ప్రయివేట్ ట్రావెల్స్ బస్సు…కంటైనర్ లారీ ఢీ
బస్సులో చెలరేగిన మంటలు..9 మంది సజీవదహనం
పలువురికి గాయాలు.. ఆస్పత్రికి తరలింపు
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం
ప్రధాని మోడీ , సీఎం సిద్ధరామయ్య దిగ్భ్రాంతి
చిత్రదుర్గ: కర్నాటక రాష్ట్రం చిత్రదుర్గ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి గోకర్ణ వెళ్తున్న ప్రయివేట్ ట్రావెల్ బస్సును ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు డీజిల్ ట్యాంక్ పేలి మంటలు చెలరేగడంతో 9 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్రదుర్గం జిల్లా జవరగుండనహళ్లి శివారులోని సిరా-హిరియూరు మధ్య జాతీయ రహదారిపై బెంగళూరు నుంచి గోకర్ణ వెళ్తున్న ప్రయివేట్ బస్సును గురువారం తెల్లవారుజామున లారీ ఢీకొట్టింది.
దీంతో కంటైనర్ లారీ, బస్సు రెండూ మంటల్లో చిక్కుకున్నాయి. బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదం సమయంలో బస్సులో 32 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనపై తూర్పు జోన్ ఐజీపీ రవికాంత్ గౌడ మీడియాతో మాట్లాడారు. బెంగళూరు నుంచి గోకర్ణ వెళ్తున్న ప్రయివేట్ స్లీపర్ బస్సును కంటైనర్ లారీ ఢీకొట్టడంతో బస్సులో డీజిల్ ట్యాంక్ లీకై మంటలు చెలరేగి ఉండవచ్చని అన్నారు. దీంతో బస్సులోని పలువురు ప్రయాణికులు బయటకు దూకడంతో ప్రాణాలతో బయటపడ్డారని తెలిపారు. లోపల ఉన్న ఎనిమిది మంది ప్రయాణికులు, లారీ డ్రైవర్ సహా మొత్తం తొమ్మిది మంది మంటల్లో చిక్కుకుని మృతి చెంది ఉండవచ్చని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని అన్నారు. ఈ ప్రమాదానికి కంటైనర్ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని తెలిపారు.
24 మంది సురక్షితం
” బస్సు ప్రమాదంలో గాయపడిన వారిలో 12 మంది హిరయూర్ ఆస్పత్రిలో, 9 మంది సిరా ఆస్పత్రిలో, ముగ్గురు తుమకూరు ప్రభుత్వ ఆస్పత్రి లో చికిత్స పొందుతున్నారు. తీవ్రంగా కాలిన వ్యక్తిని బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రికి తరలించారు.
మరో బస్సుకు తప్పిన ప్రమాదం
బస్సు ప్రమాదం జరిగిన సమయంలో టి. దాసరహళ్లి నుంచి దండేలికి వెళ్తున్న ఒక పాఠశాల బస్సు కాలిపోయిన బస్సును ఢకొీంది. అయితే ఆ బస్సులో ఉన్న 48 మంది విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.
ప్రధాని మోడీ , సీఎం సిద్ధరామయ్య దిగ్భ్రాంతి
బస్సు ప్రమాదంలో సజీవ దహనమైన వారికి ప్రధాని మోడీ సంతాపం వ్యక్తం చేశారు. మృతులకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అదే విధంగా ఈ ప్రమాదంపై సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు సమగ్ర విచారణ జరపాలని సీఎం ఉన్నతాధికారులను ఆదేశించారు.



