జిల్లా గ్రంధాలయ చైర్మన్ కేడం లింగమూర్తి
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
మతతత్వ పార్టీలతో మన దేశంలో కుల, వర్ణ వివక్ష ఇంకా కొనసాగుతుందని జిల్లా గ్రంధాలయ చైర్మన్ కేడం లింగమూర్తి అన్నారు. 1927లో డా. బాబాసాహెబ్ అంబేద్కర్ తలపెట్టిన మనుస్మృతి దహన కార్యక్రమానికి కొనసాగింపుగా గురువారం హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో దళిత బహుజన ప్రజాసంఘాల నాయకుల ఆధ్వర్యంలో మనుస్మృతి దహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మనుషుల మధ్య అంతరాలు సృష్టిస్తున్న మనస్మృతి నశించాలని, మానవత్వం వర్ధిల్లాలని అన్నారు.
మతం ముసుగులో బీజేపీ అధికారాన్ని చెలాయిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు అప్రమత్తులై ఇలాంటి పార్టీలను తరిమికొట్టి లౌకిక రాజ్యాన్ని స్థాపించాలని పిలుపునిచ్చారు. తరతరాలుగా మనుధర్మశాస్త్రం పేరుతో, కులాల పేరుతో మనుషులను విడగొట్టి మానవత్వాన్ని మంటగలుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదాన్ని స్వాతంత్రానికి పూర్వమే డా. బాబాసాహెబ్ అంబేద్కర్ గ్రహించి మనువాదాన్ని వ్యతిరేకించి, మహారాష్ట్రలోని మహద్ పట్టణంలో మనస్మృతి ప్రతులను దహనం చేశాడని గుర్తు చేశారు. అనంతరం మనుధర్మశాస్త్ర ప్రతులను దహనం చేశారు.
ఈ కార్యక్రమంలోబుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా సిద్దిపేట జిల్లా అధ్యక్షులు ఎనగందుల శంకర్, జన జాగృతి కళా సమితి అధ్యక్షులు ముక్కెర సంపత్ కుమార్, దళిత బహుజన ప్రజాసంఘాల నాయకులు కొయ్యడ కొమురయ్య, వెన్న రాజు, గొర్ల ఐలేష్ యాదవ్, మారపల్లి సుధాకర్, నాంపల్లి సమ్మయ్య, గడిపే బాలు, కొలుగూరి అశోక్, జనార్దన్, మైదంశెట్టి వీరన్న, పెరుమాండ్ల నర్సాగౌడ్, కైలు నాయక్ తదితరులు పాల్గొన్నారు.



