సామాన్య ప్రజల ప్రాణాలతో చెలగాటం వద్దు
మెరుగైన వైద్యం అందించడమే ఐఎంఏ లక్ష్యం
విలేకరుల సమావేశంలో ఐఎంఏ అధ్యక్షులు అశ్విని కుమార్
నవతెలంగాణ – మిర్యాలగూడ
పుట్టగొడుగుల పుట్టుకోస్తున్న నకిలీ ఆసుపత్రులు, నకిలీ వైద్యంపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చర్యలు తీసుకోవాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మిర్యాలగూడ అధ్యక్షులు కే అశ్విని కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక వాసంతి ఆసుపత్రిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు ఇటీవల మిర్యాలగూడలో తనిఖీలు నకిలీ కంటి వైద్యులు, క్లినిక్ల బండారం బయటపడిందని తెలిపారు. అర్హత లేకపోయినప్పటికీ కాంపౌండర్లు ఇతర సిబ్బందితో నకిలీ వైద్యులు వైద్య సేవలు అందిస్తున్నారని, దీనివల్ల సామాన్య పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని అలాంటి వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
అనర్హత వ్యక్తులు అక్రమంగా క్లినిక్లు తెరిచి మందులు ప్రిస్క్రిప్షన్ రాస్తూ ల్యాబ్ టెస్టులు చేస్తున్నారని ఇది చట్ట ప్రకారం నేరపురిత చర్య అన్నారు. ఆర్ఎంపీలు పీఎంపీలు ప్రాథమిక చికిత్స అందించాల్సింది పోయి పల్లె డాక్టర్ గా చెప్పుకుని పెద్ద ఎత్తున వైద్యం అందిస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు పట్టణ ప్రాంతాలలో కూడా అర్హత లేని వైద్యులు ఆసుత్రులు పెట్టి పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించకుండా ఇబ్బందులు పెడుతున్నారని చెప్పారు. ఎంబిబిఎస్ చదివిన డాక్టర్లు స్పెషలైజేషన్ పేరిట ప్రత్యేక వైద్యం అందించడం సరైనది కాదన్నారు. మిర్యాలగూడలో ఐఎంఏ కింద 210 మంది డాక్టర్లు సభ్యులుగా ఉన్నారని అర్హత ఉన్న డాక్టర్లు వైద్య సేవలు పొందాలని సూచించారు. నకిలీ వైద్యులు నకిలీ క్లినిక్లపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చర్యలు తీసుకోవాలని దీనికోసం నిరంతరం తనిఖీలు చేయాలని కోరారు. మెడికల్ కౌన్సిల్ చేసే తనిఖీలకు అర్హత గల డాక్టర్లందరూ సహకరిస్తారని చెప్పారు.
ఇప్పటినుంచి డాక్టర్లు రాసి డిస్క్రిప్షన్ పై ఆల్ఫాబెటికల్ అక్షరాలలో స్పష్టంగా అర్థం అయ్యే రీతిలో రాస్తామని చెప్పారు నేషనల్ మెడికల్ కౌన్సిల్ నిబంధనలకు అనుగుణంగా డాక్టర్లు నడుచుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఈ జానకి రాములు, డాక్టర్లు డి.శేఖర్ రెడ్డి, ఎం మాధవ కుమార్, టి సతీష్ కుమార్, జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



