Friday, December 26, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిచైతన్యస్ఫూర్తి కేవల్‌ కిషన్‌

చైతన్యస్ఫూర్తి కేవల్‌ కిషన్‌

- Advertisement -

కామ్రేడ్‌ కేవల్‌ కిషన్‌ అంటే మెదక్‌ జిల్లాలో తెలియని వారంటూ ఉండరు. ఆయన పేరు వింటే ఆ ప్రాంతంలో ఒక ధైౖర్యం, భరోసా. పేదల ప్రజల కోసం భూస్వాములను ఎదిరించిన ధీరుడు. నిరంతరం పేదల కోసమే పోరాడిన యోధుడు. చిన్నశంకరంపేట్‌ మండలం తుర్కల మందాపూర్‌ గ్రామంలో జన్మించిన కేవల్‌ కిషన్‌ ఎన్నో ఉన్నత చదువులు చదివాడు. ప్రభుత్వ ఉద్యోగమొస్తే వదులుకున్నాడు. పేద ప్రజల హక్కుల కోసం పోరాట మార్గాన్ని ఎంచుకున్నాడు. శ్రామికులను, కార్మికులను ఐక్యం చేశాడు. అందరి హృదయాల్లో చెరగని ముద్ర వేశాడు. ఇదే భూస్వాములు, పెత్తందారులకు కంటగింపుగా మారింది. ప్రజల్లో రోజు రోజుకూ పెరుగుతున్న చైతన్యం, తిరుగుబాటును చూసి వారు వణికిపోయారు. ఈ ధైర్యం కేవల్‌ కిషన్‌నే అని, అతన్ని ఎలాగైనా చంపాలని కుట్ర పన్నారు. 1960 డిసెంబర్‌ 26న పొలంపల్లి దగ్గర రోడ్‌ యాక్సిడెంట్‌ చేసి హత్య చేశారు. ఆయన్ను భౌతికంగా చంపారు గానీ ఆయన ఆశయాలను మాత్రం ప్రజల నుంచి వేరు చేయలేకపోయారు. ఎక్కడైతే కేవల్‌ కిషన్‌ హత్య చేయబడ్డాడో అక్కడే ఆయన సమాధిని నిర్మించి ప్రతియేటా ఎడ్లబండ్లతో జాతర నిర్వహిస్తున్నారు. ప్రజల కోసం చేసిన పోరాటంలో మరణం లేని వీరుడు ఎవరైనా ఉన్నారంటే కామ్రేడ్‌ కేవల్‌ కిషన్‌. ఆయన 65వ వర్థంతి నేడు.

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో పెట్టిచాకిరి, కుల వివక్షత, అంటరానితనం, స్త్రీలపై వేధింపులు, భాషా సాంస్కృతిక అణచివేతలు ఉన్న కాలంలో ఆంధ్రమహాసభ పోరాటాలు ప్రజలకు ఎనలేని ధైర్యన్నిచ్చాయి. 1922లో ఉమ్మడి మెదక్‌ జిల్లాలో మాడపాటి హనుమంతరావు నేతృత్వంలో గ్రంథాలయ ఉద్యమం ప్రారంభమైంది.ఈ స్ఫూర్తితోనే ఆంధ్ర మహాసభ ఏర్పడింది. 1930లో జోగిపేటలో మూడు రోజులపాటు మొదటి మహాసభలు జరిగాయి. చారిత్రాత్మకమైన వీర తెలంగాణ సాయుధ రైతంగా పోరాటానికి ఈ ఆంధ్ర మహాసభ పోరాటాలు స్ఫూర్తినిచ్చాయి. ఆ చైతన్యంతో సామాజిక, ఆర్థిక అణచివేతలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో పోరాటాలు ఎరుపెక్కాయి. ప్రజల సమస్యల పరిష్కారానికి అనేక పోరాటాలు జరిగాయి. మెదక్‌ ప్రాంతం నుండి ఉన్నత చదువుల కోసం హైదరాబాద్‌ వెళ్లిన అనేకమంది విద్యార్థుల్లో ఒకరైన కేవల్‌ కిషన్‌పై తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, కమ్యూనిస్టు పార్టీ ప్రభావం పడింది. ప్రజలను వెట్టిచాకిరి నుండి విముక్తి చేసేందుకు ఆయన మెదక్‌ ప్రాంతానికి తిరిగివచ్చి కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో భూస్వాములకు వ్యతిరేకంగా నిలబడ్డాడు. సామాజిక వివక్షతపై, జమీందారుల ఆగడాలతో విసిగిపోయిన ప్రజలను ఒక్కతాటిపైకి తీసుకొచ్చి పోరాటాలు నిర్వహించాడు. భూమి లేని పేదలకు ప్రభుత్వ భూములు పంచాలని చేసిన పోరాటాలు నైజాం నవాబుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించాయి.

కేవల్‌ కిషన్‌ భూపోరాటాల ద్వారా మెదక్‌ జిల్లాలోని అనేక గ్రామాల్లో వేలాది మంది పేద ప్రజలకు భూములు పంచారు.తన సొంత ఆస్తినికి కూడా పేదలకు దానం చేశాడు. అందుకే మెదక్‌ పరిసర ప్రాంతాల్లోని ప్రజలు కేవల్‌ కిషన్‌ చేసిన పోరాటాల జ్ఞాపకంగా పుట్టిన పిల్లలకు కేవల్‌ కిషన్‌, కేవల్‌ కిషణమ్మ వంటి పేర్లు పెట్టుకుని ఆయన పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఆ పోరాటాల స్ఫూర్తిని నిత్యం కొనసాగించే క్రమంలో సీపీఐ(ఎం) పార్టీ సంగారెడ్డి, మెదక్‌ జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కార్యాలయాలకు కేవల్‌ కిషన్‌ పేరును పెట్టి ప్రజా పోరాటాలకు కేంద్రాలుగా మార్చింది. అంతేకాదు, కరోనా సమయంలో మెదక్‌లోని కేవల్‌కిషన్‌ భవన్‌లో హోమ్‌ క్వారంటైన్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి బాధితులకు ఉచిత సేవలందించింది.గతేడాది కాలంగా పేద పిల్లలకు ఉచిత ట్యూషన్‌ సెంటర్‌ నడుపుతున్నది. జిల్లా కేంద్రంలో జరిగే అనేక ప్రజాపోరాటాల రూపకల్పనకు కేవల్‌ కిషన్‌ భవన్‌ వేదికగా నిలవడం ఆయన పోరాట స్మృతులను మననం చేసుకోవడమే.

అయన ఆదర్శలను నేటి తరానికి అందించడానికి సీపీఐ(ఎం) ఎంతగానో కృషి చేస్తున్నది. నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను అమలు చేస్తోంది. రైతులను ముంచి కార్పొరేట్‌ సంస్థలకు లాభాలు చేకూర్చేందుకు వ్యవసాయ నల్ల చట్టాలను తీసుకువచ్చింది. రైతులంతా ఏడాది పాటు పోరాడి వాటిని రద్దు చేసేదాకా వదల్లేదు. అలాగే కార్మికులు పోరాడి సాధించుకున్న 29 రకాల కార్మిక చట్టాలను నాలుగు లేబర్‌కోడ్‌లుగా మార్చి అమలు చేస్తున్నది. వీటిని ప్రతి ఒక్కరూ ఖండించాలి. అలాగే శ్రమశక్తి నీతి-2025 పేరుతో లేబర్‌ పాలసీ తీసుకొచ్చి కార్మికుల హక్కులను కాలరాస్తోంది. గ్రామీణ ప్రాంతంలోని నిరుపేదలకు వందరోజులు పని కల్పించేందుకు వామపక్షాల పోరాటంతో 2005లో యుపిఏ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకువచ్చింది. ఆ దాన్ని రద్దు చేసిన మోడీ ప్రభుత్వం కొత్తగా విబి- జి రామ్‌ జి 2025 చట్టాన్ని తీసుకొచ్చింది. ఇది గ్రామీణ ప్రజలకు పని కల్పించకపోగా పాలకుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడేట్టు చేస్తుంది. అందుకే ఈ కొత్త చట్టం ప్రజలంతా ఐక్యంగా కదలాలి. ఆనాడు మెదక్‌ ప్రాంతంలో వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా ప్రజలు ఏ విధంగానైతే పోరాడారో ఇప్పుడు కూడా గ్రామాల్లో ఉపాధి చట్టాన్ని కాపాడుకోవడానికి నడుం బిగించాలి. అదే కామ్రేడ్‌ కేవల్‌ కిషన్‌కు మనమిచ్చే నిజమైన నివాళి.

యం.అడివయ్య 9490098713

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -