Tuesday, December 23, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలు45 టీఎంసీలకు లేఖ రాయడం చారిత్రక తప్పిదం

45 టీఎంసీలకు లేఖ రాయడం చారిత్రక తప్పిదం

- Advertisement -

తెలంగాణ ప్రజలకు మంత్రి ఉత్తమ్‌ క్షమాపణ చెప్పాలి
పాలమూరు బిడ్డ అంటూ మోసం చేస్తున్న రేవంత్‌రెడ్డి
ఏపీకి, ఢిల్లీకి భయపడుతున్న సీఎం
నల్లగొండ, పాలమూరు, రంగారెడ్డి జిల్లాల్లో సభలు పెడతాం
ఊరూరా డప్పుకొట్టి ప్రజల్లోకి వెళ్తాం : మాజీమంత్రి హరీశ్‌రావు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణానికి 45 టీఎంసీలు చాలంటూ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లేఖ రాయడం చారిత్రక తప్పిదమని మాజీమంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. తెలంగాణ ప్రజలకు ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆ లేఖను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి 90 టీఎంసీలకు బీఆర్‌ఎస్‌ హయాంలో కేంద్ర ప్రభుత్వం అటవీ, పర్యావరణ వంటి ఏడు అనుమతులను ఇచ్చిందని గుర్తు చేశారు.

90 టీఎంసీ లకు సంబంధించి 2022లో జీవో నెంబర్‌ 246ను జారీ చేశామని వివరించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం డీపీఆర్‌ను వెనక్కి తెచ్చిందన్నారు. ఏడు నెలలవుతున్నా ప్రభుత్వం కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తేవడం లేదని ప్రశ్నించారు. ఏపీలో చంద్రబాబు, ఢిల్లీలో మోడీకి సీఎం రేవంత్‌రెడ్డి భయపడుతున్నారని అన్నారు. 90 టీఎంసీలను 45 టీఎంసీలకు తగ్గించి తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసున్నారని విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణానికి రూ.27 వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. 2014 నుంచి 2023 వరకు 17.24 లక్షల ఎకరాల భూమి కి సాగునీరు అందించామని అన్నారు. మిషన్‌ భగీరథ, చెక్‌డ్యామ్‌ల ద్వారా 31 లక్షల ఎకరాల భూమిని స్థిరీకరించామని వివరించారు.

బీఆర్‌ఎస్‌ హయాం లో మొత్తం 48 ఎకరాల భూమికి నీళ్లిచ్చామని అన్నారు. 2024-25లో 6,55,895 ఎకరాలకు, 2025-26లో 5,05,000 ఎకరాలు కలిపి మొత్తం 11 వేల ఎకరాలకు నీళ్లిస్తామన్నారనీ, ఎక్కడ ఇచ్చారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. అసెంబ్లీ సాక్షిగా తప్పు చెప్పానంటూ క్షమాపణ చెప్పాలని కోరారు. ప్రాజెక్టులు, చెక్‌డ్యామ్‌లను కూల్చివేస్తున్న అసలైన ఉగ్రవాది రేవంత్‌రెడ్డి అని ఆరోపించారు. ఎస్‌ఎల్‌బీసీ కుప్పకూలితే శవాలను బయటకు తీయలేని చాతగాని ప్రభుత్వమని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి నీటి ప్రయోజనాలు పట్టడం లేదన్నారు. ఈ ద్రోహాన్ని వదిలిపెట్టబోమని చెప్పారు. పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో ఊరూరా డప్పు కొట్టి ప్రజల్లోకి వెళ్తామన్నారు. ఆయా జిల్లాల్లో సభలు నిర్వహిస్తామని అన్నారు. 90 టీఎంసీల కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్‌ చేశారు.

కేసీఆర్‌ స్టేట్స్‌మెన్‌… రేవంత్‌ స్ట్రీట్‌ రౌడీ
బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ స్టేట్స్‌మెన్‌ అనీ, సీఎం రేవంత్‌రెడ్డి స్ట్రీట్‌ రౌడీలా మాట్లాడుతున్నారని హరీశ్‌రావు విమర్శించారు. రేవంత్‌ మరుగుజ్జు మనస్తత్వం ఉన్న వ్యక్తి అని చెప్పారు. కేసీఆర్‌ వ్యక్తిత్వం హిమాలయాల ఎత్తుంటే, రేవంత్‌ చిల్లల రాజకీయాలు చేస్తూ సంకుచిత మనస్తత్వంతో ఉన్నారని అన్నారు. త్యాగాల చరిత్ర తమదనీ, వెన్నుపోటు చరిత్ర వారిదని చెప్పారు. సోనియాను దేవత అనీ, బలిదేవత అన్నారని గుర్తు చేశారు. ఆసరా పెన్షన్‌ రూ.నాలుగు వేలు, మహిళలకు రూ.2,500 ఎప్పుడిస్తారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఫార్మాసిటీని ఎందుకు రద్దు చేశారని అడిగారు. రేవంత్‌రెడ్డికి నీతి, జాతి, విలువలున్నాయా?అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌, ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌, నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్‌ తదితరులు పాలొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -