కాఫీ, మిరియాలకు గిట్టుబాటు ధర కల్పించాలి

–  ఏఐకేఎస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్‌
అరకులోయ : కాఫీ, మిరియాలకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని ఆల్‌ ఇండియా కిసాన్‌ సభ (ఏఐకేఎస్‌) జాతీయ ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్‌ డిమాండ్‌ చేశారు. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలోని సుంకరమెట్ట పంచాయతీ పెదగంగుడి గ్రామ సమీప ప్రాంతాల్లో ఆయన బుధవారం పర్యటించారు. విజూ కృష్ణన్‌ మాట్లాడుతూ అరకు ఆర్గానిక్‌ కాఫీకి దేశ, విదేశాల్లో మంచి పేరుందని తెలిపారు. కష్టపడి పండించే రైతుకు గిట్టుబాటు ధరను ప్రభుత్వం కల్పించకపోవడం దుర్మార్గమన్నారు. అరకు కాఫీని జి 20 సమ్మిట్‌లో గొప్పగా ప్రచారం చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించారు. 2019-23 మధ్య రైతులకు రావాల్సిన రూ.60 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేసి రైతుల ఖాతాలో జమ చేయాలని కోరారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. సమస్యలను పరిష్కరించకుంటే కాఫీ రైతు సంఘం ఆధ్వర్యాన పోరాటాన్ని ఉధృతం చేయాలని రైతులను కోరారు.

Spread the love