నవతెలంగాణ – భీంగల్
మస్జిద్‌లలో సేవలందిస్తున్న ఇమామ్‌లు, మౌజన్‌లు, మదర్సాల నాజిమ్‌లకు శీతాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని దుప్పట్లు, స్వెటర్లు పంపిణీ చేశారు. షేక్ ఇసా అహ్మద్ బిన్ షబీబ్, భీంగల్‌కు చెందిన నేషనల్ టెంట్ హౌస్ యజమాని, మాజీ కోఆప్షన్ సభ్యుడు ముహమ్మద్ అజ్మతుల్లా మద్దతుతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, హజ్రత్ మౌలానా ముహమ్మద్ జాఫర్ పాషా ఖాద్రీ (అమీర్ మిల్లత్ ఇస్లామియా) ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. మస్జిద్ సేవకులకు శీతాకాల దుప్పట్లు, స్వెటర్లు పంపిణీ చేయడం హర్షనీయం అన్నారు. సమాజాన్ని విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అన్ని రకాల సహకారాన్ని అందిస్తోందన్నారు. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ తన పవిత్ర వాక్యంలో ‘ఇఖ్రా’ అనే పదం ద్వారా విద్య ప్రాముఖ్యతను స్పష్టం చేశాడని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అన్ని మతాల ప్రజలు శాంతియుత వాతావరణంలో జీవించేలా సౌకర్యాలు కల్పిస్తోందన్నారు. శీతాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని మత పాఠశాలలతో అనుబంధం ఉన్న పండితులు, మౌజన్‌లు, బాధ్యతాయుతమైన విద్యార్థులకు జాకెట్లు పంపిణీ చేయడం, అవసరమైన విద్యార్థులకు స్కాలర్‌షిప్ నిధులు అందించడం ఆదర్శప్రాయమైన చొరవగా పేర్కొన్నారు. అనంతర ఈ సేవకు ముందుకు వచ్చిన మహమ్మద్ అజ్మతుల్లాను శాలువాతో సన్మానించి ప్రత్యేకంగా అభినందించారు.
పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ తొలి విద్యా మంత్రిగా విద్యారంగానికి చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ప్రతి వ్యక్తి విద్యలో ముందడుగు వేయడం నేటి అవసరమని, విద్య ద్వారా నైతికత, వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతుందని, దాంతో సమాజంలో శాంతి, స్థిరత్వం పెరుగుతుందని తెలిపారు. ముహమ్మద్ అజ్మతుల్లా మాట్లాడుతూ, మస్జిద్‌లలో సేవలందిస్తున్న ఇమామ్‌లు, మౌజన్‌లు, మదర్సాల నిర్వాహకులు సమాజానికి మార్గదర్శకులని అన్నారు. వారి సేవలను గౌరవిస్తూ ఇలాంటి సహాయ కార్యక్రమాలు నిర్వహించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలన్నారు. అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం ద్వారా సమాజంలో ఐక్యత, సోదరభావం మరింత బలపడుతుందని చెప్పారు. అనంతరం, మహమ్మద్ అలీ షబ్బీర్, మహేష్ కుమార్ గౌడ్, మహమ్మద్ అజ్మతుల్లా తదితరులు జాకెట్లు, స్కాలర్‌షిప్ నిధులను పంపిణీ చేశారు.



