Thursday, December 25, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిజర్నలిజంపై మోడీ చావుదెబ్బ

జర్నలిజంపై మోడీ చావుదెబ్బ

- Advertisement -

ఇప్పటికే కుచించుకుపోయిన స్వేచ్ఛాయుత జర్నలిజంపై కేంద్రంలోని మోడీ ప్రభుత్వం లేబర్‌కోడ్‌లతో చావుదెబ్బ కొట్టింది. ఇవి అమల్లోకి రావడంతో జర్నలిస్టుల, నాన్‌- జర్నలిస్టుల వేతనబోర్డు వ్యవస్థ రద్దయింది. వేతన సవరణలో ఇప్పటిదాకా ఏదో ఒక మేరకు పత్రికా సిబ్బందికి జాతీయ స్థాయిలో ఉమ్మడిగా బేరసారాలు ఆడే అవకాశం ఉండేది. వేతనబోర్డుల ముందు జర్నలిస్టులు, నాన్‌-జర్నలిస్టులు పెరిగిన ధరలను అనుసరించి తమ వేతనాలపై ప్రతిపాదనలు ఉంచే వారు. చాలా చర్చలు జరిగాక పత్రికల ఆదాయం, సర్క్యులేషన్‌ వగైరాలను బట్టి ఆయా గ్రూపుల్లోని వివిధ కేటగిరీల వేతనాలపై సిఫారసులు ప్రకటించేది. ఆ సిఫారసులను అమలు చేయడంలో యాజమాన్యాలు జాప్యం చేసినా, తటపటాయించినా కార్మికశాఖపై యాజమాన్యాలపై ఒత్తిడి తెచ్చి అమలు చేయించుకొనేవారు. జర్నలిస్టులు, నాన్‌ జర్నలిస్టుల కోర్టులు వేజిబోర్డు సిఫార్సులకు అనుకూలంగా తీర్పులు చెప్పేవి. రాష్ట్రస్థాయిలో వేజిబోర్డు సిఫారసులను అమలు చేయడానికి ఉన్నతస్థాయి కమిటీలు ఉండేవి.

కార్మికశాఖ జాయింట్‌ కమిషనర్‌ అధ్యక్షుడిగా యూనియన్ల యాజమాన్యాల ప్రతినిధులు అందులో సభ్యులుగా ఉండేవారు. ఆ కమిటీలో ఒక తడవ యూనియన్‌ తరపున ప్రస్తుత మీడియా అకాడెమి ఛైర్మన్‌ కె.శ్రీనివాసరెడ్డితో పాటు నేనూ సభ్యుడిగా ఉన్నాను. బోర్డు సిఫారసులను అమలు చేయకుండా యాజమాన్యాలు ఎన్ని ఎత్తులకు, జిత్తులకు పాల్పడినా, చివరికి వాటిని అమలు చేయాల్సి వచ్చేది. మోడీ ప్రభుత్వం ఆ..భద్రతను తొలగించింది. జర్నలిస్టులను, నాన్‌ జర్నలిస్టులను యజామాన్యాల దయాదాక్షిణ్యాలకు అప్పగించింది. దానితోపాటు యాజమాన్యాలు జర్నలిస్టులను, ఇతర సిబ్బందిని తమ ఇష్టం వచ్చినట్లు తొలగించడానికి వీల్లేకుండా వర్కింగ్‌ జర్నలిస్టు చట్టం, కార్మిక చట్టాలు అడ్డుపడేవి. అలా తొలగించబడిన జర్నలిస్టులను నాన్‌ జర్నలిస్టుల రక్షణకు జర్నలిస్టు సంఘాలు, ప్లాంట్‌ స్థాయి యూనియన్లు రంగంలోకి దిగేవి. అలా తొలగించిన వారిని యాజమాన్యాలు తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవడమో లేదంటే చట్ట ప్రకారం తాము ఇవ్వాల్సిన డబ్బు చెల్లించడమో చేసేవి.

ఇలాంటి కేసుల్లో హైదరాబాదు జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడిగా నేను కొందరు జర్నలిస్టుల కేసులు టేకప్‌ చేసి కార్మికశాఖ సహాయంతో వారికి రావాల్సిన డబ్బులిప్పించాను. మన రాష్ట్రంలోని ఒక పెద్ద పత్రిక ప్లాంట్‌ లెవల్‌ యూనియన్‌ కోర్టులో చేసిన పోరాటం వల్ల ఆ యాజమాన్యం తాను తొలగించిన జర్నలిస్టులకు దాదాపు ఇరవై ఏండ్ల వేతనాలను లెక్కగట్టి చెల్లించాల్సి వచ్చింది. ఒక ఉర్దూ పత్రిక తన సిబ్బందికి వేతనబోర్డుల సిఫార్సుల ప్రకారం వేతనాలు చెల్లించకుండా కాలం గడుపుతూ వచ్చింది. హైదరాబాద్‌ జర్నలిస్టు యూనియన్‌ మద్దతుతో ప్లాంట్‌ లెవల్‌ యూనియన్‌ హైకోర్టుకి వెళ్లింది. ఆ దశలో యాజమాన్యం కోర్టు వెలపల తన అడ్వకేట్‌ ముందు బేరసారాలకు పిలిచింది. హైదరాబాద్‌ జర్నలిస్టు యూనియన్‌ కార్యదర్శిగా నేను మరికొందరు ఆ సమావేశాల్లో పాల్గొని వేతనబోర్డు సిఫార్సుల మేరకు ఎరియర్లతో సహా వేతనాలు చెల్లించాలని పట్టుబట్టి ఇప్పించాము. ఇది ముప్పయి ఏళ్ల నాటి మాట.

లేబర్‌కోడ్‌లతో మోడీ ప్రభుత్వం ఇప్పుడు అలాంటి అవకాశాలు లేకుండా చేసింది. తన అప్రజాస్వామిక నిర్ణయాలను, చర్యలను బలపరిచే మీడియా యాజమాన్యలకు మేలు చేసింది. జర్నలిస్టులను నాన్‌ జర్నలిస్టులను బలిపశువులగా అప్పగించింది.వేతనబోర్డుల సిఫారసులను వమ్ము చేయడానికి పత్రికల యాజమాన్యాల అనేక ఎత్తులు వేసేవి. ”ఫేక్‌” కంపెనీలను సృష్టించి తమ సిబ్బందిని ఆ కంపెనీలకు బదిలీ చేసేవి. తమకు వార్తలివ్వడానికి విలేకరులు లేరని తమకు వేరే ఒక వార్తా సంస్థ వార్తలు ఇస్తోందని బకాయించే ప్రపంచానికి సుద్దులు చేసే యాజమాన్యాలు తమ సిబ్బంది దగ్గరికి వచ్చేసరికి నిస్సశయంగా బొంకులాడేవి. కొన్ని పత్రికలు అడ్వర్‌టైజ్‌మెంట్‌, సర్క్యులేషన్‌ వగైరా అన్ని విభాగాలకు ఫేక్‌ కంపెనీలను సృష్టించాయి. పైస్థాయి ఉద్యోగులను ఫేక్‌ కంపెనీలకు ఛైర్మన్లుగా, మేనేజింగ్‌ డైరెక్టర్లుగా చూపెట్టేవి. నిర్ణయాలు మాత్రం యాజమాన్యాలే చేస్తాయి. ఆ బినామీలకు కనీసం సమాచారం ఇచ్చేవి కావు. జర్నలిస్టు యూనియన్ల పోరాటం వల్ల తదపరి వేతన సంఘాలు ఈ అక్రమ పద్ధతులపై నియంత్రణలు విధించాయి. చట్టాలను ఉల్లఘించడానికి పత్రికల యాజమాన్యాలు ఫేక్‌ కంపెనీలను సృష్టిస్తున్నాయి కనుక ఆయా పత్రికలకు వర్తించే గ్రూపులోని వేతనాలే ఆ ఫేక్‌ కంపెనీలకు వర్తిస్తాయని స్పష్టం చేశాయి.

కార్మిక కోడ్‌లు అమల్లోకి వచ్చాక యజమాన్యాలకు ఏ దాపరికం అవసరం లేదు. జర్నలిస్టులను, నాన్‌ జర్నలిస్టులను నంజుకుతినొచ్చని కోడ్‌ల ద్వారా ప్రభుత్వం యాజమాన్యాలకు అనుమతి ఇచ్చింది. జర్నలిస్టుల వేతనాలకు, సర్సీసు కండిషన్లకు, పత్రికాస్వేచ్ఛకు సంబంధమేమిటీ అని సందేహం ఎవరికైనా కలగొచ్చు. జర్నలిజానికి కొన్ని విలువలు ఉన్నాయి. జర్నలిజం కాలేజీల్లో, శిక్షాణా కేంద్రాల్లో వాటిని బోధిస్తారు. ఆ విలువలను అనుసరించి జర్నలిస్టులు తమ వృత్తిధర్మం నేరవేర్చాలి. ఉద్యోగాల్లో చేరాక, పత్రిక విధానాన్ని బట్టి రాయాల్సి వచ్చినా మౌలిక విలువలకు హాని జరుగుతుంటే అంతరాత్మ అడ్డుపడుతుంది. ఆ అంతరాత్మపైనే మోడీ దెబ్బ వేశాడు. జర్నలిస్టులు కూడా ఇతర ఉద్యోగుల వంటి వారేనని మోడీ చెప్పకనే చెప్పారు. ఆ మార్గంలోనే జర్నలిస్టుల రక్షణ కోసం నిలబడే చట్టాలకు నీళ్లొదిలారు. జర్నలిస్టు విచక్షణకు అవకాశం లేకుండా చేసి యాజమాన్యాలు ‘త’ అంటే జర్నలిస్టు ‘తందాన’ అనేట్లు చేశారు.

చాలా ఏళ్లుగానే జర్నలిస్టులు ఉద్యోగ భద్రతను కోల్పోయారు. చట్టాలను లెక్కచేయని యాజమాన్యాల నిరంకుశ ధోరణి వల్ల పెద్దసంఖ్యలో జర్నలిస్టులు వీధుల పాలయ్యారు. కార్మికశాఖ చేతులెత్తేయడంతో యూనియన్లు నిర్వీర్యమయ్యాయి. మోడీ ప్రభుత్వంలో ధోరణి మరింత ఊపందుకుంది. మీడియా కార్పోరేటీకరణ పెద్దస్థాయిలో సాగుతోంది. సీనియర్‌ జర్నలిస్టులు కూడా తమ తలలు ఎప్పుడు తెగిపడతాయోననే భయంతో బతుకుతున్నారు. పెద్దపెద్ద మీడియా సంస్థలోని పేరు మోసిన జర్నలిస్టుల పరిస్థితి మనం చూశాం. ప్రభుత్వ విధానాలను ప్రశిస్తే తన తల కోట గుమ్మానికి ఎప్పుడైనా వేలాడవచ్చు, లేదా భారీగా పరువు నష్టం దావాలు పడవచ్చునని జర్నలిస్టులు భయపడుతున్నారు. ఈ దశాబ్దకాలంలో పత్రికారంగంలో క్యాజువల్‌, కాంట్రాక్టు పద్ధతిలో జర్నలిస్టుల నియామకాలు పెరిగాయి. అలా ఉద్యోగంలో చేరిన జర్నలిస్టులకు చట్టపరమైన భధ్రత ఏమాత్రం లేకుండా పోయింది. స్వతంత్రంగా వ్యవహరించే జర్నలిస్టులకు ఉద్యోగ భద్రతనే కాదు భౌతిక దాడుల నుండి కూడా రక్షణ లభించదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వివిధ వర్గాల్లో వెల్లడయ్యే అసమ్మతులను ప్రజలకు తెలియకుండా కప్పి పెట్టడానికి అవకాశం పెరిగింది.

జర్నలిస్టులు నిర్వహించిన పాత్రపై 1959లో సుప్రీంకోర్టు ఇలా వ్యాఖ్యానించింది. ”ప్రజలు తమ భావ ప్రకటనా స్వేచ్ఛను ఉపయోగించు కోవడంలో స్వరతంతుల్లా పని చేసే జర్నలిస్టుల పాత్ర ఎంతో ప్రధానమైనది” అని పేర్కొంది. అలాంటి జర్నలిస్టులు స్వేచ్ఛగా పని చేయాలంటే వారికి ఉద్యోగ భద్రత, కార్మిక చట్టాల ద్వారా హక్కులు కల్పించడం ప్రభుత్వ బాధ్యత. కానీ దానికి బదులు రక్షణ కల్పించే ఆ చట్టాలను బలహీనం చేస్తే జర్నలిస్టులు వేధింపులకు గురవుతారు. దానివల్ల ప్రజాస్వామ్యానికే తీరని హాని జరుగు తుంది. వర్కింగ్‌ జర్నలిస్టు, అదర్‌ న్యూస్‌ పేపర్‌ ఎంప్లాయీస్‌ యాక్టు, అండ్‌ మిస్లీనియస్‌ యాక్టు 1955 ద్వారా వర్కింగ్‌ జర్నలిస్టులకు కొన్ని హక్కుల లభించేవి. ఇప్పుడు తెచ్చిన ఆకుపేషనల్‌ సేఫ్టీ, హెల్త్‌, అండ్‌ వర్కింగ్‌ కండిషన్స్‌ కోడ్‌ ఓఎస్‌హెచ్‌ 2020 ద్వారా ఆ హక్కులను ప్రభుత్వం రద్దు చేసింది. హక్కుల క్రమబద్ధీకరణ పేర వర్కింగ్‌ జర్నలిస్టులకు ఇప్పుడున్న హక్కులకే ఎసరు పెట్టింది. లేబర్‌కోడ్‌ వల్ల జర్నలిస్టులను వర్కర్‌ ‘కేటగిరి’లోకి మార్చి వారి హక్కులను ప్రభుత్వం మంగళం పాడింది.

రిట్రిచ్‌మెంట్‌ సందర్భాల్లో కార్మికులకు ఉన్న హక్కులు జర్నలిస్టులకు వర్తిస్తాయి. ఇది వరకు ఎడిటర్‌ను తొలగించాలంటే ఆరునెలల నోటీసు ఇవ్వాల్సి వచ్చేది. ఆ మిగతా జర్నలిస్టులకు మూడు నెలల నోటీసు ఇవ్వాలి. కోడ్‌లు అమల్లోకి వచ్చాయి కనుక ఇప్పుడు సిబ్బంది సంఖ్య మూడు వందల మందిలోపు ఉన్న సంస్థల్లో ఇతర వర్కర్ల మాదిరిగా ఒక నెల నోటీసుతో జర్నలిస్టులను తొలగించవచ్చు. మూడు వందల మందికి పైగా పని చేసే సంస్థల్లో మూడు నెలల నోటీస్‌ ఇవ్వాలి. ఎడిటర్‌కు ప్రత్యేక రూలు ఏదీ లేదు. జర్నలిస్టులు కూడా కొత్త చట్టాల ప్రకారం వర్కర్‌కు సమానం కనుక వారు కనీస వేతనానికి అర్హులు. దీనివల్ల బడా కార్పోరేట్‌ మీడియా సంస్థలు కూడా జర్నలిస్టులకు కనీస వేతనాలు అమలు చేయడానికి చట్ట ప్రకారం అవకాశముంది.

పాత చట్టం ప్రకారం సంస్థలోని సిబ్బంది సంఖ్యతో సంబంధం లేకుండా జర్నలిస్టులందరికీ గ్రాట్యుటీ వర్తించేది. ఇప్పుడు సిబ్బంది సంఖ్య పది మందికి దాటితేనే గ్రాట్యుటీ ఉంటుంది. దానికి లోపు సిబ్బంది ఉండే సంస్థలకు గ్రాట్యుటీ వర్తించదు. అంటే మీడియా సంస్థల్లో పని చేసే సిబ్బందిని ఇతర సంస్థల పేర చూపెట్టి జర్నలిస్టులకు గ్రాట్యుటీని ఎగనామం పెట్టే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. 2014లో సుప్రీంకోర్టు ఎపిబి ప్రయివేట్‌ లిమిటెడ్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో తీర్పు చెప్తూ 1955 చట్టం రాజ్యాంగాన్ని ఉల్లఘిస్తోందన్న యాజమాన్యం వాదనను కొట్టేసింది. ”జర్నలిస్టుల హక్కులను పలచనబారిస్తే దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాచేస్తే జర్నలిస్టులకు వ్యక్తిగతంగా జరిగే నష్టం కంటే సమాచారం పొందే ప్రజల హక్కుకు తీవ్ర భంగం వాటిల్లుతుంది. అది అనిశ్చితితో కూడిన ప్రమాదకరమైన పెట్టుబడిదారీ విధానానికి దారితీస్తుంది” అని హెచ్చరించింది. తన పదేళ్ల పాలన తర్వాత మోడీ 2014లో సుప్రీంకోర్టు అంచనా వేసిన అదే ప్రమాదాన్నే ఇప్పుడు తెచ్చిపెట్టాడు.

ఎస్‌.వినయకుమార్‌ 9989718311

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -