కాంగ్రెస్ నాయకుడు బిట్ల ప్రేమ్ కుమార్
నవతెలంగాణ – సదాశివపేట
గత పది సంవత్సరాల బి ఆర్ ఎస్ పాలనలో సదాశివపేట పట్టణ అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని కాంగ్రెస్ నాయకుడు బిట్ల ప్రేమ్‌కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. బుధవారం సదాశివపేటలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో సదాశివపేటకు వచ్చిన నిధులను సక్రమంగా వినియోగించకపోవడం వల్లే పట్టణం ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదని ఆరోపించారు. ప్రజల అవసరాలను పూర్తిగా విస్మరించిన స్థానిక నాయకుల నిర్లక్ష్యమే ఇందుకు ప్రధాన కారణమని పేర్కొన్నారు. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాల్లో పట్టణం తీవ్రంగా వెనుకబడి ఉందని తెలిపారు. ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడినా గత పాలకులు పట్టించుకోలేదని విమర్శించారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి నేతృత్వంలో సదాశివపేట అభివృద్ధి దిశగా ముందడుగులు పడుతున్నాయని బిట్ల ప్రేమ్‌కుమార్ అన్నారు. ఇప్పటికే చేపడుతున్న అభివృద్ధి పనులతో పాటు, మరిన్ని నిధులు తీసుకువచ్చి పట్టణాన్ని సమగ్ర అభివృద్ధి పథంలో నడిపించే సామర్థ్యం జగ్గారెడ్డికే ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీజీఐఐసీ కార్పొరేషన్ చైర్మన్ నిర్మల జయప్రకాశ్ రెడ్డి కూడా సదాశివపేటను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు.
పరిశ్రమల స్థాపనకు అనుకూల వాతావరణం కల్పించడంతో పాటు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా టీజీఐఐసీ ద్వారా పలు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. సదాశివపేటను భవిష్యత్తులో ఒక పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల ఆకర్షణ కోసం తాము పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి నాయకత్వంలో పట్టణ అభివృద్ధితో పాటు ఆర్థిక ప్రగతి కూడా సాధ్యమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తోందని, సదాశివపేటను అన్ని రంగాల్లో ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.



