భూభారతి పోర్టల్‌తో అనుసంధానం
రైతులకు పూర్తి భూ సమాచారం
ప్రతి సర్వే నెంబర్‌కూ మ్యాప్ రూపకల్పన : మంత్రి పొంగులేటి
సీసీఎల్‌ఏ కార్యాలయం ఆకస్మిక తనిఖీ
నిర్వహణ సరిగ్గా లేదని అసంతృప్తి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
భూ పరిపాలన వ్యవస్థను మరింత పారదర్శకంగా వేగవంతంగా అందించడానికి రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, సర్వే విభాగాలను ఒకే గొడుగు కిందకు తేవాలని నిర్ణయించామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. భూభారతి పోర్టల్‌తో అనుసంధానం చేస్తామని వివరించారు. వచ్చే నెలలో ఆధునీకరించిన ఈ వ్యవస్థను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. సోమవారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్ నాంపల్లిలోని సీసీఎల్‌ఏ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం వివిధ విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించారు. భూ పరిపాలనకు కేంద్రమైన సీసీఎల్‌ఏ కార్యాలయం నిర్వహణ సరిగ్గా లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కార్పొరేట్‌కు దీటుగా ఈ కార్యాలయాన్ని ఆధునీకరించాలని అధికారులను ఆదేశించారు.
వచ్చే నెలలో మరోసారి కార్యాలయాన్ని తనిఖీ చేస్తాననీ, అప్పటివరకు కొంతమార్పు కనిపించాలని కోరారు. వరుసగా విభాగాల వారీగా సమీక్షించడం కూడా జరుగుతుందనీ, ఇందుకు సంబంధించి అధికారులు పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉండాలని చెప్పారు. దశాబ్దాల క్రితం ప్రభుత్వం వివిధ అవసరాల కోసం ప్రయివేటు వ్యక్తుల నుంచి భూ సేకరణ జరిపిందని వివరించారు. ఇప్పటికీ కొన్ని భూములు ప్రయివేటు వ్యక్తుల పేరు మీదే ఉన్నాయనీ, ఇవన్నీ కూడా రికార్డుల్లో మార్చాలని సూచించారు. అసైన్డ్, భూధాన్ భూములపై సమీక్షతోపాటు కొన్నేండ్ల నుంచి ఉద్యోగులపై విజిలెన్స్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయనీ, ఏ విభాగంలో ఎన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయి, ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయి, కోర్టు కేసులన్నింటిపై పూర్తిస్థాయి సమీక్ష నిర్వహిస్తానని అన్నారు.
ఒకే మోడల్‌లో తహశీల్దార్ కార్యాలయాలు
రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా నిర్మించబోయే తహశీల్దార్ కార్యాలయాలు ఒకే మోడల్‌గా ఉండాలనీ, ఇందుకు సంబంధించిన డిజైన్ రూపొందించాలని అధికారులకు మంత్రి పొంగులేటి సూచించారు. ఒక్క క్లిక్‌తో రైతుకు సంబంధించిన భూముల పూర్తి సమాచారం లభించేలా చూడాలన్నారు. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, మార్కెట్ విలువ, విలేజ్ మ్యాప్, ప్రతి సర్వే నెంబర్‌కు మ్యాప్, నాలా ఆర్డర్లు, ఆర్వోఆర్, గ్రామాల నక్షా, ఫీడ్ బ్యాక్ వంటి పూర్తి సమాచారం లభించేలా సర్వే, రిజిస్ట్రేషన్ విభాగాలతో అనుసంధానం చేస్తూ భూభారతి పోర్టల్‌ను పూర్తి స్ధాయిలో ప్రజలకు చేరువ చేయబోతున్నామని వివరించారు.
ఆధార్ నెంబర్‌తో అనుసంధానమైన మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయిన వెంటనే కావాల్సిన సమాచారం లభిస్తుందన్నారు. క్రయ, విక్రయదా రులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి సర్వే నెంబర్‌కు మ్యాప్‌ను రూపొందించే ప్రక్రియను త్వరలో ప్రారంభిస్తామని వెల్లడించారు. రెవెన్యూ వ్యవస్థ ఆధునీకరణ చేసే ప్రతిపనిలో సామాన్యుని కోణం ఉండాలనీ, ఎలాంటి లోపాలకు, తారుమారుకు ఆస్కారం లేకుండా సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి పర్చాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ కార్యదర్శి డిఎస్ లోకేష్ కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు, సీసీఎల్‌ఏ ఇన్‌ఛార్జి కార్యదర్శి మంధా మకరంద్, ఎన్‌ఐసీ ఎస్‌ఐఓ ప్రసాద్, విజయ్ మోహన్, కృష్ణ పాల్గొన్నారు.



