Friday, December 26, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిపడిపోయింది రూపాయి విలువ కాదు, ప్రభుత్వం విలువ!

పడిపోయింది రూపాయి విలువ కాదు, ప్రభుత్వం విలువ!

- Advertisement -

”రూపాయి పడిపోవడం దేశ ఆర్థిక వ్యవస్థకి చాలా మంచిది”- అని సెలవిచ్చారు నీతిఆయోగ్‌ ఉపాధ్యక్షుడు. అందుకే కాబోలు దేశ ఆర్థిక మంత్రి సంతోషంగా ఉన్నారు. నిజమే మరి! ఆయన చెప్పిన లాజిక్కే అధికారంలో ఉన్న దేశ నాయకులంతా పాటిస్తున్నట్లుంది. కాలుష్యం ఆరోగ్యానికి మంచిది అని పర్యావరణ మంత్రి ఆనందంగా ఉన్నారు. ఢిల్లీతో పాటు దేశంలోని ప్రధాన నగరాలు కాలుష్య మయమైపోయినా, ఆయన నోరువిప్పడం లేదు. ఇండిగో విమానాల రద్దు దేశంలో పెద్ద సమస్యగా తయారైనా, విమానశాఖా మంత్రి ఎంత సంతోషంగా ఉంటున్నారో చెప్పలేం. పైగా ఈయన తెలుగువాడు.

మోడీ చంకలో చేరి, ఆయనకు ఊతమిచ్చి నిలబెట్టిన ఎన్డీయే భాగస్వామి పార్టీ సభ్యుడు. ఈ దెబ్బతో తెలుగు వారి ప్రతిభ ప్రపంచవ్యాప్తం చేశాడు. తెలుగు దేశం పార్టీ సభ్యులే కాదు, తెలుగువాళ్లంతా చంకలు గుద్దుకుని ఎగిరి గంతేయాల్సిన సందర్భం! ”బరువైన వస్తువులు వేగంగా కిందపడతాయి. అలాగే భారత దేశపు రూపాయి బరువుగా ఉంటుంది కనుక, త్వర త్వరగా కింద పడిపోతోంది” – ఈ వ్యాఖ్య ప్రతిపక్షాల వారిది కాదు. స్వయానా అధికార పక్షం-లోక్‌సభ బీజేపీ యం.పి కంగనా రనౌత్‌ జీ అన్నదే! బీజేపీ వారి పరువు తీయడానికి ప్రతిపక్ష సభ్యులు అవసరం లేదు. వాళ్ల పరువు వారే తీసుకోగల సమర్థులు. ఇదిగో ఇలాంటి వాళ్లకే పద్మశ్రీలు కూడా దక్కుతూ ఉంటాయి.

రూపాయి విలువ పడిపోయి, దేశ ఆర్థిక వ్యవస్థ బలపడిన సందర్భంలో దేశ ఆర్థిక మంత్రి ఒకే ఒక్కమాట ఎంతో నిజాయితీగా చెప్పారు.”నేను డా.మన్మోహన్‌సింగ్‌ లాగా కాదలుచుకోలేదు” అని! నిజమే మరి! ఆయన చదువూ, విజ్ఞత, దార్శనికత ఎక్కడీ మోడీ భక్తురాలైన ఈమె అవగాహనా స్థాయి ఎక్కడీ పైగా ఈమె తెలుగింటి కోడలు. అందువల్ల తెలుగువాళ్లు తమ వీపు తామే చరుచుకుని అభినందించుకోవాల్సిన సందర్భం! మన తెలుగువారు పి.వి. నరసింహారావు ప్రధాని అయినప్పుడు ఆయనకు ఆర్థిక రంగం గురించి తెలియక పోయినా, డా.మన్మోహన్‌ సింగ్‌ వంటి ప్రొఫెసర్‌ను తన ఆర్థిక మంత్రిగా చేసుకుని ఆర్థిక వ్యవస్థను స్థిరపరిచారు. తర్వాత మన్మోహన్‌ సింగ్‌ ప్రధాని అయ్యాక పరిస్థితిని మరింతగా మెరుగు పరిచారు. ఆ తర్వాత దేవగౌడ, ఐ.కె. గుజ్రాల్‌ వంటి వారు ప్రధానులయిన కాలంలో కూడా రూపాయి విలువ ఇంతగా దిగజారలేదు. ఇక బీజేపీ పూర్తి మెజారిటీతో గెలిచి, నరేంద్రమోడీ ప్రధాని కావడంతో ఈ దేశ ప్రజలందరూ ఎంతో ఆశించారు.

మంచి మెజారిటీతో గెలిచిన ప్రభుత్వం గనుక, చాలా మంచి పనులు చేస్తూ ప్రజారంజకమైన పరిపాలన అందిస్తారని ఆశించారు. కానీ, వారి ఆశ అడియాసే అయ్యింది. మోడీ ప్రభుత్వం ఆర్థిక రంగాన్నే కాదు, క్రమంగా అన్ని రంగాలనూ దిగజార్చుతూ వచ్చింది. పెద్దనోట్ల రద్దుతో దేశానికి పెద్ద దెబ్బ తగిలింది. దాని ప్రభావంతో వందల మంది చనిపోయారు. ఒక రకంగా దేశ ఆర్థిక వ్యవస్థ అప్పుడే కుప్పగూలింది. ఆ తర్వాత జి.ఎస్‌.టి ఎప్పుడైతే ప్రవేశపెట్టారో అప్పుడు మధ్యస్థాయి, కింది స్థాయి పారిశ్రామిక రంగాలన్నీ మూలపడ్డాయి. లక్షల మంది ఉపాధి కోల్పోయారు. మళ్లీ పుంజుకునే అవకాశం కూడా మోడీ ప్రభుత్వం ఆ పరిశ్రమలకు ఇవ్వలేదు. ఇక కోవిడ్‌ సమయంలో దేశం మరింతగా కుప్పకూలింది. కూలి, నాలి జనానికి బస్సు, రైలు సౌకర్యం కూడా కల్పించలేని నిస్సహాయ స్థితికి ప్రభుత్వం దిగజారింది. పనికిరాని మాటలు తప్ప, స్థూలంగా దేశ పౌరులకు చేసిందేమీ లేదు. చెయ్యాల్సింది చేయకుండా చప్పట్లు చరచండి! పళ్లాలు మోగించండని దేశ ప్రధాని పిలుపునిచ్చారు.

ఏళ్లు గడుస్తున్నా, ఈ దేశ ప్రజలు ఇంకా చప్పట్లు చరిచి ప్లేట్లు మోగిస్తూనే ఉన్నారు. ఎందుకంటే – వారికి ఇంత తిండిపెట్టే నాథుడో, ఉపాధి కల్పించే యోధుడో వస్తాడేమోనని! అమెరికా డాలర్‌తో భారతదేశపు రూపాయి 91 అయ్యింది. ఇది ఇంకా ఇంకా పడిపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు మాత్రం ”దేశ ఆర్థిక వ్యవస్థ బలం పుంజుకుంది” అని ప్రచారం చేసుకుంటున్నారు. ప్రతి మనిషికి ఆత్మసాక్షి అనేది ఉంటుంది. బహుశా, ప్రస్తుత మన దేశ నాయకులకు అదంటే ఏమిటో కూడా తెలియనట్టుంది. డా.మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా ఉన్నప్పుడు రూపాయి విలువ కొద్దిగా పడిపోయింది (సుమారు 53 రూపాయలు). అప్పుడు ఇదే మోడీజీ దాన్నొక పెద్ద సమస్యగా చిత్రించి నాటి ప్రభుత్వాన్ని నానా మాటలు అన్నారు. అప్పుడు కొద్దిగా పడిపొయిన దానికీ, ఇప్పుడు పూర్తిగా పడిపోయిన దానికీ పోలికే లేదు.

గతంలో తను మాట్లాడిన వీడియో క్లిప్పింగ్‌ చూసుకుని మోడీజీ నాలిక కరుచుకుని, దేశ ప్రజలకు క్షమాపణలు చెపుతారా? అసలు అంత హుందాగా ఆయన ఎప్పుడు ప్రవర్తించారనీ! పైగా ఆయన భక్తులేమో ఇక్కడ విషయాల్ని వక్రీకరించి చెపుతూ ఉంటారు. రూపాయి విలువ ఎంత పడిపోతే దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని వివరణలిస్తారు. ఆర్థిక రంగం గురించి ఏమాత్రం పరిజ్ఞానం లేని వారికైనా – అదొక మూర్ఖపు ప్రకటన అని తెలిసిపోవడం లేదా? రూపాయి విలువ ఇంతగా పడిపోతే అంతర్జాతీయ మార్కెట్‌లో నిలబడేదెట్లా? నిలదొక్కుకునేది తర్వాత సంగతి! తమ తమ అహాల్ని వదిలి ఆర్థికమంత్రి, ప్రధాని, ఆర్థిరంగ నిపుణుల్ని సంప్రదించాలి! పునరుద్ధరణకు పూనుకోవాలి! పన్నెండేళ్లుగా అధికారంలో కొనసాగుతున్న ఈ ప్రభుత్యం, ఏ రంగం మీద దృష్టి పెట్టిందన్నది ఆత్మ విమర్శ చేసుకోవాలి!

దేశ ప్రజల కష్టార్జితమైన రూపాయికి విలువే లేదని విమానయాన సంస్థ కూడా ఈ మధ్య రుజువు చేసింది కదా? 2025 డిసెంబర్‌ 4-8 తేదీల్లో వందల సంఖ్యలో విమానాలు రద్దయి వేల మంది ప్రయాణికులు పడరాని పాట్లు పడ్డారు. విమానాల రద్దు గురించి వారికి మెసేజు, మెయిలో పంపలేదు. వేలమంది ప్రధాన నగరాల్లోని ఎయిర్‌ పోర్టులకు పోయి చివరి క్షణంలో విమానాలు రద్దయ్యాయన్న బోర్డులు చూసి నీరుగారి పొయ్యారు. ఆ ప్రయాణాలు కొందరికి ఎంతో ముఖ్యమైనవి కావచ్చు. భావోద్వేగాలకు గురై కొందరు భోరుమని ఏడ్చారు. విమానాలు రద్దయినప్పుడు విమాన సంస్థ ప్రయాణికుల ఛార్జీలు వెంటనే వెనక్కి తిరిగి ఇచ్చేయాల్సింది. ఆ పని వారు చేయలేదు. విమానాశ్రయాల నిర్వహణ కుప్పగూలింది. టీ, డ్రింక్స్‌, స్నాక్స్‌ అందివ్వకపోవడం అలా ఉంచి – వాష్‌ రూంలు వాడకానికి పనికిరాకుండా అయ్యాయి. విమానయాన మంత్రిత్వశాఖ ఉంది. దానికీ మంత్రి ఉన్నాడు. సంవత్సర కాలంగా ఇండిగో సంస్థ నిర్వహణ సరిగా లేక విమా నాలు రద్దవుతుంటే కేంద్ర ప్రభుత్వమేం చేస్తోంది? డబ్బులు పొగొట్టుకొని ప్రయాణికులు అల్లలాడుతూ ఉంటే అక్కడేం జరిగిందీ? ప్రజల రూపాయికి విలువే లేదని తేలిపోయింది!!

2014కు ముందు డా.మన్మోహన్‌సింగ్‌ ప్రధానిగా ఉన్నప్పుడు ఏ ఒక్క విమాన సంస్థనూ బలపడనీయలేదు. ఎక్కువ సంస్థలకు అవకాశమిచ్చారు. అన్నింటినీ ఒక హద్దులో ఉంచారు. ఉదాహరణకు అప్పటి వివరాలు చూడండి. ఎయిర్‌ ఏసియా ఒక శాతం-గో ఎయిర్‌ తొమ్మిది శాతం – ఎయిర్‌ ఇండియా 18 శాతం – స్పైస్‌ జెట్‌ – 18శాతం జెట్‌ ఎయిర్‌ వేస్‌ 21 శాతం – ఇండిగో 30 శాతం – ఇతరులు 3 శాతం ఉండేవారు. 2014 తర్వాత మోడీ ప్రధాని అయ్యాక పరిస్థితి మారింది. తనకు కావల్సిన వారికి ఎక్కువ మేలు చేస్తూ వచ్చారు. వారినే బలపడనిచ్చారు. ఇప్పటి వివరాలు ఇలా ఉన్నాయి. ఇండిగో- 65 శాతం అయితే, ఎయిర్‌ ఇండియా 18 నుండి 30కి పెరిగింది. మిగతా సంస్థలు 5 శాతం ఉన్నాయి. ఇండిగోకు ఎక్కువ మేలు చేసిన విషయం స్పష్టంగా కనిపిస్తోంది.

నిబంధనలకు అనుగుణంగా పని చేయలేకపోతున్నా ఇండిగో తన గుత్తాధిపత్యం వదులుకోలేక పోతోంది. సంవత్సర కాలంగా సమస్యలు సృష్టిస్తున్నా భారత విమాన మంత్రిత్వ శాఖ చోద్యం చూస్తూ ఉంది. 2025 డిసెంబర్‌ నెల మొదటి రెండువారాలు విమాన సర్వీసులు రద్దయి లక్షల మంది ప్రయాణికులు లబోదిబోమన్నారు. టికెట్‌ డబ్బులు వారివి వారికి వెంటనే తిరిగి ఇవ్వాలి కదా? అది కూడా చేయలేకపోయారు. దీనికి ప్రధాన కారణం మోడీ, షా వారి మంత్రి వర్గ సహచరుడు ఎన్డీయే భాగస్వామి (తెలుగుదేశం) మంత్రి రామమోహన్‌ నాయుడి అసమర్థత ! ఆంధ్ర రాష్ట్రంతో సంబంధమున్న ఆర్థికమంత్రి, విమానయాన మంత్రి తెలుగు వారి పరువు ప్రపంచం ముందు ఏ మాత్రం మిగల్చలేదు.

ఇండిగో సంక్షోభంలో పడడంతో మిగతా ఎయిర్‌ లైన్స్‌ విమాన ఛార్జీలు ఉన్నఫళంగా 5-6 రెట్లు పెంచాయి. ఫలితంగా దగ్గరున్న విదేశాలకు అయ్యే ఛార్జి కంటే దేశంలో మరో నగరానికి వెళ్లాలంటే ఎక్కువ ఛార్జి పెట్టాల్సి వచ్చింది. ఇంత ఘోరం జరుగుతూ ఉంటే, ఈ దేశానికి ఓ ప్రధానీ, ఓ హోంమంత్రి ఉన్నారు కదా? వాళ్లెందుకు నోరు మెదపలేదు? ముందు నిలబడి సహాయక చర్యలు చేపట్టడం తర్వాత సంగతి! ఇదీ ప్రస్తుతం దేశ పరిస్థితి. ఇక్కడ దేశంలో పెరిగిన ధరలూ, టాక్సులూ చూసి- బతుకు భారమై పోవడం చూసి, ఉపాధి లేకపోవడం చూసి, స్వేచ్ఛ లేకపోవడం చూసి యువత ఎలాగోలా విదేశాలకు వెళ్లిపోవాలనుకుంటోంది. ముందే వెళ్లిపోయిన వారు తిరిగి రావడానికి సాహసించడం లేదు.

ఇక్కడ జైశ్రీరామ్‌ అంటూ కూచుంటే కడుపు నిండే అవకాశం లేదుకదా? పాలకులు ఎంతసేపూ గల్లీల పేర్లు, ఊర్ల పేర్లు, నగరాల పేర్లు మార్చడమే గొప్ప సంస్కరణ అని అనుకుంటున్నారు. బెంగాల్‌ ఎన్నికలు వస్తున్నాయి గనక వందేమాతరం గీతాన్ని వివాదాస్పదం చేసి పార్లమెంట్‌లో చర్చకు పెడతారు. దేశ ప్రజల సమస్యలు వీరికి కనపడవు. ఇవన్నీ గమనించే ప్రఖ్యాత రచయిత్రి అరుంధతీ రారు అన్నారు. ”కార్పొరేట్‌ దేశంగా, హిందూమత రాజ్యంగా, పోలీస్‌ రాజ్యంగా, భయపెట్టే దేశంగా మారిపోయింది”. అని! ”నఫరత్‌కి బజార్‌ మె హం మొహబ్బత్‌ కి దుకాన్‌ ఖోల్‌ తే జాయింగే ”-విద్వేష పూరితమైన మీ వీధుల్లో మేం ప్రేమ దుకాణాలు తెరుస్తాం! – అన్నది కేవలం ప్రతిపక్ష నేత ఇచ్చిన నినాదం కాదు. అందులో ప్రతి భారతీయుడి గుండె కొట్టుకుంటోంది!

సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

డాక్టర్‌ దేవరాజు మహారాజు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -