Wednesday, December 24, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసింగరేణికి కార్మికులే బలం

సింగరేణికి కార్మికులే బలం

- Advertisement -

– వారి భద్రత, సంక్షేమానికి ప్రాధాన్యం : ఇన్‌చార్జి సీఎండీ డి. కృష్ణభాస్కర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

సింగరేణి సంస్థకు కార్మికులే బలమని సంస్థ ఇన్‌చార్జి సీఎండీ డి.కృష్ణభాస్కర్‌ అన్నారు. సింగరేణి 137వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కార్మికుల భద్రత, సంక్షేమానికి సంస్థ కట్టుబడి ఉందని తెలిపారు. ఇప్పటికే అమల్లో ఉన్న పథకాలను మెరుగుపర్చడం, పని పరిస్థితులను మరింత సురక్షితంగా చేయడమే లక్ష్యమన్నారు. ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా ప్రతీ ఒక్కరం కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వాతావరణ ప్రతికూలతలు, సాంకేతిక సవాళ్లు, మార్కెట్‌ మార్పులు ఉన్నప్పటికీ భద్రత ప్రమాణాలను పాటిస్తూ వనరులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ ముందుకు సాగినట్లు గుర్తుచేశారు. ఈ ప్రయత్నంలో ప్రతీ కార్మికుడు, సూపర్‌ వైజర్‌, అధికారి చూపిన బాధ్యతలను ఆయన ప్రశంసించారు. ఉత్పత్తి సామర్థ్యం, సంస్థ స్థిరత్వం, భవిష్యత్‌ అవకాశాల కోసం ఇతర రంగాలపైనా దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో కీలక ఖనిజాలు, అనుబంధ రంగాల్లో ప్రయత్నాలు సాగిస్తున్నామని వివరించారు. అలాగే ఇంధన రంగంలో జరుగుతున్న మార్పులను గమనిస్తూ, పునరుత్పాదక శక్తి వంటి రంగాల్లో సింగరేణి ఏ పాత్ర పోషించగలదో అన్న దానిపై కూడా ఆలోచన చేస్తున్నట్లు వెల్లడించారు. సామాజిక బాధ్యతలో భాగంగా, పరిసర ప్రాంతాల అభివృద్ధి, విద్య, ఉపాధి అవకాశాల విషయంలో సింగరేణి తన వంతు పాత్రను కొనసాగిస్తోందని వివరించారు. సంస్థలో మహిళా శక్తి పెరుగుతున్న తీరు, గనుల్లో, ఆపరేషన్లలో, రక్షణ బృందాల్లో వారి భాగస్వామ్యం గొప్ప సూచికగా అభివర్ణించారు. సరైన వేగంతో, సరైన దిశలో, పరస్పర విశ్వాసంతో ముందుకు సాగితే సింగరేణి తన సుస్థిరతను కాపాడుకుంటూ మారుతున్న కాలానికి తగినట్టుగా మారగలదన్న నమ్మకం ఉందని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ బి.వెంకన్న, అడ్వైజర్‌ ఫారెస్ట్రీ మోహన్‌ పరిగెన్‌, జీఎం(కో ఆర్డినేషన్‌) టి.శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -