స్వామినాథన్ కమిటీ పలు సిఫార్సులు చేసింది. రెండు దశాబ్దాలు గడిచినా ఇంకా స్వామినాథన్ సిఫార్సులు అమలుకు నోచుకోక పోవడం బాధాకరం. పంట రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించడం, కనీస మద్దతు ధర పెంచడం, ఆత్మహత్యల నివారణ, నీటి సౌకర్యం మెరుగుదల, రైతులకు రుణ సదుపాయాలను పెంచడం, ఆహార ఉత్పత్తులు పెరిగితే దిగుమతులు నిషేధించడం కష్టకాలంలో రైతుల రుణాలపై ఒత్తిడి చేయకుండా ఉండడం వంటి అనేక రైతు సంబంధిత అంశాలను రూపొందించిన స్వామినాథన్ సిఫార్సులు ఇప్పటికైనా అమలు చేయాలి. క్షేత్రస్థాయిలో కర్షకులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపాలి. మన దేశం ఏయే వ్యవసాయ ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంది? ఆదిగుమతులను అరికట్టి, దిగుమతి చేసుకుంటున్న వ్యవసాయ ఉత్పత్తులను మన రైతులే పండించే ఏర్పాట్లను ప్రభుత్వాలు చేయాలి. పరిశ్రమలకు, కార్పోరేట్ వ్యవస్థలకిచ్చే ప్రోత్సాహకాలు రైతులకు కూడా వర్తింపచేయాలి. వ్యవసాయాన్ని గౌరవ ప్రదమైన, లాభదాయకమైన వృత్తిగా తయారుచేయాలి. కర్షకులపై విద్యుత్ భారం మోపే చర్యలను విడనాడాలి. మధ్యతరగతి రైతులకు ప్రభుత్వాలు అండగా నిలవాలి. అదే డిసెంబర్ 23 నిజమైన రైతు దినోత్సవం.
– సుంకవల్లి సత్తిరాజు, 9704903463
కర్షకులకు కన్నీరేనా?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



