ఇరిగేషన్ అధికారులపై మంత్రి మండిపాటు
నవతెలంగాణ – మల్హర్ రావు
కమిషన్లకు కక్కుర్తిపడి చెక్ డ్యామ్స్ నాసిరకంగా నిర్మాణాలు చేపట్టారని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు అన్నారు. బుధవారం భూపాలపల్లి-పెద్దపల్లి జిల్లాల సరిహద్దుల్లో అడవి సోమన్ పల్లి-వళ్లెంకుంట మానేరుపై డ్యామేజ్ ఆయిన చెక్ డ్యామ్ ను ఇరిగేషన్ అధికారులతో కలిసి సందర్శించి, పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. నాణ్యత లేకుండా చెక్ డ్యామ్ లు నిర్మాణం ఎవరి ప్రమేయంతో కట్టిండ్రో త్వరలోనే బయటపడుతుందన్నారు. ఆనాడే నాసిరకంగా చెక్ డ్యాములు నిర్మించారని ఇరిగేషన్ అధికారుల పై మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వంలో మానేరు పైన నిర్మిస్తున్న చెక్ డ్యామ్ లు నాసిరకంగా ఉన్నాయని, రైతులకు వాటితో ఎలాంటి లాభం లేదని ఆనాడే తను ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అసెంబ్లీలో ప్రశ్నించానని పేర్కొన్నారు. ఆనాటి ప్రభుత్వము,అధికారులు కొంతమంది కమిషన్ల కోసమే చెక్ డ్యామ్ లు నాసిరకంగా నిర్మించారనీ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా మూడు బ్యారేజీలు నిర్మించినప్పటికీ వాటితో రైతులకు ఒక ఎకరానికి కూడా నీళ్లు ఇయ్యని పరిస్థితిని ఇక్కడ మానేరు పై నిర్మించిన చెక్ డ్యాములతో రైతులకు ఎలాంటి లాభం లేదని విమర్శించారు.
భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూలిపోయిన చెక్ డ్యామ్ ను క్షుణ్ణంగా పరిశీలించి రిపోర్ట్ ఇవ్వాలని విజిలెన్స్ అధికారులకు ఆదేశాలిచ్చారన్నారు. విజిలెన్స్ విచారణ వెంటనే పూర్తి చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.




