నవతెలంగాణ – హైదరాబాద్: ఎం.ఎన్.జే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అండ్ రీజినల్ క్యాన్సర్ సెంటర్‌లో పాథాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ కోవూరి ఉమాదేవి, వైద్యం, విజ్ఞానం, సాంకేతిక రంగాలలో చేసిన విశిష్ట సేవలకు గాను 2024 సంవత్సరానికి తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (టీఏఎస్) ద్వారా అసోసియేట్ ఫెలోగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా, హైదరాబాద్‌లోని ఎన్.జి.ఆర్.ఐ (జాతీయ భూభౌతిక పరిశోధనా సంస్థ) లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో టీఏఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ మోహన్ రావు చేతుల మీదుగా డాక్టర్ ఉమాదేవి అధికారికంగా ఈ గౌరవాన్ని అందుకున్నారు.
డాక్టర్ ఉమాదేవి క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తించేందుకు టెరాహెర్ట్జ్ రేడియేషన్ వినియోగం, అలాగే పాథాలజీలో కృత్రిమ మేధస్సు ఆధారిత నిర్ధారణ విధానాలపై వినూత్న పరిశోధనలు నిర్వహిస్తున్నారు. అనేక పేటెంట్లు ఉండటంతో పాటు, అధిక ఇంపాక్ట్ ఫ్యాక్టర్ కలిగిన అంతర్జాతీయ ప్రతిష్టాత్మక జర్నళ్లలో పలు పరిశోధనా వ్యాసాలు ప్రచురితమయ్యాయి. తన పరిశోధనలను అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించేందుకు భారతీయ వైద్య పరిశోధనా మండలి (ICMR), శాస్త్ర సాంకేతిక పరిశోధన మండలి (SERB), భారత శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధన మండలి (CSIR) వంటి ప్రముఖ సంస్థల నుంచి ప్రయాణ సహాయ నిధులు పొందారు. ఈ గ్రాంట్లతో ఆమె అమెరికా, టర్కీ తదితర దేశాలలో జరిగిన శాస్త్రీయ సదస్సుల్లో పాల్గొని తన పరిశోధన ఫలితాలను అంతర్జాతీయ స్థాయిలో ప్రతినిధ్యం వహించారు.
ఈ సందర్భంగా ఉమాదేవి మాట్లాడుతూ, “తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వంటి ప్రతిష్టాత్మక సంస్థ నుంచి ఈ గౌరవం అందుకోవడం నాకు అత్యంత ఆనందంగా ఉంది. వైద్యవృత్తి నిపుణులు మరింతగా శాస్త్రీయ పరిశోధనల వైపు దృష్టి సారించి, ఇటువంటి వేదికలతో అనుసంధానం కావాలని కోరుకుంటున్నాను,” అని తెలిపారు. ఈ ఘనతతో పరిశోధనా ప్రయాణానికి మరింత గౌరవం, గుర్తింపు లభించిందని వైద్య, శాస్త్రీయ వర్గాలు అభినందనలు తెలియజేస్తున్నాయి.
డాక్టర్ కోవూరి ఉమాదేవికి తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అసోసియేట్ ఫెలో గౌరవం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



