Thursday, December 25, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంగిరిజనాభివృద్ధికి ఎనలేని కృషి

గిరిజనాభివృద్ధికి ఎనలేని కృషి

- Advertisement -

శాస్త్రి మరణం సమాజానికి తీరని లోటు : రాష్ట్ర ప్రజావాణి నోడల్‌ ఆఫీసర్‌, సెర్ఫ్‌ సీఈఓ దివ్య దేవరాజన్‌

నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
గిరిజన ప్రజల అభివృద్ధికి డాక్టర్‌ వీఎన్‌వికే శాస్త్రి ఎనలేని కృషి చేశారనీ, ఆయన జీవితకాలం ఆదివాసీలతో పాటు సమాజాభివృద్ధికి పాటుపడ్డారని రాష్ట్ర ప్రజావాణి నోడల్‌ అధికారి, సెర్ఫ్‌ సీఈఓ దివ్య దేవరాజన్‌ అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (టీఏజీఎస్‌) ఆధ్వర్యంలో ఆదివాసీ పరిశోధకులు, ఆదివాసీ రచయిత, విశ్రాంత రాష్ట్ర గిరిజన సంక్షేమ అధికారి డాక్టర్‌ వీఎన్‌వికే శాస్త్రి సంస్మరణ సభ నిర్వహించారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్‌ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి దివ్య దేవరాజన్‌ హాజరై మాట్లాడారు. ఆమె 2017లో ఆదిలాబాద్‌ కలెక్టర్‌గా వెళ్ళినప్పుడు ఆదివాసుల గురించి ఏమీ తెలియదనీ, శాస్త్రి ద్వారా వారి సమస్యలు తెలుసుకున్నానన్నారు. హాయ్ మాన్‌ డార్క్‌తో కలిసి పనిచేసిన వారు చాలా తక్కువ మంది ఉన్నారని వివరించారు.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో గిరిజన సంస్కృతి పరిశోధన కేంద్రం (టీసీఆర్‌టీఐ) డైరెక్టర్‌గా శాస్త్రి పదవీ విరమణ చేశారన్నారు. మారుమూల ఆదివాసీ ప్రాంతాల్లో తిరిగి వారి సంస్కృతిపై పరిశోధనలు చేశారని చెప్పారు. ఆయన పరిశోధనలు చదివితే ఆయన గురించి మనం తెలుసుకోవచ్చన్నారు. నేటి తరానికి మార్గదర్శిగా శాస్త్రి ఉంటారని అభిప్రాయపడ్డారు. ఆదిలాబాద్‌ జిల్లాకు కలెక్టర్‌గా చేయడం వల్ల ఆదివాసుల గురించి తెలుసనీ, బయట వాళ్లు ఇది చూశారా ? అది చూశారా? అని అడుగుతుంటారనీ, వారికి గుస్సాడీ గురించి చెబుతుంటానని గుర్తుచేసుకున్నారు. ఇంత గొప్ప సంస్కృతి ఇతర ప్రాంతాల్లో చూడలేదన్నారు. స్కూల్‌ పిల్లలకు గిరిజనులలో ఎన్ని తెగలు ఉన్నాయో తెలియదన్నారు. చివరి క్షణాల వరకు గిరిజనుల గురించి శాస్త్రి పరిశోధనలు చేశారని వివరించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు రవికుమార్‌, లంకా రాఘవులు, కోట శ్రీనివాస్‌, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్‌ శోభన్‌, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు జి నాగయ్య ఆర్‌ వెంకట్‌రాములు, తెలంగాణ గిరిజన సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఎం ధర్మా నాయక్‌, ఆర్‌ శ్రీరాంనాయక్‌, సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వంగూరి రాములు, రాష్ట్ర కార్యదర్శి జె వెంకటేష్‌, నవతెలంగాణ పబ్లిషింగ్‌హౌస్‌ ఎడిటర్‌ ఆనందాచారి, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోటా రమేష్‌, వృత్తి సంఘాల రాష్ట్ర నాయకులు పైళ్ల ఆశయ్య, శాస్త్రి కుమారులు అరుణ్‌ కశ్యప్‌, తెలంగాణ సాహితి నాయకులు మహేష్‌ దుర్గే, తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం నాయకులు అశోక్‌, చిరంజీవి, తనుష్‌, ఉయ్క విష్ణు, తొడసం శంభు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -