పేదల హక్కులపై కేంద్రం కత్తి
రాష్ట్రాలను మున్సిపాల్టీల స్థాయికి దిగజార్చుతున్న ఎన్‌డీఏ ప్రభుత్వం
ఆ దిశగానే రాష్ట్రాల ఆర్థిక వనరులపై దాడి
ఉపాధి హామీ పునరుద్ధరణకు ఐక్య పోరాటాలు : సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీ.వీ.రాఘవులు
కేంద్రం గాంధీని మరోమారు హత్య చేసింది
నరేగా చట్టం తీసుకురావడంలో ఏచూరి పాత్ర కీలకం
స్వాతంత్య్ర సమరయోధులను వెనక్కి నెట్టి గాడ్సే, సావర్కర్‌ల ప్రమోట్ : సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మెన్ నారాయణ
సికింద్రాబాద్‌లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద వామపక్షాల నిరసన
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
యూపీఏ-1 ప్రభుత్వ హయాంలో వామపక్షాల ఒత్తిడితో తీసుకొచ్చిన ఉపాధి హామీ చట్టం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఇష్టం లేదనీ, అందుకే ఆ చట్టం నిర్వీర్యానికి మోడీ సర్కారు పూనుకున్నదని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీ.వీ.రాఘవులు విమర్శించారు. చట్టం తీసుకొచ్చే సమయంలో ప్రజల్లోగానీ, పార్లమెంట్‌లోగానీ సమగ్రచర్చకు పెట్టకపోవడం దుర్మార్గమన్నారు. నరేగా చట్టం తీసుకొచ్చే సమయంలో ఏడాది పాటు ప్రజల్లో చర్చకు పెట్టిన విషయాన్ని గుర్తుచేశారు. ఆనాడు పార్లమెంట్‌లో వామపక్షాల ఎంపీలు బలమైన చర్చపెట్టి ప్రజలకు అనుకూలమైన చట్టం తీసుకొచ్చారని వివరించారు. వామపక్ష పార్టీల ముద్ర ఆ చట్టానికి బలంగా ఉండటం బీజేపీకి ఏమాత్రం ఇష్టం లేదన్నారు. మరోవైపు స్వాతంత్య్ర సమరయోధుల పేర్లను కూడా క్రమంగా తొలగిస్తూ పోతున్నదనీ, మహాత్మాగాంధీ పేరు ఉండటం ఆ పార్టీకి ఏమాత్రం ఇష్టం లేదని విమర్శించారు.
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చి ‘వీబీ జీ రామ్ జీ’ చట్టాన్ని తీసుకురావడాన్ని నిరసిస్తూ సోమవారం సికింద్రాబాద్ ఎంజీ రోడ్డులోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్రం తీసుకొచ్చిన చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలనీ, పాత చట్టాన్ని కొనసాగించాలనీ, గాంధీ పేరును మార్చొద్దని నినదించారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ..కూలీలు అధిక వేతనం పొందడం, కొంత మేర జీవన ప్రమాణాలు మెరుగుపడటం గ్రామీణ ధనవంతులకు, కార్పొరేట్లకు ఏమాత్రం నచ్చడం లేదనీ, అందుకే ఆ చట్టాన్ని నిర్వీర్యం చేయాలని ఒత్తిడి తీసుకురావడంతోనే మోడీ సర్కారు ఇలా చేస్తున్నదని విమర్శించారు. ఉపాధి హామీ చట్టంలో కేంద్రం వాటాను తగ్గించి రాష్ట్రాల వాటా పెంచడం అంటే భారం మోపడమేననీ, ఇప్పటికే రాష్ట్రాల ఆర్థిక వనరులపై దాడిచేస్తూ మున్సిపాల్టీల స్థాయికి మోడీ దిగజార్చిన విధానాన్ని వివరించారు.
వేతనాన్ని ఏడు రోజుల్లోనే చెల్లింపు, 125 రోజులకు పని పెంపు అంటూనే పెద్ద ఎత్తున కూలీలను ఉపాధి హామీ చట్టం నుంచి తొలగించే పనికి మోడీ సర్కారు పూనుకున్నదని విమర్శించారు. 125 రోజుల పని అని చెబుతూ విషగుళికను మింగించే పనిలో ఉందన్నారు. పేదలకు ఇతోధికంగా దోహదపడుతున్న ఉపాధి హామీ చట్టం పరిరక్షణ కోసం ఐక్య పోరాటాలు చేయనున్నట్టు ప్రకటించారు. రాజకీయంగా క్షేత్రస్థాయికి ఉద్యమాన్ని తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నా పట్టనట్టు ఉంటున్న బీజేపీ, టీడీపీ, వైసీపీ, జనసేన, బీఆర్‌ఎస్, తదితర ప్రాంతీయ పార్టీలకు చెందిన నేతలకు ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. అందర్నీ సమీకరిద్దాం.. పోరాటాల ద్వారా ముందుకెళ్దామని అన్నారు. సీపీఐ(ఎం) మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ..మోడీకి, బీజేపీకి శ్రీరామునిపై భక్తి లేదనీ, శ్రీరామున్ని కేవలం అధికారానికి మాత్రమే ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు.
బీజేపీ నేతలకు సావర్కర్, గాడ్సేలే నిజమైన దేశభక్తులన్నారు. సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నేత అకాల పాపన్న మాట్లాడుతూ కేంద్రం పేదల పొట్టకొడుతోందని విమర్శించారు. ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కన్వీనర్ జోగిరెడ్డి మాట్లాడుతూ..ఉపాధి రక్షణ కోసం అందరూ కలిసికట్టుగా పోరాటం చేయాలనీ, అందుకు గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలను ఐక్యం చేయాలని కోరారు. సీపీఐ(ఎం) నగర కార్యదర్శి ఎం.వెంకటేశ్, సీపీఐ నగర కార్యదర్శి స్టాలిన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, టి.సాగర్, మల్లులక్ష్మి, అబ్బాస్, సీనియర్ నేత డీజీ నర్సింహారావు, రాష్ట్ర కమిటీ సభ్యులు ప్రసాద్, శ్రీరాంనాయక్, స్కైలాబ్‌బాబు, అరుణజ్యోతి, ఆశయ్య, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నర్సింహ్మ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్.చాయాదేవి, శ్రామీక మహిళా ఫోరం రాష్ట్ర కార్యదర్శి పి.ప్రేమపావని, నాయకులు కమతం యాదగిరి, సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర నాయకులు అన్వేష్, ఎస్.ఎల్.పద్మ, తదితరులు పాల్గొన్నారు.
అన్యాయం : జాన్‌వెస్లీ
నూతన చట్టం కేంద్రం నిధులను తగ్గించి రాష్ట్రాలపై భారాన్ని మోపడం సరిగాదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. పనిముట్ల కొనుగోలుకు సంబంధించి 75 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలని కొత్త చట్టంలో పేర్కొనటం దారుణమన్నారు. ఉపాధి హామీ పనులను 200 రోజులకు పెంచాలనీ, రోజువారీ కూలిని రూ.600కి పెంచాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పరిరక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీల నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయనీ, మంగళవారం జరిగే కార్యక్రమాలనూ జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
వామపక్షాల బలం తగ్గితే పేదలకు నష్టం
పార్లమెంట్‌లో వామపక్షాల బలం తగ్గితే సామాన్యులకు, పేదలకు నష్టమనీ, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రమాదంలో పడుతుందని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మెన్ కె.నారాయణ చెప్పారు. పార్లమెంట్‌లో వామపక్షాలకు బలమైన ప్రాతినిధ్యం ఉంటే కేంద్రం ప్రవేశపెట్టిన ‘వీబీ జీ రామ్‌జీ’ బిల్లును బలంగా అడ్డుకునేవారనీ, ఇప్పుడు ఆ లోటు కనబడుతున్నదని కొందరు కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు అంటున్నారని ప్రస్తావించారు. గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరును వీబీ జీరామ్‌జీగా మార్చి గాంధీని మరోమారు మోడీ హత్య చేశారని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. స్వాతంత్య్ర, పోరాట యోధులను వెనక్కి నెట్టి, గాంధీని చంపిన గాడ్సేను, బ్రిటీషర్లను క్షమాభిక్ష కోరిన సావర్కర్‌లను ముందుకు తీసుకొస్తున్నారని విమర్శించారు. మోడీ అధికారంలోకి వచ్చిన 2014 తర్వాతనే భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినట్టుగా కొందరు బీజేపీ ఎంపీలు మాట్లాడటాన్ని తప్పుబట్టారు. నరేగా చట్టం తీసుకొచ్చే సమయంలో అప్పటి సీపీఐ(ఎం) ఎంపీ సీతారాం ఏచూరి కీలక భూమిక పోషించారని గుర్తుచేశారు. దురుద్దేశంతో మంచి చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి మోడీ సర్కారు పూనుకోవడాన్ని తప్పుబట్టారు.



