పల్లెల్లో ప్రమాణ స్వీకారాలు..గ్రామగ్రామాన ర్యాలీలు, విజయోత్సవాలు
సర్పంచులకు బాధ్యతలు అప్పగించిన ప్రత్యేకాధికారులు
పార్టీలకతీతంగా గ్రామాభివృద్ధికి కట్టుబడి ఉంటామని ప్రమాణం
మొదటి రోజే హామీలను అమల్లోకి తెచ్చిన పలువురు సర్పంచ్‌లు
నవతెలంగాణ- విలేకరులు
పంచాయతీ పాలకవర్గాలు రద్దైన రెండేండ్ల తరువాత కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా సర్పంచ్‌లు, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. వారికి ప్రత్యేకాధికారులు బాధ్యతలు అప్పగించారు. ఈ నెల 11, 14, 17వ తేదీల్లో మూడు విడతల్లో నిర్వహించిన సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో గెలుపొందిన వారితో గ్రామాగ్రామన ప్రమాణ స్వీకారాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యుల విజయోత్సవ సంబురాలు ఘనంగా జరిగాయి. పార్టీలకతీతంగా గ్రామాలాభివృద్ధికి కట్టుబడి ఉంటామని, ప్రజలకు జవాబుదారీగా ఉంటామని వారంతా ప్రమాణం చేశారు. ఇదే సమయంలో కొందరు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను మొదటి రోజే అమలు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో కొత్తగా సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణస్వీకార మహోత్సవాలతో పల్లెలు మురిసిపోయాయి.
రెండేండ్లుగా ప్రత్యేక పాలనలో ఉన్న గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లకు ప్రత్యేకాధికారులు పూర్తి బాధ్యతలు అప్పగించారు. ప్రమాణస్వీకారం అనంత రం బాధ్యతలు తీసుకుంటూ సర్పంచ్‌లు సంతకాలు చేశారు. దీంతో ప్రతి గ్రామ పంచాయతీలో సందడి వాతావరణం నెలకొంది. వివిధ పార్టీల నాయకులు కొలువుదీరిన పాలకవర్గాల సభ్యులను ఘనంగా సన్మానించారు. పంచాయతీ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని సర్పంచ్‌లు ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రధాన వీధుల్లో టపాసులు పేలుస్తూ డప్పులు, డీజే సౌండ్ సిస్టమ్‌లతో కేరింతలు పెడుతూ నృత్యాలు చేశారు. రోడ్‌షోలు నిర్వహించారు. కొందరు కాలినడకన ఇంటింటికీ వెళ్లి ఓటు వేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని 72 మండలాల పరిధిలో 1613 గ్రామపంచాయతీలలో సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఉదయం 10 గంటల నుంచి ఆయా గ్రామాలలో గ్రామపంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక అధికారులు నూతన పాలకవర్గం చేత ప్రమాణ స్వీకారాలు చేయించారు. కొమురంభీం జిల్లా వాంకిడిలో సర్పంచ్ మరికొంతమంది వార్డు సభ్యులు గైర్హాజర య్యారు. ఉపసర్పంచ్, మరికొందరు వార్డు సభ్యులు ప్రమాణం చేశారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని అన్ని గ్రామాల్లో సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డుమెంబర్లు ప్రమాణస్వీకారం చేశారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని రామలక్ష్మణపల్లి గ్రామంలో 80 ఏండ్ల వృద్ధురాలు షేక్ చోటిబి వార్డు మెంబర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికై.. సోమవారం ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఓటర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
రెండు గ్రామాల్లో ప్రమాణస్వీకారం వాయిదా..
మాచారెడ్డి మండలంలోని సోమార్‌పేట్, సోమార్‌పేట్ తండా గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డ్‌మెంబర్ల ప్రమాణ స్వీకారం వివిధ కారణాలతో వాయిదా పడ్డట్టు మండల అభివృద్ధి అధికారి గోపిబాబు తెలిపారు.
మొదటి రోజే జీపీకి భూమిపూజ..
నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలోని అమ్రాద్ గ్రామంలో నూతన పంచాయతీ కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే నూతన గ్రామ పంచాయతీ నిర్మాణానికి భూమిపూజ చేశారు.
మ్యానిఫెస్టోను అమలు చేసిన సర్పంచ్..
మోర్తాడ్ మండలం గాండ్లపేట్ గ్రామ సర్పంచ్ సుభాష్ ఎన్నికల సమయంలో ఇచ్చిన మ్యానిఫెస్టోను ప్రమాణస్వీకారం రోజే అమలు చేశాడు. గ్రామంలో ఆడపిల్ల పుడితే ఆ కుటుం బానికి రూ.5116 అందిస్తానని హామీనిచ్చాడు. సర్పంచ్‌గా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే గ్రామంలో ఆడపిల్ల పుట్టడంతో ఆ కుటుంబానికి సర్పంచ్ సుభాష్ రూ.5116 అందజేశారు. తాను సర్పంచ్‌గా ఉన్నన్ని రోజులు ఇచ్చిన హామీని అమలు చేస్తానని తెలిపారు. మొదటి రోజే హామీని అమలు చేయడం తో సర్పంచ్‌ను గ్రామస్తులు అభినందించారు.
పలు చోట్ల ఉద్రిక్తతలు
ఉమ్మడి వరంగల్‌లోని వరంగల్, హను మకొండ, జయశంకర్-భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, జనగామ జిల్లాలో సోమవారం గ్రామపంచాయతీల నూతన పాలకవర్గాల ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో మొత్తం 1,683 మంది సర్పంచ్‌లు, 14,788 మంది వార్డు సభ్యులు పదవీ బాధ్యతలు స్వీకరించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, హనుమకొండ, వరంగల్‌లో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, జనగామ జిల్లా లింగాల ఘనపురం, పాలకుర్తిలో ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, స్టేషన్‌ఘన్‌పూర్‌లో కడియం శ్రీహరి హాజర య్యారు. గ్రామాల్లో నూతన సర్పంచుల ప్రమాణ స్వీకారం సందర్భంగా పండుగ వాతావరణం నెలకొంది.
కొన్ని చోట్ల ఉద్రిక్తతలు
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల కేంద్రంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ శ్రేణుల మధ్య చిన్నపాటి ఘర్షణ చోటుచేసుకుంది. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలోని బొడ్లాడ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అపశృతి నెలకొంది. టపాసులు పేల్చగా నిప్పు రవ్వ గడ్డివాములో పడటంతో మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. నల్లగొండ జిల్లా పాలకీడు మండలంలో సౌండ్ తగ్గించాలని కోరినందుకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది.



