Friday, December 26, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఅమెరికా బెదిరింపుల పర్వాన్ని ఆపాలి

అమెరికా బెదిరింపుల పర్వాన్ని ఆపాలి

- Advertisement -

వెనిజులాలో ఉద్రిక్తతలను తగ్గించాలి : భద్రతా మండలి సమావేశంలో సభ్యదేశాల పిలుపు

ఐక్యరాజ్య సమితి : వెనిజులాలో ఉద్రిక్తతలను తగ్గించాలని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సభ్య దేశాలు కోరాయి. వెనిజులాలో నెలకొన్న పరిస్థితులపై భద్రతా మండలి మంగళవారం అత్యవసర సమావేశం జరిపింది. ఆ దేశంలో ఉద్రిక్తతలను మరింత రెచ్చగొట్టకుండా నివారించేందుకు సంయమనం పాటించాలని, ఐక్యరాజ్య సమితి నిబంధనావళిని గౌరవించాలని మెజారిటీ భద్రతా మండలి సభ్య దేశాలు కోరాయి. అమెరికా ఆకాంక్ష వెనిజులాతో ఆగదని ఐక్యరాజ్య సమితితో వెనిజులా శాశ్వత ప్రతినిధి శామ్యూల్‌ మోంకాడా అకోస్టా వ్యాఖ్యానించారు. ఈ ఆకాంక్ష ఖండాంతర స్థాయిదని అన్నారు. ఈ ఖండ భవిష్యత్‌ తమదేనని అమెరికా ప్రభుత్వం తన జాతీయ భద్రతా వ్యూహంలో పేర్కొందని అన్నారు. వెనిజులా అభ్యర్ధన మేరకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఐక్యరాజ్య సమితి నిర్మాణంలో, నిబంధనావళి రూపకల్పనలో అవిభాజ్యమైన దేశంగా వున్న అమెరికా, ఈ రోజు పశ్చిమార్ధ అర్ధగోళంలో అన్ని దేశాల ప్రాధమిక హక్కులపై తనదైన ముద్ర వేయాలని భావిస్తోందని అన్నారు.

తద్వారా అంతర్జాతీయ చట్టాలకు, శాంతి, భద్రతలకు ముప్పుగా మారిందని వ్యాఖ్యానించారు. వెనిజులా చమురు ట్యాంకర్లను అమెరికా బలగాలు స్వాధీనం చేసుకోవడాన్ని, మొత్తంగా వెనిజులాపై నౌకాదళ ఆంక్షలు విధించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని రష్యా రాయబారి వాసిలీ నెబెంజియా అన్నారు. అమెరికా చర్యలు అంతర్జాతీయ చట్టాలకు సంబంధించిన అన్ని నిబంధనలను, ప్రమాణాలను ఉల్లంఘిస్తున్నాయన్నారు. చైనా డిప్యూటీ శాశ్వత ప్రతినిధి సన్‌ లెయి మాట్లాడుతూ, వెనిజులాపై సాగిస్తున్న బెదిరింపుల పర్వాన్ని తక్షణమే ఆపాలని అమెరికాను డిమాండ్‌ చేశారు. అమెరికా చర్యలు, వైఖరి వల్లనే ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయన్నారు. ఏకపక్ష చర్యలను, బెదిరింపులను చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. అన్ని దేశాలు వారి సార్వభౌమాధికారాన్ని, జాతీయ సమగ్రతను పరిరక్షించుకోవడానికి మద్దతునిస్తుందని స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -