సీపీఐ(ఎం)
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సామాజిక కార్యకర్త, అనాధాశ్రమాన్ని నిర్వహిస్తున్న గాదె ఇన్నయ్యను ఎన్‌ఐఏ అధికారులు అప్రజాస్వామికంగా అరెస్టు చేయడాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘మావోయిస్టు నేత కాతా రామచంద్రారెడ్డి అంత్యక్రియల్లో పాల్గొని అక్కడ జరిగిన సభలో మావోయిస్టులకు అనుకూలంగా మాట్లాడారనే నెపంతో ఈ అరెస్టు జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు. ఆపరేషన్ కగార్, కేంద్ర ప్రభుత్వ నిరంకుశ ధోరణులను వ్యతిరేకిస్తున్నవారిని, సామాజిక సమస్యలపై స్పందించే వ్యక్తులను అరెస్టులు చేయడం ప్రజాస్వామిక గొంతుకలను అణచివేయడమే. ఇన్నయ్య అరెస్టును భావవ్యక్తీకరణ స్వేచ్ఛపై జరిగిన దాడిగా భావిస్తున్నాం. ప్రజాస్వామిక వాదులందరూ ఈ అరెస్టును వ్యతిరేకించాలి’ అని పేర్కొన్నారు.



