నవతెలంగాణ-సదాశివపేట
సదాశివపేట మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో గొర్రెలు, మేకలకు నట్టల (పురుగులు) నివారణ మందుల త్రాపే కార్యక్రమాన్ని నేటి నుంచి ఈ నెల 31–12–2025 వరకు నిర్వహిస్తున్నట్లు మండల పశువైద్యాధికారి డాక్టర్ ఎం. సంతోష్ కుమార్ తెలిపారు. పశుపోషణలో భాగంగా చేపడుతున్న ఈ కార్యక్రమం ద్వారా జీవాలలో నట్టలు పూర్తిగా నిర్మూలించబడి, ఆరోగ్యకరమైన ఎదుగుదల సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం నందికంది, మద్దికుంట, పొట్టిపల్లి గ్రామాలలో మొత్తం 723 గొర్రెలు, 138 మేకలకు నట్టల నివారణ మందులు త్రాపడం జరిగింది. సకాలంలో ఈ మందులు త్రాపడం వల్ల జీవాలకు వచ్చే వివిధ వ్యాధులను నివారించవచ్చని, తద్వారా పశుపాలకులకు ఆర్థికంగా మేలు జరుగుతుందని డాక్టర్ సంతోష్ కుమార్ వివరించారు.
ఈ కార్యక్రమంలో సిబ్బంది సుజాత, లింగమయ్య, నిర్మల, భవిత, రమేష్, ఆరిఫ్, యాదమ్మలు పాల్గొన్నారు. కాగా, కార్యక్రమంలో భాగంగా బుధవారం పెద్దాపూర్, నిజాంపూర్, ఏటిగడ్డ సంఘం, ఆరూర్ గ్రామాలలోని గొర్రెలు, మేకలకు నట్టల నిర్మూలన మందులు త్రాపడం జరుగుతుందని ఆయన తెలిపారు. పశుపాలకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పశువైద్యాధికారి విజ్ఞప్తి చేశారు.



