నేడు భారత్, శ్రీలంక మహిళల మధ్య మూడో టీ20
తిరువనంతపురం: శ్రీలంక మహిళలతో విశాఖపట్నం వేదికగా జరిగిన తొలి రెండు టీ20ల్లో ఘన విజయం సాధించిన భారతజట్టు ఇక సిరీస్‌పై దృష్టి సారించింది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి రెండు టీ20ల్లో గెలిచి 2-0 ఆధిక్యతలో నిలిచిన భారత్.. మూడో టీ20లోనూ గెలిస్తే సిరీస్‌ను కైవసం చేసుకోనుంది. ముఖ్యంగా రెండో టీ20లో శ్రీలంక బ్యాటర్లు తొలుత రాణించినా.. ఆ తర్వాత స్పిన్నర్లు శ్రీచరణి, వైష్ణవి శర్మ లంక బ్యాటర్లను కట్టడి చేయడంలో సఫలీకృతులయ్యారు. దీంతో ఆ జట్టు ఒక దశలో భారీస్కోర్ దిశగా పయనించినా.. ఆ తర్వాత కేవలం 128 పరుగులకే పరిమితమైంది. ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌ను చేజిక్కించుకున్న అనంతరం భారత మహిళలజట్టు బలీయంగా మారింది.
శ్రీలంకతో జరిగిన తొలి రెండు టీ20ల్లో అటు బంతి, ఇటు బ్యాట్‌తో సమిష్టిగా రాణించింది. దీంతో ఆ జట్టును తొలి రెండు టీ20ల్లో కేవలం 130 పరుగుల్లోపే పరిమితం చేయడంలో సఫలమైంది. శ్రీలంకపై భారత మహిళలు వరుసగా 9సార్లు విజయం సాధించారు. చివరిసారిగా 2024 జులై నుంచి భారతజట్టు లంక చేతిలో ఓడిన దాఖలాలు లేవు. టీ20ల్లో కొత్తగా అరంగేట్రం చేసిన జెమీమా రోడ్రిగ్స్ తొలి రెండు మ్యాచుల్లో గొప్పగా బ్యాటింగ్ చేసింది. మరోవైపు షెఫాలీ వర్మ కూడా రెండో టీ20లో అర్ధ సెంచరీతో మెరిసి ఫామ్‌లోకి రావడం శుభ పరిణామం. అలాగే బౌలింగ్ విభాగంలో తొలి మ్యాచ్‌లో 6, రెండో మ్యాచ్‌లో ఏకంగా 9వికెట్లను కూల్చి లంకను కట్టడి చేయడంలో సఫలీకృతులయ్యారు. శ్రీచరణి, వైష్ణవి శర్మకు తోడు క్రాంతి గాడ్ లంక బ్యాటర్లను కట్టడి చేశారు.
జట్లు(అంచనా)
భారత మహిళలు : హర్మన్‌ప్రీత్(కెప్టెన్), మంధాన, షెఫాలీ వర్మ, రోడ్రిగ్స్, రీచా ఘోష్(వికెట్ కీపర్), దీప్తి శర్మ, అమన్‌జ్యోత్ కౌర్, అరుంధతి రెడ్డి, వైష్ణవి శర్మ, క్రాంతి గాడ్, శ్రీచరణి.
శ్రీలంక మహిళలు : ఆటపట్టు(కెప్టెన్), గుణరత్నే, పెరీరా, సమరవిక్రమ, నీలాక్షి డి-సిల్వ, కవిషా దిల్హారి, కౌశని సత్యంగణా(వికెట్ కీపర్), ఇనోకా రణవీర, మాధర, కావ్య కావింది, శశినీ గిమ్హా.



