Friday, December 26, 2025
E-PAPER
Homeఎడిట్ పేజివీధి కుక్కల నియంత్రణ: మానవ హక్కులా? జంతు సెంటిమెంటా?

వీధి కుక్కల నియంత్రణ: మానవ హక్కులా? జంతు సెంటిమెంటా?

- Advertisement -

దేశవ్యాప్తంగా వీధి కుక్కల దాడులు రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రజల భద్రతపై తీవ్రమైన ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల వీధికుక్కల దాడులపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. సుమోటోగా స్వీకరించి తక్షణ చర్యల కోసం ఆదేశాలు కూడా జారీచేసింది. దీంతో ఇప్పుడు ఈ అంశం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఢిల్లీ నగరంలో వీధి కుక్కలు కనిపించ కుండా చర్యలు తీసుకోవాలని ఆగస్టు పదకొండున ఇచ్చిన ఆదేశాలు, తదనంతరం సవరింపులతో నవంబర్‌ పదకొండున జారీచేసిన మధ్యంతర ఆదేశాలు దేశవ్యాప్తంగా అమలవ్వాల్సిన విధానాలపై స్పష్టతనిచ్చాయి. తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. హైదరాబాద్‌ లో మూగబాలుడిపై వీధి కుక్కల గుంపు దాడి చేయడం, వరంగల్‌లో బైక్‌పై వెళ్తున్న యువకుడిని కుక్కలు తరిమి ప్రమాదం బారిన పడేయడం, గతంలో చిన్నారులు ఏకంగా ప్రాణాలే కోల్పోవడం-ఇవన్నీ వీధి కుక్కలతో సమస్యలు ఎంత జటిలంగా మారాయో స్పష్టం చేసే ఘటనలు.

2024లో దేశవ్యాప్తంగా 37 లక్షలకు పైగా కుక్క కాటు ఘటనలు నమోదవ్వగా, తెలంగాణ లోనే 1.22 లక్షల కేసులు నమోదయ్యాయి. గత మూడేళ్లలో ఈ సంఖ్య డెబ్బయి శాతం పెరగడం ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని ప్రతిబింబిస్తోంది.కుక్క కాటు కేవలం గాయాల వరకే పరిమితం కాదు. ప్రాణాంతక రేబిస్‌ వంటి వ్యాధులకు దారితీస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అంచనా ప్రకారం రేబిస్‌ వల్ల జరిగే మరణాల్లో 36 శాతం భారత్‌లోనే ఉండటం గమనార్హం. యేటా 18 నుంచి 20 వేల మంది ఈ కారణంగా ప్రాణాలు కోల్పోతుండగా, అందులో అధికశాతం చిన్నారులే కావడం మరింత విషాదకరం. ఈ దాడుల బారిన ఎక్కువగా పడేది పేదలు, కింది మధ్యతరగతి ప్రజలే. మురికి వాడలు, పేద బస్తీల్లో వీధి కుక్కల సంఖ్య అధికంగా ఉండటం సామాజిక అసమానతను కూడా వెలుగులోకి తీసుకొస్తోంది.

ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రజల జీవించే హక్కును ప్రథమంగా పరిగణలోకి తీసుకుంది. మొదట ఢిల్లీ నగరంలోని అన్ని వీధి కుక్కలను నగరం బయట షెల్టర్లకు తరలించాలని ఆదేశించిన కోర్టు, వివిధ తరగతుల అభ్యంతరాలను పరిశీలించి తర్వాత సవరించిన ఆదేశాలు జారీ చేసింది. ప్రమాదకరమైన, జబ్బుపడిన కుక్కలను మాత్రమే షెల్టర్లకు తరలించాలని, మిగిలిన వాటిని పట్టుకున్న ప్రదేశంలోనే వదలాలని పేర్కొంది. అలాగే వీధుల్లో ఎక్కడపడితే అక్కడ ఆహారం పెట్టకుండా గుర్తించిన కేంద్రాల్లో మాత్రమే ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థలు, ఆసుపత్రులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు వంటి ప్రజా ప్రదేశాల్లో వీధి కుక్కలను పూర్తిగా తొలగించాలని, అవసరమైన షెల్టర్లు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జాతీయ, రాష్ట్ర రహదారులపై పశువులు తిరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, ప్రజల ప్రాణాలు కాపాడడం రాజ్యాంగబద్ధమైన బాధ్యతని కోర్టు గుర్తుచేసింది.

