Friday, December 26, 2025
E-PAPER
Homeమానవితెలుగు ప్రజల హృదయనేత్రి మాలతి చందూర్‌

తెలుగు ప్రజల హృదయనేత్రి మాలతి చందూర్‌

- Advertisement -

మాలతి చందూర్‌… మహిళలకు ఎన్నో ఆంక్షలున్న రోజుల్లోనే తన రచనల ద్వారా మహిళల్లో చైతన్యాన్ని నింపారు. మహిళల సమస్యలను ఎత్తిచూపుతూ, వాటికి పరిష్కారాలు వెదుకుతూ ఎన్నో నవలలు రాశారు. ప్రపంచం గర్వించదగ్గ స్త్రీవాద రచయిత్రిగా ఎదిగారు. తెలుగు భాషకు, తెలుగు మహిళకు మంచి గుర్తింపు తెచ్చారు. నవలా రచయిత్రిగా, మహిళా అంశాలపై కాలమిస్టుగా అనేక పురస్కారాలు అందుకున్నారు. అంతేకాక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును సైతం అందుకున్న ఆమె జయంతి నేడు…

మాలతి చందూర్‌ కృష్ణా జిల్లాలోని నూజివీడులో 1928లో డిసెంబర్‌ 26న జన్మించారు. తల్లి జ్ఞానాంబ, తండ్రి వెంకటాచలం. వీరికి ఆరుగురు సంతానం. అందరిలోకి మాలతి చిన్నవారు. నూజివీడులోని ఎస్‌.ఆర్‌.ఆర్‌ పాఠశాలలో ఎనిమిదో తరగతి వరకు పూర్తి చేసి తర్వాత పై చదువులకై ఏలూరు వెళ్లారు. అక్కడ వారి మామయ్య చందూర్‌ ఇంట్లో ఉండి చదువుకున్నారు. ఏలూరులోని వల్లూరు సెయింట్‌ థెరీసా స్కూల్లో ఇంగ్లీష్‌ మీడియంలో చేరారు.

ఏలూరులో వీరు ఉన్న ఇంటికి దగ్గరగా ‘కళావీధి’ అనే సాహిత్య పత్రిక ఉండేది. ప్రముఖ రచయిత అయిన మామయ్య చందూర్‌ ప్రోత్సాహంతో మాలతి కూడా అక్కడికి వెళ్లేవారు. కళావీధికి శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి, నండూరి సుబ్బారావు, విశ్వనాథ సత్యనారాయణ, వెంకటాచలం, కావలి నరసింహం లాంటి సాహితీవేత్తలు వచ్చేవారు. వారితో పరిచయం ఏర్పడంతో పుస్తకాలు విరివిగా చదివేవారు. అలా ఆమెకు సాహిత్యంపై మక్కువ కలిగింది. ఏలూరులో చదువు అయిన తర్వాత కొన్నాళ్ళు ఉపాద్యాయురాలిగా పనిచేశారు.

ప్రముఖులతో పరిచయం
1948లో చందూర్‌తో మాలతి వివాహం జరిగింది. అనంతరం చెన్నైలో స్థిరపడ్డారు. అక్కడే ఆమె తన సాహిత్యానికి మరింత పదును పెట్టారు. 1949లో తన రచనా వ్యాసంగం ప్రారంభించారు. అప్పట్లో రేడియోలో రచనలు చదివి వినిపించేవారు. ‘ఆ రోజుల్లో ఎగ్మోర్‌లో ఉన్న రేడియో స్టేషన్‌కు వెళ్తే ఒక సాహితీ సభకు వెళ్లినట్లు ఉండేది. అక్కడే ఆచంట జానకీ రామ్‌, బుచ్చిబాబు, జనమంచి రామకృష్ణ, మునిమాణిక్యం, నరసింహారావు వంటి వారిని దగ్గరగా గమనించే అవకాశం కలిగింది’ అంటూ మాలతి అనేక సందర్భాల్లో గుర్తు చేసుకునేవారు. 1952 నుండి ఆమె రచనా వ్యాసంగంలో తీరిక లేకుండా గడిపారు. ఈ దంపతులు ఇద్దరూ తమ జీవితాన్ని సాహితీ సేవకే అంకితమయ్యారు.

సమీక్షకురాలిగా
జగతి పత్రిక సంపాదకులుగా ఉన్న చందూర్‌, మహిళా మానస పుత్రికగా మాలతి ఇరువురు అప్పట్లో తమిళదేశంలో తెలుగు భాషా వికాసానికి, సాహిత్య అభివృద్ధికి ఎనలేని సేవలందించారు. మాలతి చందూర్‌ రాసిన మొదటి కథ రవ్వల దిద్దులు. ఇది ఆంధ్రావాణిలో వచ్చింది. తెలుగులో పాతిక దాకా మహిళా ప్రాధాన్యం కలిగిన నవలలు రాయడటమే కాక 300కు పైగా ఆంగ్ల రచనలకు తెలుగులో సమీక్షలు కూడా చేశారు. ఈ సమీక్షలు జేన్‌ ఆస్టిన్‌ నుండి అరుంధతీ రారుల రచనల వరకు ఉన్నాయి. ఇవి ‘పాత కెరటాలు’ శీర్షికన స్వాతి మాసపత్రికలో ప్రచురించారు. ఆమె రాసిన నవలల్లో శిశిర వసంతం, ఆలోచించు, భూమిపుత్రి, హృదయనేత్రి, కలల వెలుగు, మనసులోని మనసు, ఏమిటి జీవితాలు, ప్రాచుర్యం పొందాయి. అలాగే చంపకం-చెద పురుగులు, శతాబ్ది సూర్యుడు, కాంచన మృగం, మధురస్మృతులు వంటివి రచించారు.

గిన్నిస్‌ రికార్డులు
1952లో ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రికలో మహిళల కోసం ‘ప్రమదావనం’ అనే శీర్షికలను రెండు దశాబ్దాల పాటు నడిపించారు. ఇందులో వంటలు వార్పులే కాకుండా ఇంగ్లీషు నవలలు పరిచయం చెయ్యటం, విదేశాల్లో తిరిగి వచ్చిన వారి చేత వారి అనుభవాలు రాయించడం మొదలైనవి చేస్తూ వుండేవారు. అ శీర్షిక గిన్నిస్‌ రికార్డులకు కూడా ఎక్కింది. అలాగే మహిళల సమస్యల పరిష్కారం చూపుతూ వారి ప్రశ్నలకు సమాధానం ఇచ్చేవారు. ఆమె రాసే ‘జవాబులు’ మహిళలతో పాటు మగవాళ్లు కూడా చదివేవారు. వాటిని చాలా మంది బైండింగులు చేయించుకుని జాగ్రత్తగా దాచుకునేవారంటే వాటికి ఉన్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 1953లో ‘వంటలూ-పిండి వంటలూ’ పేరుతో ఒక పుస్తకం రాశారు.

విశేష సేవలు
70వ దశకంలో 11 ఏండ్ల పాటు ఈమె కేంద్ర సెన్సారు బోర్డు సభ్యురాలిగా కూడా పని చేశారు. అప్పట్లో తమిళ సినిమాలను అర్థం చేసుకోవడానికి తమిళ భాషను కూడా నేర్చుకున్నారు. రెండేండ్లకే అనువాదాలు ప్రారంభించి అనేక తమిళ రచనలను కూడా చేశారు. చెన్నైలోని శ్రీపొట్టి శ్రీరాములు స్మారక సొసైటీ చైర్‌పర్సన్‌గా ఉంటూ అనేక సాహితీ కార్యక్రమాలను నిర్వహించారు. ఇలా సాహిత్య రంగానికి విశేషమైన సేవలు అందించిన ఆమె కేంద్ర సాహిత్య పురస్కారాన్ని అందుకున్నారు. కాన్సర్‌ వ్యాధితో బాధపడుతూ 2013 ఆగస్టు 21న చెన్నైలో కన్నుమూశారు. మరణించిన తర్వాత కూడా తాను సమాజానికి ఉపయోగపడాలనే ఆమె కోరికమేరకు మాలతి చందూర్‌ భౌతికకాయాన్ని వైద్య పరిశోధనల నిమిత్తం శ్రీరామచంద్ర వైద్య కళాశాల(చెన్నై-పోరూరు)కు అందజేశారు.

పాలపర్తి సంధ్యారాణి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -