Tuesday, December 23, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్ఒప్పందాలు సరే… పరిశ్రమలేవీ?

ఒప్పందాలు సరే… పరిశ్రమలేవీ?

- Advertisement -


కాగితాల్లోనే లక్షల కోట్లు… 20 శాతం కూడా గ్రౌండ్‌ కాని వైనం
‘దావోస్‌’ అంటూ రాజకీయ ప్రచారం…ఫాలోఅప్‌ శూన్యం
2014 నుంచి ఇదే తీరు
ప్రత్యేక రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన ఒప్పందాల విలువ రూ.8.14 లక్షల కోట్లు
కానీ కానరాని కర్మాగారాలు… నిరుద్యోగులకు దొరకని ఉపాధి
తాజాగా గ్లోబల్‌ సమ్మిట్‌లో రూ.5.75 లక్షల కోట్ల ఒప్పందాలు
ఎన్నొస్తాయో డౌటే!

పొద్దునే పేపర్‌ చూడగానే తాటికాయంత అక్షరాలతో రాష్ట్రంలో రూ.లక్షల కోట్ల పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయనే వార్తలు నిత్యం కనిపిస్తుంటాయి. ఆ అంకెల్ని చూసి ప్రజలు అబ్బురపడతారనీ, ప్రభుత్వ పనితీరును ప్రశంసిస్తారని పాలకులు భావిస్తున్నారు. ఈ తరహా ప్రచారం ఇప్పుడే వచ్చింది కాదు. 2014 నుంచి ప్రభుత్వాధినేతలది ఇదే తీరు. ఈ ప్రకటనలు వాస్తవమని విశ్వసిస్తే, రాష్ట్రం లో దారిద్య్రం, నిరుద్యోగం వంటి మాటలకు తావే ఉండకూడదు. కానీ రేషన్‌షాపుల వద్ద సబ్సిడీ బియ్యం కోసం లక్షల మంది పేదలు పడిగాపులు కాస్తున్న వాస్తవ ఘటనలు కండ్లముందే ఉన్నాయి. మరి సర్కారు వారి లక్షల కోట్ల ఒప్పందాలు, పెట్టుబడులు, పరిశ్రమలు ఎటుపోతున్నాయి? వాటిలో నిజమెంత? రాజకీయ ప్రచార ప్రయోజనాలు ఎంత? ఓసారి శల్యపరీక్ష చేద్దాం!!

ఎస్‌ఎస్‌ఆర్‌ శాస్త్రి

రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయని ప్రభుత్వా లు చెప్తున్నాయి. దానిలో మొదటిగా తెలంగాణ ప్రభుత్వం 2014 నుంచి 2025 వరకు దావోస్‌ ప్రపంచ వాణిజ్య వేదికపై ప్రకటించిన పెట్టు బడి ఒప్పందాలు, వాటి అమలు, ఎదురవుతున్న ఇబ్బందుల్ని పరిశీలి ద్దాం. ఆ తర్వాత తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ గురించి ప్రస్తా విద్దాం. 2014 నుంచి 2025 వరకు దావోస్‌ వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం ద్వారా రాష్ట్రంతో జరిగిన ఒప్పందాల విలువ దాదాపు రూ. 2.45 లక్షల కోట్లు. 2014లో తెలం గాణ రాష్ట్రం నూతనంగా ఏర్పడటం, ఆ తర్వాత బ్రాండ్‌ ప్రమోషన్‌ కోసం 2017 వరకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేసింది. 2018-19లో ఐటీ విస్తర ణకు పరిమిత సంఖ్యలో ఒప్పందాలు జరిగాయి. కానీ క్షేత్రస్థాయి పెట్టుబ డులు రాలేదు. 2020లో ఐటీకి సంబంధించి దాదాపు రూ.500 కోట్ల పెట్టుబడులకు వివిధ కంపెనీలు ఒప్పందాలు చేసుకున్నాయి.

వాటిలో రూ.300 కోట్ల వరకు అమల్లోకి వచ్చాయి. 2021 కోవిడ్‌ సంవత్సరం కావడంతో ఎలాంటి ఒప్పందాలు లేవు. 2022 దావోస్‌ ప్రపంచ వాణిజ్య వేదిక ద్వారా దాదాపు రూ.4,500 కోట్ల విలువైన ఒప్పందాలు జరిగినట్టు అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ క్షేత్రస్థాయిలోకి దాదాపు రూ.2 వేల కోట్ల మేరకే నిధులు వచ్చాయి. అయితే అవేవీ ఇప్పటికీ పూర్తిగా రాలేదు. దశలవారీగా వస్తూ…ఉన్నాయి. ఆ తర్వాత 2023లో అదే వేదికపై దాదాపు రూ.21వేల కోట్ల పెట్టుబడుల కోసం ఒప్పందాలు చేసుకున్నారు. క్షేత్రస్థాయిలోకి వచ్చేందుకు సిద్ధపడిన పెట్టుబడుల సొమ్ము దాదాపు రూ.6 వేల కోట్లు మాత్రమే. ఈ దశ మొత్తం పదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు దావోస్‌ పర్యటనల సందర్భంగా జరిగిన ఒప్పందాలు.

బీఆర్‌ఎస్‌ హయాంలో…
2014 నుంచి 2023 వరకు 9 ఏండ్లలో దావోస్‌లో జరిగిన ఒప్పందాల విలువ దాదాపు రూ.26వేల కోట్లు. వాటిలో రాష్ట్రంలోకి వచ్చిన పెట్టుబడులు దాదాపు రూ.8,300 కోట్లు. అయితే ఇప్పటికీ అవి పూర్తిగా రాలేదు. అతి తక్కువ కంపెనీలు పనులు పూర్తిచేసి, కార్యకలాపాలు ప్రారంభించాయి. మరికొన్ని కంపెనీలు వివిధ దశల్లో ఉన్నాయి.

‘ప్రజాపాలన’లో…
రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చాక 2024లో ఆయన దావోస్‌ పర్యటనకు వెళ్లారు. దాదాపు రూ.40,232 కోట్ల మేరకు వివిధ సంస్థలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నారు. కానీ క్షేత్రస్థాయిలో వచ్చిన పెట్టుబడులు కేవలం రూ.12వేల కోట్లు మాత్రమే. అవి కూడా ఇప్పటికీ ప్రారంభ, మధ్యస్థ దశల్లో ఉన్నాయి. ఇక 2025లోనూ సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని బృందం దావోస్‌ వెళ్లి దాదాపు రూ.1.78 లక్షల కోట్ల మేరకు ఒప్పందాలు చేసుకొచ్చారు. కానీ ఇప్పటి వరకు రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పేందుకు ముందుకు వచ్చిన కంపెనీల పెట్టుబడి సొమ్ము దాదాపు రూ.35వేల కోట్లు మాత్రమే. అవి కూడా దశలవారీగా వస్తాయి.

సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో రెండేండ్లలో దావోస్‌ వేదికపై నుంచి జరిగిన ఒప్పందాల విలువ దాదాపు రూ.2,18,232 కోట్లు. వాస్తవానికి రాష్ట్రంలోకి వచ్చేందుకు ఇప్పటి వరకు ఆసక్తి చూపిన సంస్థల పెట్టుబడి విలువ దాదాపు రూ. 47వేల కోట్లు. ఇవి కూడా దశలవారీగా వచ్చేందుకే సిద్ధంగా ఉన్నాయి. మొత్తంగా 2014 నుంచి 2025 వరకు తెలంగాణ రాష్ట్రంతో దావోస్‌ వేదికగా జరిగిన వాణిజ్య ఒప్పందాల విలువ దాదాపు రూ.2,44,232 కోట్లు. వాస్తవంగా క్షేత్రస్థాయిలో దశలవారీగా వస్తాయని చెప్తున్న పెట్టుబడులు దాదాపు రూ.55,300 కోట్లు మాత్రమే. అంటే ఒప్పందాల సమయంలో విదేశీ పర్యటనల్లో పాలకులు చేసుకుంటున్న పెట్టుబడుల ప్రచారంలో కనీసం 20 శాతం కూడా రాష్ట్రానికి రావట్లేదు. వాటిలో పది శాతం కూడా నిర్ణీత సమయంలో ప్రణాళిక ప్రకారం పనులు పూర్తిచేసి, ఫలితాలను ఇవ్వట్లేదు.

ఇదీ పరిస్థితి
దావోస్‌ ఒప్పందాల్లోని ప్రాజెక్టుల్లో 35 నుంచి 40 శాతం ప్రాజెక్టులు కేవలం కాగితాలపైనే ఉన్నాయి. మరో 25 శాతం ప్రాజెక్టులు తీవ్ర ఆలస్యంతో సాగుతున్నాయి. దశలవారీగా పనులు పూర్తిచేసుకుంటున్న చిన్న ప్రాజెక్టులు 20 శాతం లోపు ఉన్నాయి. పూర్తిగా పనులు పూర్తిచేసుకొని, క్షేత్రస్థాయిలోకి వచ్చిన ప్రాజెక్టులు కేవలం 10 శాతం మాత్రమే ఉన్నాయి. ప్రాజెక్టుల ఆలస్యానికి ప్రధానంగా భూసేకరణలో జాప్యం, పర్యావరణ అనుమతుల ఆలస్యం, విద్యుత్‌, నీటి లభ్యత సమస్యలు, ప్రభుత్వాల మార్పుతో విధాన ప్రాధాన్యతల మార్పు వంటి పలు అంశాలు కారణాలుగా ఉన్నాయి.

ఉద్యోగాల హామీలు
గడచిన పదేండ్లలో దావోస్‌ వేదికపై ప్రకటించిన ఒప్పందాల్లో 3 లక్షల నుంచి 5 లక్షల ఉద్యోగాలు వస్తాయని హామీలు ఇచ్చారు. వాస్తవానికి వచ్చిన ఉద్యోగాలు లక్షలోపే. అవి కూడా ప్రధానంగా ఐటీ సేవల రంగానికే పరిమితమయ్యాయి. గ్రామీణ, పరిశ్రమల ఆధారిత ఉపాధి మాత్రం ఆశించిన స్థాయిలో పెరగలేదు.

పునఃసమీక్షలతో పరేషాన్‌
రాష్ట్రంలో ప్రభుత్వాలు మారిన ప్రతిసారీ దావోస్‌ ప్రాజెక్టులపై పునఃసమీక్ష జరుగుతోంది. దీనివల్ల కొన్ని ప్రాజెక్టులు పూర్తిగా నిలిచిపోవడం, కొన్ని ప్రాజెక్టులకు కొత్త షరతులు విధించడం వంటి నిర్ణయాలు జరుగుతున్నాయి. ఫలితంగా పెట్టుబడిదారుల్లో అనిశ్చితి పెరుగుతున్నదని పారిశ్రామిక వర్గాలు చెప్తున్నాయి.

ఆర్థిక సమతుల్యతకు సవాలు
దావోస్‌ ఒప్పందాల విషయంలో అధికార పార్టీల ప్రచార ఘనత ఎక్కువ, అమలు వేగం తక్కువగా ఉంది. పెట్టుబడుల గణాంకాలు భారీగా కనిపించినా, క్షేత్రస్థాయిలో ప్రజలకు కనిపించే ఫలితాలు పరిమితం. పరిశ్రమలపై కంటే సేవల రంగంపైనే ఎక్కువగా ఆధారపడటం రాష్ట్ర ఆర్థిక సమతుల్యతకు సవాలుగా మారుతున్నది. వాస్తవ పెట్టుబడులు, స్థిరమైన ఉపాధిని కల్పించడంలో ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికీ వెనుకబడే ఉంది.

దావోస్‌ ఒప్పందాల వాస్తవ స్థితి
2022 దావోస్‌లో జరిగిన ప్రపంచ వాణిజ్య సదస్సులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 13 వాణిజ్య ఒప్పందాలు చేసుకుంది. వాటి పెట్టుబడి అంచనా విలువ దాదాపు రూ.4 వేల కోట్లు. ఐటీ, ఫార్మా, లాజిస్టిక్స్‌ రంగాలపై ప్రధా నంగా దృష్టి కేంద్రీకరిం చారు. వీటిలో చాలా ప్రాజె క్టులు ఇప్పటికీ ప్రణాళికల దశలోనే ఉన్నాయి. 2024లో ఎనర్జీ, డేటా సెంటర్లు, మౌలిక వసతుల రంగాల్లో భారీ కార్పొరేట్‌ ఒప్పందాలు చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.40వేల కోట్లు. 2025లో 20 వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నారు. వాటి అంచనా పెట్టుబడులు దాదాపు రూ.1.78 లక్షల కోట్లు.

ఇదీ గ్లోబల్‌ సమ్మిట్‌ కథ
దావోస్‌ వాణిజ్య ఒప్పందాల స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆ తరహా సమ్మిట్‌ ఏర్పాటుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రయత్నం చేసింది. దాదాపు నెలరోజులపాటు ప్రభుత్వం ఇదే అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేసింది. సమ్మిట్‌ జరిగిన రెండ్రో జులు ఒప్పందాలు, పెట్టుబడులు అంటూ తెలంగాణ నిరుద్యోగ యువ తకు ఆకాశంలో నక్షత్రాల్ని భూమి మీదే చూపిస్తూ, ఆశలు కల్పించారు. రెండ్రోజుల గ్లోబల్‌ సమ్మిట్‌లో రాష్ట్ర ప్రభుత్వం రూ.5.75 లక్షల కోట్ల మేరకు ఒప్పందాలు చేసుకున్నట్టు ప్రకటించింది. 2014 నుంచి దావోస్‌లో చేసుకున్న ఒప్పందాలకే ఇప్పటి వరకు అతీగతీ లేదు. ఇక గ్లోబల్‌ సమ్మిట్‌ ఒప్పందాలు ఎప్పటికి పట్టాలెక్కుతాయో తెలీదు.

-బ్రూక్‌ఫీల్డ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ భారత్‌ ఫ్యూచర్‌ సిటీ ఇంటిగ్రేటెడ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ కోసం రూ.75 వేల కోట్లు పెట్టుబడులు పెడతామని ఒప్పందం చేసుకుంది.
-గీన్‌కో గ్రూప్‌ పునరుత్పాదక శక్తి, సోలార్‌, విండ్‌, స్టోరేజ్‌ ప్రాజెక్టుల కోసం రూ.29,800 కోట్లు పెట్టుబడులు పెడతామని ప్రణాళికను ప్రకటించింది.
-విన్‌ గ్రూప్‌ సంస్థ ఈవీ తయారీ, హెల్త్‌కేర్‌, స్మార్ట్‌ టౌన్‌షిప్‌ల్లో రూ.27వేల కోట్లు పెట్టుబడులుపెడతామని ఆసక్తి వ్యక్తీకరణ చేసింది.
-జీఎమ్‌ఆర్‌ గ్రూప్‌ ఏవియేషన్‌, లాజి స్టిక్స్‌, ఎయిర్‌పోర్ట్‌, కార్గో విస్తరణ కోసం రూ.15వేల కోట్లు పెట్టుబడులు పెడతామని ప్రతిపాదన చేసింది.
-మెఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (మెయిల్‌) సంస్థ మౌలిక వసతులు, ఎనర్జీ, మొబిలిటీ ప్రాజెక్టుల కోసం రూ.8వేల కోట్లు పెట్టుబడులు పెడతామని ఒప్పందం చేసుకుంది.
-సుమధుర గ్రూప్‌ భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో పారిశ్రామిక పార్కు అభివృద్ధి కోసం రూ.600 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఒప్పందం చేసుకుంది.

-అదానీకి చెందిన గౌతమ్‌ సోలార్‌ సంస్థ రూ.5 వేల కోట్లతో సోలార్‌ మాడ్యూల్‌ మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌ ఏర్పాటుకు ప్రతిపాదన చేసింది.
-ప్రీమియర్‌ ఎనర్జీస్‌ సంస్థ రూ.7వేల కోట్లతో సోలార్‌ సెల్‌ అండ్‌ మాడ్యూల్‌ విస్తరణ కోసం ఒప్పందం చేసుకుంది.
-అదానీ గ్రీన్‌ ఎనర్జీ సంస్థ గ్రీన్‌ ఎనర్జీ, సోలార్‌, విండ్‌ ప్రాజెక్టుల్లో రూ.25వేల కోట్ల పెట్టుబడి పెడతామంటూ ఉద్దేశ పత్రం సమర్పించింది.
-రీన్యూ పవర్‌ సంస్థ పునరుత్పాక ఇంథన రంగంలో హైబ్రీడ్‌ ఎనర్జీ పార్కుల అభివృద్ధికి రూ.18వేల కోట్ల పెట్టుబడులుపెట్టేందుకు ఒప్పందం చేసుకుంది.
-టాటా పవర్‌ రినవెబుల్‌ ఎనర్జీ రూ.20వేల కోట్లు, ఎల్‌ అండ్‌ టీ రూ.10వేల కోట్లు, ఫాక్స్‌కాన్‌ రూ.15వేల కోట్లు, ఇతర దేశీ, విదేశీ సంస్థలు మొత్తంగా దాదాపు రూ.1.90 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు, ఆసక్తి వ్యక్తీకరణలు, చర్చలు జరిపాయి.

ఈ రంగాల్లో పెట్టుబడులు
గ్లోబల్‌ సమ్మిట్‌లో ప్రధానంగా పునరుత్పాదక ఇంథన శక్తి, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఏవియేషన్‌, లాజిస్టిక్స్‌, ఎలక్ట్రికల్‌ వెహికల్స్‌ (ఈవీ), మొబిలిటీ, రియల్‌ఎస్టేట్‌, స్మార్ట్‌ సిటీ అభివృద్ధి కోసం పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు జరిగాయని ప్రభుత్వం ప్రకటించింది. ఓసారి కొన్ని ప్రధాన కంపెనీల వారీగా ఆ పెట్టుబడి ఒప్పందాలను పరిశీలిద్దాం.

-ఎవ్రెన్‌ గ్లోబల్‌ యాక్సిస్‌ ఎనర్జీ సంస్థ పునరుత్పాదక ఇంథనం, సోలార్‌ అండ్‌ హైబ్రీడ్‌ పవర్‌ పార్కుల ఏర్పాటు కోసం రూ.31,500 కోట్లతో
ఒప్పందం చేసుకుంది.

-ఇవేవీ తక్షణం నిధుల ప్రవాహంగా మారవు. భూమి కేటాయింపు, పర్యావరణ అనుమతులు, ఫైనాన్షియల్‌ క్లోజర్‌ వంటి అనేక దశల తర్వాతే పనులు ప్రారంభమవుతాయి. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన సోలార్‌ పాలసీని పెట్టుబడిదారులు తమకు అనుకూలంగా మలుచుకొనే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. కార్పొరేట్లంతా ‘భూమి’ చుట్టూనే పరిగెత్తుతుండటం గమనార్హం!

అక్కడ… ఇక్కడా అవే కంపెనీలు స్థానిక పారిశ్రామికవేత్తలకు చోటేది?
ఏపీకే రెడ్డి, జాతీయ అధ్యక్షులు, ఫెడరేషన్‌ ఆఫ్‌ స్మాల్‌ అండ్‌ మీడియం ఎంటర్‌ప్రైజెస్‌ (ఎఫ్‌ఎస్‌ఎమ్‌ఈ)
రాష్ట్ర ప్రభుత్వం నేలవిడిచి సాముచేస్తున్నట్టు కనిపిస్తుంది. విదేశీపెట్టుబడుల వ్యామోహంలో స్వరాష్ట్ర పారిశ్రామికవేత్తల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. హైదరాబాద్‌లోని జీడిమెట్ల, బాలానగర్‌, రామచంద్రాపురం, పటాన్‌చెరు, నాచారం, చెర్లపల్లి, మౌలాలీ, ఉప్పల్‌, సనత్‌నగర్‌, కాటేదాన్‌ వంటి పారిశ్రామిక ఎస్టేట్స్‌లో ఉత్పత్తి కేంద్రంగా పరిశ్రమల్ని నెలకొల్పింది స్థానిక పారిశ్రామికవేత్తలే. ఈ విషయాన్ని విస్మరించి, విదేశీ పెట్టుబడుల కోసం వెంపర్లాడుతున్నారు. రాష్ట్ర పారిశ్రామిక విధానంలో ఎంట్రీ పాలసీ ఉందే తప్ప, ఎగ్జిట్‌ పాలసీ లేదు. దీనివల్ల పారిశ్రామికవేత్తలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు.

మూడు నెలలకోసారి నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశాల్లో (ఎస్‌ఎల్‌బీసీ) వ్యవసాయంతో కలిపి, పారిశ్రామిక పురోగతిని తూతూ మంత్రంగా సమీక్షిస్తున్నారు. అది సరికాదు. పరిశ్రమల కోసం ప్రత్యేక ఎస్‌ఎల్‌బీసీ సమావేశాలు నిర్వహించాలి. దానికి తప్పనిసరిగా ఆర్థిక, పరిశ్రమల శాఖల మంత్రులు హాజరుకావాలి. రాష్ట్రంలో కేవలం ఐటీరంగంలోనే పెట్టుబడులు వస్తున్నాయి. స్థానికంగా ఉపాధిని సృష్టించే ఉత్పత్తి ఆధారిత పరిశ్రమలు కనిపించట్లేదు. లోపం ఎక్కడుందో ప్రభుత్వం పరిశీలన చేయాలి. ముఖ్యంగా దావోస్‌ కానీ, గ్లోబల్‌ సమ్మిట్‌లో కానీ పెట్టుబడుల ఒప్పందాలు జరిగాక, వాటిని ఫాలోఅప్‌ చేసి, మానిటరింగ్‌ చేసే వ్యవస్థ పరిశ్రమలశాఖలో లేదు. ఆ శాఖలో హెచ్‌ఓడీల స్థాయిలోనే దాదాపు 292 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. జూనియర్‌ అసిస్టెంట్‌ వంటి క్షేత్రస్థాయి పోస్టుల భర్తీలు ఏండ్ల తరబడి జరగట్లేదు. హైదరాబాద్‌ సహా జిల్లాల్లో పరిశ్రమల శాఖల భవనాలను ఓసారి పరిశీలించండి.

ఏవైనా అనుమతుల కోసం పారిశ్రామికవేత్తలు ఆ కార్యాలయాలకు వెళ్తే, సకల దరిద్రాలు అక్కడే కనిపిస్తాయి. కూలడానికి సిద్ధంగా ఉన్న భవనాలు, విరిగిన కుర్చీలు, వెలగని లైట్లు, దుమ్ము ధూళి నిండిన టేబుళ్లతో పరమ అసహ్యంగా కనిపిస్తాయి. ఈ వాతావరణాన్ని చూసి, వచ్చిన పారిశ్రామికవేత్తలు కూడా పారిపోయే పరిస్థితులు క్షేత్రస్థాయిలో ఉన్నాయి. వాటిని సరిదిద్దకుండా, కేవలం పెట్టుబడుల ప్రచారం కోసం ఈవెంట్స్‌ నిర్వహిస్తే ఉపయోగం ఉండదు. మొదట స్థానిక పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించాలి. వారికి ప్రభుత్వాలు ఇస్తామని వాగ్దానం చేసిన ప్రోత్సాహకాల బకాయిలు చెల్లించాలి. ఉన్న పరిశ్రమల విస్తరణ, కొత్త పరిశ్రమల స్థాపనకు అవకాశాలు కల్పించాలి. దాన్ని వదిలేసి విదేశీ పెట్టుబడుల వెంటపడటం సరికాదు. దావోస్‌లో, గ్లోబల్‌ సమ్మిట్‌లో జరిగిన ఒప్పందాలను ఓసారి పరిశీలించండి. అక్కడ ఎమ్‌ఓయూలు చేసుకున్న వారే ఇక్కడా ఉన్నారు. కానీ పారిశ్రామికంగా ఎక్కడా ఒక్క అడుగు ముందుకు పడట్లేదు. ప్రజల కోసం ఏదైనాచేయాలనే తపన ప్రభుత్వానికి ఉంది. కానీ దాన్ని ఏమార్గంలో తీసుకెళ్లాలనే గైడెన్స్‌లోనే లోపం ఉంది. దాన్ని సరిచేసుకోవాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -