నవతెలంగాణ వలిగొండ రూరల్
మండల పరిధిలోని సంగెం గ్రామానికి చెందిన పలువురు యువకులు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి.జహంగీర్ ల సమక్షంలో పార్టీలో చేరారు. మంగళవారం హైదరాబాదులోని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయం ఎంబి భవన్ లో సీపీఐ(ఎం) పార్టీ రాష్ట్ర కార్యదర్శి కండువాలు కప్పి యువకులను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జాన్ వెస్లీ, జహంగీర్ లు మాట్లాడుతూ.. దేశంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడేది ఎర్ర జెండా మాత్రమేనని, సమ సమాజం రావాలని, దోపిడీ పీడనల నుండి విముక్తి కావాలని సీపీఐ(ఎం) పనిచేస్తుందన్నారు.
రాష్ట్రంలో పాలకవర్గ, ప్రతి పక్ష పార్టీలు ఒకవైపు యువకులను మద్యం మత్తులో ముంచి, మరొకవైపు కుల, మతాల పేరుతో వారిని ప్రశ్నించకుండా చేస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో యువకులందరూ పాలకవర్గ ప్రతిపక్ష పార్టీల విధానాలను అర్థం చేసుకొని, ప్రజల కోసం పోరాడే సీపీఐ(ఎం) జెండా కిందికి రావాలని, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పోరాటాలను నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, బట్టుపల్లి అనురాధ,మండల కార్యదర్శి సిర్పంగి స్వామి, మండల కమిటీ సభ్యులు గాజులు ఆంజనేయులు, శాఖ కార్యదర్శి భీమనబోయిన జంగయ్య, నాయకులు ఏనుగు ప్రభాకర్ రెడ్డి, పార్టీలో చేరిన వారు కాసుల రవి, నకిరేకంటి మహేందర్, దుబ్బ నరసింహ, పూసుకురి జాన్, దుబ్బ మహేష్ తదితరులు పాల్గొన్నారు.



