నవతెలంగాణ-హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (PACS), జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల (DCCB) ఎన్నికైన పాలకవర్గాలను రద్దు చేస్తూ ఈనెల 19న అధికారిక ఉత్తర్వులు విడుదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నది.
ఇకపై నామినేటెడ్ పాలక మండళ్లుగా సహకార సంఘాల పాలకవర్గాలు ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతం వ్యవసాయ మార్కెట్ కమిటీల తరహాలో నియామకాలు జరగనున్నాయి. రాబోయే సంక్రాంతి లోపు పాలకవర్గాల ఏర్పాటు లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ప్రతి పీఏసీఎస్‌కు 13 మందితో పాలకవర్గాలు ఏర్పాటు కానున్నాయి. అందులో చైర్మన్, వైస్ చైర్మన్‌తో పాటు 11 మంది డైరెక్టర్లు ఉంటారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మూడు డైరెక్టర్ పోస్టులు ఇవ్వనున్నారు. అయితే, సొసైటీల్లో సభ్యత్వం ఉన్న రైతులకు మాత్రమే పాలకవర్గాల్లో అవకాశం కల్పించనున్నారు. ఎన్నికల ఖర్చులు, గొడవలు నివారణే లక్ష్యంగా తాజాగా పీఏసీఎస్, డీసీసీబీలను ప్రభుత్వం రద్దు చేసింది.



