Tuesday, December 23, 2025
E-PAPER
Homeఆటలుమళ్లీ బౌలర్లు రాణిస్తేనే..

మళ్లీ బౌలర్లు రాణిస్తేనే..

- Advertisement -

నేడు భారత్‌, శ్రీలంక మహిళల మధ్య రెండో టీ20

విశాఖపట్నం: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌ను నెగ్గిన భారత మహిళలజట్టు తొలిసారి శ్రీలంకతో సిరీస్‌కు సిద్ధమైంది. ఐదు టి20ల సిరీస్‌లో భాగంగా ఆదివారం శ్రీలంకతో జరిగిన తొలి టి20లో భారత మహిళలు సమిష్టిగా రాణించారు. తొలుత బౌలర్లు రాణించి శ్రీలంకను కేవలం 121 పరుగులకే పరిమితం చేయగా.. అనంతరం జెమీమా రోడ్రిగ్స్‌ అర్ధసెంచరీతో మెరిసింది. దీంతో లంక నిర్దేశించిన 122 పరుగుల లక్ష్యాన్ని భారతజట్టు కేవలం 14.4 ఓవర్లలో 2వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. తొలి టి20లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన లంక.. ఆద్యంతం తడబడింది. కెప్టెన్‌ చమరి ఆటపట్టు (15)ను క్రాంతి బౌల్డ్‌ చేయడంతో లంక కష్టాలు మొదలయ్యాయి. ఆ తర్వాత భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయగా.. ఫీల్డర్లూ రాణించడంతో లంక పరుగుల కోసం చెమటోడ్చాల్సి వచ్చింది.

ఇన్నింగ్స్‌ ముందుకు సాగేకొద్దీ లంక కష్టాలు పెరిగాయి. చివరి ఓవర్లలోనూ స్కోరు వేగం పెరగలేదు. అనంతరం ఛేదనలో బంతికో పరుగు చొప్పున చేయాల్సిన భారత్‌.. ఆరంభంలోనే షెఫాలి (9) వికెట్‌ కోల్పోయినప్పటికీ, ఇబ్బంది పడలేదు. జెమీమా వచ్చీ రాగానే బ్యాటుకు పని చెప్పింది. అలవోకగా బౌండరీలు బాదింది. మంధాన (25)తో రెండో వికెట్‌కు 54 పరుగులు జోడించిన ఆమె.. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ (15నాటౌట్‌)తో అభేద్యమైన మూడో వికెట్‌కు 55 పరుగులు జోడించి జట్టుకు తిరుగులేని విజయాన్నందించింది. దీంతో భారత్‌ 32 బంతులుండగానే మ్యాచ్‌ను ముగించింది. ఈ గెలుపుతో ఐదు టి20ల సిరీస్‌లో భారత్‌ 1-0 ఆధిక్యతలో నిలిచింది. తొలి రెండు టి20లో విశాఖపట్నంలోని ఎసిఎ-విడిసిఎ మైదానంలో జరగనుండగా.. మూడు, నాలుగు, ఐదు టి20లో తిరువనంతపురం వేదికగా జరగుతాయి.

జట్లు(అంచనా)
భారత మహిళలజట్టు : హర్మన్‌ప్రీత్‌(కెప్టెన్‌), మంధాన, షెఫాలీ వర్మ, రోడ్రిగ్స్‌, రీచా ఘోష్‌(వికెట్‌ కీపర్‌), దీప్తి శర్మ, అమన్‌జ్యోత్‌ కౌర్‌, అరుంధతి రెడ్డి, వైష్ణవి శర్మ, క్రాంతి గాడ్‌, శ్రీచరణి.
శ్రీలంక మహిళలజట్టు : ఆటపట్టు(కెప్టెన్‌), గుణరత్నే, పెరీరా, సమరవిక్రమ, నీలాక్షి డి-సిల్వ, కవిషా దిల్హారి, కౌశని సత్యంగణా(వికెట్‌ కీపర్‌), ఇనోకా రణవీర, మాధర, కావ్య కావింది, శశినీ గిమ్హా.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -