– మల్లు లక్ష్మి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
హైదరాబాద్ ఆర్టీసీ కళ్యాణ మండపంలో జనవరి 25 నుంచి 28 వరకు జరగనున్న ఐద్వా 14వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఐద్వా రాష్ట్ర కార్యాలయంలో మహాసభల సన్నద్ధం కోసం సోషల్ మీడియా శిక్షణా తరగతులను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహాసభలకు 26 రాష్ట్రాల నుంచి వెయ్యి మంది ప్రతినిధులు హాజరవుతున్నట్టు తెలిపారు. ఐద్వా ఆలిండియా ఫ్యాట్రన్ బృందాకారత్‌తో పాటు అధ్యక్ష, కార్యదర్శులు పి.కె.శ్రీమతి, మరియం ధావలే, ఆలిండియా నాయకులు ఎస్.పుణ్యవతి, సుధా సుందర రామన్‌తో పాటు నాయకులు, ప్రతినిధులు పాల్గొంటున్నట్టు చెప్పారు. మహాసభల్లో దేశవ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిచుకుని మహిళా ఉద్యమాలకు బలోపేతం చేసుకుంటామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా టీమ్ జాతీయ మహాసభలు జయప్రదం కావటం కోసం విస్తృతంగా ప్రచారం చేయాలని ఆమె కోరారు. ఎక్కడైతే మహిళలు సమస్యల్లో ఉంటారో అక్కడ ఐద్వా ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. సోషల్ మీడియాపై అవగాహన కల్పిస్తున్న రాష్ట్ర నెట్‌వర్క్ కన్వీనర్ పిట్టల రవి, సోషల్ మీడియా రాష్ట్ర నాయకులు సోమన్నకు ఐద్వా తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్.అరుణజ్యోతి, ఆఫీస్ బేరర్లు వై.వరలక్ష్మి, రాష్ట్ర కమిటీ సభ్యులు సుజాత, కె.అనురాధ, నాగమణి అజిత, స్వరూప, కవిత, ఉమ, విమల, పద్మ, వి.వాణి, రోజారాణి తదితరులు పాల్గొన్నారు.
ఐద్వా 14వ జాతీయ మహాసభలు జయప్రదం చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



