ఆది సాయి కుమార్ హీరోగా షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘శంబాల’. యగంధర్ ముని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో అర్చన అయ్యర్, స్వసిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్ తదితరులు కీలక పాత్రల్ని పోషించారు. ఈ సినిమాను ఈనెల 25న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు హీరోలు మంచు మనోజ్, కిరణ్ అబ్బవరం, ప్రియదర్శి, సంగీత దర్శకుడు తమన్, దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు నవీన్ యెర్నెని, టీజీ విశ్వ ప్రసాద్, అశ్విన్ బాబు, మైత్రి శశి వంటి ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ,’ఈ సినిమా మీద ముందు నుంచీ పాజిటివ్ వైబ్ ఉంది. యుగంధర్ ముని మంచి దర్శకుడు. ఈసారి ఆదికి మంచి సక్సెస్ రావాలని అందరం కోరుకుంటున్నాం’ అని తెలిపారు.
‘ట్రైలర్ బాగుంది. నిరంతరం కష్టపడుతూ ఉండే ఆదికి ఈ చిత్రంతో బ్లాక్ బస్టర్ రావాలి. యుగంధర్‌కి సినిమా పట్ల చాలా ప్యాషన్ ఉంది. కథను నమ్మి ఇంత ఖర్చు పెట్టిన నిర్మాతలకు హ్యాట్సాఫ్’ అని మంచు మనోజ్ చెప్పారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ,’ఆది ఎన్నో జోనర్లను ట్రై చేశాడు. అద్భుతమైన నటుడు. ఈ చిత్రంతో ఆదికి మంచి విజయం దక్కాలి. పటాస్’కి సాయి కుమార్ చేసిన సహకారాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈనెల 25న ‘శంబాల’ బ్లాక్ బస్టర్ అనే టాక్‌ను ఆయన విని సంతోషించాలి’ అని తెలిపారు. సాయి కుమార్ మాట్లాడుతూ,’మా అమ్మానాన్నలతో మొదలైన సినీ ప్రయాణం ప్రేక్షకుల ఆదరణతో ఇంకా కొనసాగుతోంది. జయాపజయాలతో సంబంధం లేకుండా మా కోసం నిలబడిన అభిమానులకు థ్యాంక్స్. అభిమానుల పేరు, నా పేరుని ఈసారి ఆది నిలబెడతారు. ఈ సినిమాతో ఆదికి చిత్రోత్సాహం, నాకు పుత్రోత్సాహం, టీంకు విజయోత్సాహం రావాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
గత ఏడాది డిసెంబర్‌లో ‘శంబాల’ ఫస్ట్ పోస్టర్ నుంచి అందరూ సపోర్ట్ చేస్తూ వచ్చారు. టీజర్‌ను దుల్కర్ రిలీజ్ చేశారు. ప్రభాస్, నాని రిలీజ్ చేసిన ట్రైలర్‌లు అంచనాల్ని పెంచేశాయి. యుగంధర్ ముని అద్భుతంగా తీశాడు కాబట్టే ఈ రోజు చిత్రంపై హైప్ ఏర్పడింది. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ మూవీని రూపొందించారు. ప్రవీణ్ విజువల్స్, శ్రీచరణ్ ఆర్‌ఆర్ సినిమాకు ప్రధాన ఆకర్షణ అవుతుంది. ఇందులో అందరూ అద్భుతంగా నటించారు. థియేటర్లో అందరూ మా మూవీని చూసి సర్‌ప్రైజ్ అవుతారు. ఈ చిత్రాన్ని థియేటర్లో చూస్తేనే ఆ ఫీల్‌ను ఎంజాయ్ చేస్తారు. ‘శంబాల’తో మేం ఈనెల 25న హిట్టు కొట్టబోతున్నాం. -హీరో ఆది సాయి కుమార్



