క్రిస్‌మస్ అంటేనే ఆనందం. నక్షత్ర కాంతులతో మిరుమిట్లు గొలిపే ముంగిళ్లు.. అతిథులతో కళకలలాడే లోగిళ్లు… మరి వచ్చిన అతిథులకు నోరూరించే రకరకాల పిండి వంటలు కూడా సిద్ధం చేయాలి కదా! మీ బంధుమిత్రుల మనసంతా సంతోషంతో నిండిపోయేలా ఈ క్రిస్‌మస్‌కు కొన్ని రకాల వంటలు ప్రయత్నించండి…
ప్లమ్ పుడ్డింగ్
కావల్సిన పదార్థాలు: కిస్‌మిస్ – అరకప్పు, చెర్రీలు – అరకప్పు, ఖర్జూర పలుకుల తరుగు – అరకప్పు, నల్లద్రాక్ష – పావుకప్పు, టూటీఫ్రూటీ – అరకప్పు, కమలాఫలం రసం – కప్పు, జీడిపప్పు, బాదం పలుకులు – ముప్పావుకప్పు చొప్పున, ఎండు ఆప్రికాట్లు – అరకప్పు, బ్రెడ్‌పొడి – కప్పు, మైదా – అరకప్పు, గుడ్లు – రెండు, బేకింగ్‌పౌడర్ – చెంచా, బ్రౌన్‌షుగర్ – కప్పు, చాక్లెట్‌పొడి – రెండు టేబుల్‌స్పూన్లు, చల్లని వెన్న – కప్పు, దాల్చిన చెక్కపొడి – చెంచా, జాజికాయపొడి – చెంచా, ఉప్పు – అరచెంచా, వెనిల్లా ఎసెన్స్ – రెండు చెంచాలు.
తయారీ విధానం: ఒక రోజు ముందుగా కమలాఫలం రసంలో కిస్‌మిస్, చెర్రీలు, ఖర్జూర తరుగు, నల్లద్రాక్ష, టూటీ ఫ్రూటీ, ఎండు ఆప్రికాట్ ముక్కలు వేసుకుని బాగా కలపాలి. మర్నాడు ఈ మిశ్రమాన్ని మరో గిన్నెలో తీసుకుని అందులో వెన్న తప్ప ఒక్కో పదార్థాన్ని వేసుకుంటూ బాగా కలపాలి. తర్వాత వెన్నెను వేసి మరోసారి కలిపి ఈ మిశ్రమాన్ని పుడ్డింగ్ మౌల్డ్‌లో తీసుకుని బిగుతుగా మూత పెట్టాలి. ఇప్పుడు ఈ పాత్రను సిమ్‌లో ఆవిరిమీద నాలుగు గంటలు ఉడికించుకుని తీసుకోవాలి. అంతే ప్లమ్ పుడ్డింగ్ రెడీ…
డేట్ ఆల్మండ్ కేక్
కావల్సిన పదార్థాలు: ఖర్జూర ముక్కలు – కప్పు(నీళ్లతో ముద్దలా చేసుకోవాలి), బాదం పొడి – పావుకప్పు, గోధుమపిండి – కప్పు, బాదంపాలు – పిండి కలిపేందుకు, ఓట్స్‌పొడి – కప్పు, దాల్చిన చెక్కపొడి – అరచెంచా, బేకింగ్‌పౌడర్ – చెంచా, యాలకులపొడి – చెంచా, ఉప్పు – అరచెంచా, వెన్న – అరకప్పు, గుడ్డు – ఒకటి, వెనిల్లా ఎసెన్స్ – అరచెంచా, బాదంపలుకులు – అరకప్పు.
తయారుచేసే విధానం: ఓ గిన్నెలో గోధుమపిండి, ఓట్స్‌పొడి, బాదంపొడి, దాల్చినచెక్కపొడి, బేకింగ్ పౌడర్, యాలకులపొడి, ఉప్పు వేసి కలుపుకోవాలి. మరో గిన్నెలో వెన్న, గుడ్డుసొన, వెనిల్లా ఎసెన్స్ వేసుకుని బాగా గిలకొట్టుకోవాలి. ఇందులో గోధుమపిండి మిశ్రమం, ఖర్జూర ముద్ద వేసి బాదంపాలతో కేక్ మిశ్రమంలా కలపుకోవాలి. ఈ మిశ్రమాన్ని వెన్నరాసిన కేకు ట్రేలో తీసుకుని పైన బాదం పలుకుల్ని అలంకరించి 180 డిగ్రీల ఉష్ణోగ్రతలో ముందే వేడిచేసి పెట్టుకున్న అవెన్‌లో అరవై ఐదు నిమిషాలు బేక్ చేసుకుని తీసుకోవాలి.
కొబ్బరి కుకీస్
కావల్సిన పదార్థాలు: గోధుమపిండి – అరకప్పు, చక్కెరపొడి – పావుకప్పు, కొబ్బరిపొడి – ఒకటింబావు కప్పు, వెన్న – పావుకప్పు, వెనిల్లా ఎసెన్స్ – అరచెంచా, పాలు – టేబుల్‌స్పూను, ఉప్పు – పావుచెంచా.
తయారీ విధానం: ఓ గిన్నెలో వెన్న, చక్కెర పొడి వేసి క్రీమ్‌లా వచ్చే వరకూ గిలక్కొట్టుకోవాలి. ఇందులో కప్పు కొబ్బరి పొడితో పాటు మిగిలిన పదార్థాలను ఒక్కొక్కటిగా వేసుకుని మెత్తని పిండిలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కుకీల్లా చేసుకుని వాటికి మిగిలిన కొబ్బరిపొడి అద్ది 180 డిగ్రీల ఉష్ణోగ్రతలో ముందుగా వేడిచేసుకున్న అవెన్‌లో ఇరవై నిమిషాలు బేక్ చేసుకుని తీసుకోవాలి.
మలబార్ చికెన్ బిర్యానీ
కావల్సిన పదార్థాలు: చికెన్ ముక్కలు పెద్దవి – కేజీ, కారం – రెండు చెంచాలు, పసుపు – అరచెంచా, నిమ్మరసం – చెంచా, ఉప్పు – తగినంత.
మసాలా కోసం: ఉల్లిగడ్డ – రెండు పెద్దవి, టమాటా – ఒకటి, పెరుగు – కప్పు, కొత్తిమీర, పుదీనా తరుగు – కప్పు చొప్పున, గరంమసాలా – ఒకటిన్నర చెంచా, అల్లం వెల్లుల్లి ముద్ద – రెండు టేబుల్‌స్పూన్లు, పచ్చిమిర్చి – నాలుగు, నెయ్యి – అరకప్పు, బాస్మతీ బియ్యం – మూడు కప్పులు (ముందుగా నానబెట్టు కోవాలి), ఎర్రగా వేయించిన ఉల్లిగడ్డ ముక్కలు – కప్పు, నేతిలో వేయించిన జీడిపప్పు, కిస్‌మిస్ పలుకులు – పావుకప్పు చొప్పున, లవంగాలు – నాలుగు, యాలకులు – రెండు, దాల్చినచెక్క – ఒకటి.
తయారీ విధానం: చికెన్ ముక్కలపైన కారం, పసుపు, తగినంత ఉప్పు, నిమ్మరసం వేసి కలిపి ఫ్రిజ్‌లో పెట్టాలి. స్టౌమీద గిన్నె పెట్టి ముప్పావువంతు నెయ్యి వేసి ఉల్లిగడ్డ ముక్కలు, టమాటా తరుగు వేయించుకుని కొద్దిగా ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద, పెరుగు వేసి బాగా కలపాలి. రెండు నిమిషాలయ్యాక చికెన్ ముక్కలు, పుదీనా, కొత్తిమీర తరుగు, గరంమసాలా, పచ్చిమిర్చి వేసి కలిపి చికెన్ ఉడికిందనుకున్నాక దింపేయాలి. బియ్యాన్ని కడిగి అందులో లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క, ఆరుకప్పుల నీళ్లు పోసి అన్నాన్ని ముప్పావువంతు ఉడికించుకుని తీసుకోవాలి. ఇప్పుడు ఓ పెద్ద గిన్నె తీసుకుని అడుగున సగం కూర పరిచి సగం అన్నం.. వేయించిన ఉల్లిగడ్డ ముక్కలు, సగం జీడిపప్పు, కిస్‌మిస్ పలుకులు వేసి పైన మళ్లీ అదే విధంగా చేసుకోవాలి. దీనిపైన మిగిలిన నెయ్యి పోసి మూత పెట్టి ఇరవై నిమిషాలు దమ్ పద్ధతిలో సన్నని మంటపై ఉంచి దింపేయాలి.
క్రిస్‌మస్ విందు
- Advertisement -
- Advertisement -



