– పీక్కుతిన్న కుక్కలు..
– ఐడీఏ బొల్లారంలో దారుణం
నవతెలంగాణ-ఐడిఏబొల్లారం
నవజాత శిశువును బ్యాగులో కుక్కి చెట్ల పొదల్లో పడేయగా.. కుక్కలు పీక్కుతిన్నాయి. ఈ దారుణమైన ఘటన సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపల్ పరిధిలోని గాంధీనగర్‌లో బుధవారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో అప్పుడే పుట్టిన ఓ నవజాత శిశువును గుర్తు తెలియని దుండగులు బ్యాగులో తెచ్చి చెట్ల పొదల్లో పడేశారు. అక్కడి వీధికుక్కలు ఆ శిశువు సగ భాగం.. కాళ్ల నుంచి మెడ వరకు తినేశాయి. తల, మెడ మిగిలి ఉండగా స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దాంతో వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాఫ్తు ప్రారంభించారు. కనీసం కండ్లు కూడా సరిగ్గా తెరువని పసిగుడ్డును కుక్కలు పీక్కుతినడం చూసి అక్కడి వారు చలించిపోయారు.