అయితే, ఈ ఆదేశాల అమలులో తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌లో వీధి కుక్కల తరలింపునకు మున్సిపల్‌ అధికారులు చర్యలు ప్రారంభించగానే జంతుప్రేమికుల సంఘాలు అడ్డుపడుతున్నాయి. కుక్కలను హింసిస్తున్నారని, చంపేస్తున్నారని ప్రచారం చేస్తూ న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు వేయడం ద్వారా చర్యలను నిలిపివేస్తున్నాయి. ప్రజల ప్రాణాలు పోతున్న సందర్భాల్లో కనీస సానుభూతి లేకుండా, కేవలం జంతు సెంటిమెంట్ల పేరుతో మానవ హక్కులను విస్మరించడం ఏ రకమైన మానవత్వమనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రపంచంలోని అనేక దేశాల్లో వీధి కుక్కలు కనిపిస్తే వాటిని షెల్టర్లకు తరలించడం, యజమాని లేదా దత్తత లభించకపోతే శాస్త్రీయ పద్ధతిలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది.

మన దేశ చట్టాల ప్రకారం కూడా ప్రజలకు ప్రమాదం కలిగించే వీధి కుక్కలను పశువైద్యుల సూచన మేరకు మత్తుమందుతో మృతి చెందేలా చేయవచ్చని న్యాయపరంగా స్పష్టత ఉంది.ప్రస్తుతం అమలులో ఉన్న ఎనిమల్‌ బర్త్‌ కంట్రోల్‌ (ఎబిసి) చట్టం-2001, జంతు వులపై క్రూరత్వ నిరోధక చట్టం-1960 ప్రకారం క్యాచ్‌-స్టెరిలైజ్‌-వాక్సినేట్‌-రిలీజ్‌ విధానం అమలవుతోంది. కానీ ఇది కాగితాలకే పరిమితమై, వాస్తవంగా ఫలితాలివ్వడం లేదు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఒక్కో కుక్కకు రూ.1500 ఖర్చు చేస్తున్నట్టు చూపుతూ కాంట్రాక్ట్‌ ఏజెన్సీలు నిధులు దుర్వినియోగం చేస్తున్నాయి. ఈ ఏజెన్సీల్లో చాలా జంతు ప్రేమికుల సంఘాలే ఉండటం, అధికారులు-కాంట్రాక్టర్లు కుమ్మక్కవడం వల్ల కోట్లాది రూపాయలు వృథా అవుతున్నాయి.

గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే నాలుగు లక్షలకుపైగా వీధి కుక్కలు ఉండగా, మిగతా మున్సిపాలిటీల్లో మరో 2.23 లక్షలు ఉన్నాయి. వంద శాతం స్టెరిలైజేషన్‌, వ్యాక్సినేషన్‌ లక్ష్యాలు మాటలకే పరిమితమవుతున్నాయి. చెత్త నిర్వహణ లోపించడం, పారిశుద్ధ్యం సరిగా లేకపోవడం వల్ల వీధి కుక్కలకు ఆహారం సులభంగా లభించి వాటి సంఖ్య మరింత పెరుగుతోంది.అందువల్ల వీధి కుక్కల సమస్యను సెంటిమెంట్స్‌తో కాకుండా శాస్త్రీయంగా, మానవ హక్కులను కేంద్రంగా పెట్టుకుని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాలను కఠినంగా అమలు చేయడం ప్రధానం. ప్రజా ప్రదేశాల్లో వీధి కుక్కలను పూర్తిగా తొలగించడం, చెత్తరహిత పట్టణాలు నిర్మించడం, వెటర్నరీ విభాగాన్ని బలోపేతం చేసే దిశగా ముందుకు సాగడం ముఖ్యం. అవసరమైతే ప్రస్తుత చట్టాల్లో మార్పులు చేయడం అత్యవసరం. మానవ ప్రాణాలకంటే ఎక్కువ విలువ ఇంకేదీ కాదు. ప్రజల భద్రతను విస్మరించి వీధి కుక్కల నియంత్రణలో జరుగుతున్న నిర్లక్ష్యానికి ఇకనైనా ముగింపు పలకాలి.

ఎం.శ్రీనివాస్‌ 9490098661

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -