పరీక్షలంటే సహజంగా విద్యార్థులకు టెన్షన్ ఉంటుంది. కానీ, ఇప్పుడు ఆ భయం ఉపాధ్యాయులనూ పట్టుకుంది. భారత అత్యున్నత న్యాయస్థానం ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి చేస్తూ ఈ ఏడాది సెప్టెంబర్ ఒకటిన తీర్పు వెలువరించింది.ఈ తీర్పు ప్రకారం వీరంతా రెండేండ్లలోపు టెట్‌రాసి ఉత్తీర్ణులవ్వాలి. లేదంటే ఉద్యోగాలకే ఎసరొచ్చే ప్రమాదం ఉంది. ఇక్కడ తీర్పును తప్పు పట్టడం ఎవరి ఉద్దేశం కాదు, కానీ, దీనిపై రివ్యూ పిటిషన్ వేయాల్సిన బాధ్యత కేంద్రానిది. ఎందుకంటే దీన్ని అమలు చేయకూడదని ఇప్పటికే ఐదు రాష్ట్రాలు సహా ఉపాధ్యాయ వర్గాలు, సంఘాలు సుప్రీంలో ముప్ఫయి వరకు పిటిషన్లు దాఖలు చేశాయి. సమస్యను పరిష్కరించాల్సిన ఎన్‌సీటీఈ, కేంద్ర ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటికీ నాలుగు నెలలు అవుతున్నా ఆ దిశగా అడుగులు వేయడం లేదు. ఇది న్యాయపరమైన తీర్పు అనడం కంటే, ఒక విధాన వైఫల్యానికి వచ్చిన తుదిముద్రలా మారింది. ఏ రకంగా చూసినా విద్యారంగం మీద ప్రభావం చూపే నిర్ణయమిది!
విద్యాహక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి టెట్ తప్పనిసరి చేస్తూ 2010 ఆగస్టు 23న నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్స్ ఎడ్యుకేషన్ (ఎన్‌సీటీఈ) ఉత్తర్వులు జారీ చేసింది. దీని తర్వాత టెట్ అర్హత సాధించిన వారే డీఎస్సీకి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఐదేండ్లలోపు సర్వీస్ ఉన్న ఉపాధ్యాయులు మినహా రాష్ట్రంలో వివిధ క్యాడర్లలో ఉన్న మిగతావారు టెట్ రాయాల్సి ఉంటుంది. మినహాయింపువారు కూడా పదోన్నతులు పొందాలంటే టెట్ తప్పనిసరి. 2010కంటే ముందు కేవలం డీఎస్సీ పరీక్షను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. ఇందులో ప్రతిభ కనబరచిన వారికి ఉపాధ్యాయ పోస్టులకు ఎంపిక చేసింది. సుప్రీంతీర్పు నేపథ్యంలో 2027 ఆగస్టు 31వ తేదీలోపు వీరంతా టెట్ ఉత్తీర్ణులు కావాల్సి ఉంది. దేశంలో ఇరవై ఐదు లక్షల వరకు ఉంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంఖ్య 45,742లుగా ఉన్నది. వీరందరిపై టెట్ ప్రభావం చూపుతుంది. ఉపాధ్యాయుల ఆమోదయోగ్యం లేని ఇలాంటి సంస్కరణలు విద్యారంగాన్ని గందరగోళ పరచడమే కాదు, సంక్షోభంలోకి నెడతాయి.
ఉద్యోగంలో చేరినప్పుడు లేని నిబంధన సర్వీసులోకి వచ్చాక తీసుకురావడం సహేతుకం కాదు. పదేండ్లు, పదిహేనేండ్లు పనిచేసిన తర్వాత ఉద్యోగ భద్రతకు ముడిపెట్టి అమలు చేస్తామనడం నిజంగా అన్యాయం. ఉపాధ్యాయుడు పిల్లలకు పాఠాలు చెప్పాలి. పరీక్షలు నిర్వహించాలి, మూల్యాంకనాలు చేయాలి. ప్రభుత్వ కార్యక్రమాలకు సహకరించాలి. వీటన్నింటితో పాటు టెట్ కోసం ప్రత్యేకంగా చదవాలి. ఇప్పటికే ఒత్తిడికి గరవుతున్న వారిని ఇది మానసికంగా మరింత కుంగదీస్తుంది. పైగా ప్రభుత్వపాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు, టెట్ అర్హత కోసం పరీక్ష రాసే నిరుద్యోగులకు ఒకే విధమైన సిలబస్ ఉండనుంది. విద్యాబోధనకు సంబంధించి ఇప్పటికే పలుమార్లు శిక్షణ పొందిన ఉపాధ్యాయులు మళ్లీ మొదటికే రావాలి. టీచర్లుగా పనిచేస్తున్న వారికి కేవలం వారు బోధించే సబ్జెక్ట్‌లపై పట్టు ఉంటుంది. కొత్త సిలబస్‌తో టెట్ అర్హత సాధించడమంటే కష్టతరం కాదా? అందుకే పాతికేళ్లకు పైగా ఉద్యోగం చేస్తున్న ఉపాధ్యాయులు ‘మేం ఇప్పుడు పరీక్షలు ఎదుర్కొవాలా?’ అని ప్రశ్నించడం కూడా సబబే అనిపిస్తుంది. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు, వయసు మీదపడిన వారు కంప్యూటర్ ముందు కూర్చొని ఆన్‌లైన్‌లో పరీక్ష రాయడం సాధ్యమయ్యే పనేనా? ఇంతమాత్రం కూడా కేంద్రం ఆలోచించకపోవడం శోచనీయం.
రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. కానీ, టెట్ నోటిఫికేషన్ వేసి దరఖాస్తులు కోరడంతో ఉపాధ్యాయుల్లో ఆందోళన పెరిగింది. కొత్తగా పోటీపడే అభ్యర్థులకు టెట్ అవసరమే. కానీ, ఉపాధ్యాయుల్లో నెలకొన్న భయాందోళనల్ని దూరం చేయాలంటే కేంద్రం చొరవ చూపాలి. తక్షణమే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలి. విద్యాహక్కు చట్టం అమలుకు పూర్వం నియామకమైన ఉపాధ్యాయులకు టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి కాకుండా సవరణ ఉత్తర్వులు పొందాలి. ఉపాధ్యాయ అర్హత పరీక్షను ప్రాస్పెక్టివ్‌గా అమలు చేసే విధంగా పార్లమెంటులో విద్యాహక్కుచట్టం సెక్షన్ 23ను సవరించాలి. టెట్ సిలబస్‌ను, అర్హత మార్కులను సవరించి టెట్‌ను ఈ రెండేండ్లలో వీలైనన్ని ఎక్కువసార్లు నిర్వహించాలి. లేదా ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక టెట్‌ను నిర్వహించాలి. ఒక ఉపాధ్యాయునికి బోధనా అనుభవం కన్నా గొప్ప అర్హతేమీ ఉండదు.దాన్ని టెట్ ద్వారా కొలవాలనుకోవడం సరికాదు. సుప్రీం తీర్పును గౌరవించడం సర్కారు బాధ్యత. అలాగే ఉపాధ్యాయుల గౌరవాన్ని కాపాడటం కూడా సర్కారుదే బాధ్యత. ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధించే విధానాల్ని అనుసరించాలి. లేదంటే టెట్ టెన్షన్ తగ్గదు.
‘టెట్’ టెన్షన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



