Wednesday, December 24, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంగ్లోబల్‌గా ఎదగాలనే సింగరేణి ప్రయత్నం అభినందనీయం

గ్లోబల్‌గా ఎదగాలనే సింగరేణి ప్రయత్నం అభినందనీయం

- Advertisement -

– మైనింగ్‌లో సింగరేణికి ఉన్నంత అనుభవం ఏ కంపెనీకీ ఉండదు
– విద్యుత్‌ ఉత్పాదనలో సింగరేణి అడుగు పెట్టింది
– కాలానుగుణంగా సింగరేణి అప్‌డేట్‌ కావాలి : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
– సత్తుపల్లిలో సింగరేణి సత్తుపల్లి ఏరియా జీఎం కార్యాలయం ప్రారంభం
నవతెలంగాణ-సత్తుపల్లి

సింగరేణి సంస్థ గ్లోబల్‌గా ఎదగాలని ప్రయత్నం చేయడం అభినందనీయమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సింగరేణి సంస్థ సత్తుపల్లిలో నిర్మించిన సత్తుపల్లి ఏరియా జీఎం కార్యాలయాన్ని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్‌ మట్టా రాగమయి దయానంద్‌, సింగరేణి సీఎండీ కృష్ణభాస్కర్‌, కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టితో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంగళవారం ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో భట్టి మాట్లాడుతూ.. మైనింగ్‌లో సింగరేణికి ఉన్నంత అనుభవం ఏ ఇతర కంపెనీలకు ఉండదన్నారు. విద్యుత్‌ ఉత్పాదన రంగంలో సైతం సింగరేణి అడుగు పెట్టిందన్నారు. కాలానుగుణంగా మార్కెట్‌ను తట్టుకొనేందుకు సింగరేణి సంస్థ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ కావాలన్నారు. ఇతర రాష్ట్రాల్లోని థర్మల్‌ పవర్‌ స్టేషన్లకు సింగరేణి నుంచి బొగ్గు పంపిణీ జరుగుతోందని తెలిపారు. మార్కెట్‌లో ఉన్న పోటీని తట్టుకోవాలంటే ఉత్పత్తిని పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కాపర్‌, గోల్డ్‌ మైన్‌కు సంబంధించి కర్నాటకలో సింగరేణి సంస్థ అడుగు పెట్టిందన్నారు. కేంద్ర ప్రభుత్వం బొగ్గు బావులకు వేలంపాటలు నిర్వహిస్తే ఒక్క బొగ్గుబావి కూడా తెలంగాణ నుంచి బయటకు పోకుండా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని తెలిపారు. జైపూర్‌లో ఇప్పటికే సింగరేణి విద్యుత్‌ ఉత్పత్తి చేస్తోందని, గ్రీన్‌ ఎనర్జీలో కూడా సింగరేణి అడుగులు వేస్తోందన్నారు. బహుముఖంగా సింగరేణి విస్తరించేందుకు ప్రణాళిలతో ముందుకు వెళ్తున్నామన్నారు. సామాజిక అంశాలను పరిశీలించి పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తామని తెలిపారు. సింగరేణి సంస్థ మన అందరిదని, కంపెనీని లాభాల బాటలో నడిపించడానికి యాజమాన్యం కృషి చేయాలన్నారు. సింగరేణి సంస్థ ద్వారా పర్మినెంట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు సుమారుగా 85వేల మంది వరకు ఉపాధి పొందుతున్నారన్నారు. సభ ప్రారంభానికి ముందు సింగరేణి సంస్థ 135 వసంతాలు పూర్తి చేసుకొని 136వ వసంతంలోకి అడుగిడిన సందర్భంగా డీప్యూటీ సీఎం చేతుల మీదుగా కేక్‌ కట్‌ చేయించారు. అనంతరం జేవీఆర్‌ ఓసీని సందర్శించారు. సింగరేణి అధికారులతో సమీక్ష జరిపారు. కిష్టారం గ్రామంలోని ఓసీలో బంకరు కారణంగా పలు కాలనీల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వారికి ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అందించాలని సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయి దయానంద్‌ డిప్యూటీ సీఎం భట్టిని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీ సునీల్‌దత్‌, డీఎఫ్‌ఓ సిద్ధార్థ్‌ విక్రం సింగ్‌, ఎన్‌పీడీసీఎల్‌ సీఎండీ వరుణ్‌రెడ్డి, సత్తుపల్లి ఏరియా జీఎం చింతల శ్రీనివాస్‌, పీవోలు ఎన్వీర్‌ ప్రహ్లాద్‌, ఏఎంసీ చైర్మెన్‌ దోమ ఆనంద్‌బాబు, గిడ్డంగుల చైర్మెన్‌ రాయల నాగేశ్వరరావు, కాంగ్రెస్‌ నాయకులు డాక్టర్‌ మట్టా దయానంద్‌, చల్లగుళ్ల నరసింహారావు, గాదె చెన్నకేశవరావు, కమల్‌పాషా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -