Friday, December 26, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంతల లేని మొండెంగా 'ఉపాధి' కొత్త చట్టం

తల లేని మొండెంగా ‘ఉపాధి’ కొత్త చట్టం

- Advertisement -

దీనిపై మొదటి నుంచీ మోడీ కక్ష
గాడ్సే వారసులే గాంధీ పేరును చంపబోతున్నారు : వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌


నవతెలంగాణ – నల్లగొండ టౌన్‌
మోడీ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005ను రద్దు చేసి 2025 పేరుతో 197 బిల్లును తెచ్చిందని, ఈ బిల్లు చట్టమైతే తల లేని మొండెంగా తయారవుతుందని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని దొడ్డి కొమరయ్య భవన్‌లో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గాంధీని చంపిన గాడ్సే వారసులే ఆ పేరుతో ఉన్న ఉపాధి హామీని చంపబోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ సర్కార్‌ ఉపాధి హామీ చట్టంపై మొదటి నుంచీ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని వికసిత్‌ భారత్‌ 2047లో భాగం చేస్తూ గ్యారంటీ రోజగార్‌, అజీవిక మిషన్‌ (గ్రామీణ) బిల్లు తెచ్చారని తెలిపారు. కొత్త చట్టం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే చర్యలేమిటి? అని ప్రశ్నించారు. ఈ కొత్త బిల్లు ఉన్న ఉపాధిని లేకుండా చేస్తున్నదని, పని దినాలు 125 రోజులకు పెంచుతున్నట్టు చెప్పి 60రోజులు పని నిషేధం విధించారని విమర్శించారు.

ఇప్పటివరకు 90శాతం ఉపాధి హామీ పనుల నిధులు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 10శాతం వాటా ఉండేదని, ఇప్పుడు 40 శాతం వాటా రాష్ట్రాలు ఇవ్వాలని చెప్పటం వెనుక ఈ చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే కుట్రలో భాగమేనని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన వేతనాలకంటే రాష్ట్రాల్లో ఎక్కువ వేతనాలు ఉంటే అవే కనీస వేతనాలుగా ఉండాలని, కానీ ఇప్పుడు ఉన్న దాన్ని కొత్త బిల్లులో రద్దు చేశారని, ద్రవ్యోల్బణం ఆధారంగా వేతనాలు పెర గాలని ఉన్న నిబంధన తొలిగించారని వివరించారు. ఆధార్‌ నిబంధన అమలు చేయడంలేదని సుప్రీంకోర్టుకు స్పష్టం చేసి.. మరోవైపు ఇప్పటికే ఉపాధికి ఆధార్‌ లింక్‌, కొలతలతో వేతనాలు ఇస్తూ రెండు పూటల హాజరు, కేవైసీ పెట్టారని తెలిపారు.

దీనిపై ఆందోళన చేస్తుంటే ఇప్పుడు బయోమెట్రిక్‌, జీపీఎస్‌ను చట్టబద్ధం చేయడమంటే పేదలను ఉపాధిహామీ నుంచి తొలగించడం తప్ప మరొకటి కాదని విమర్శించారు. గ్రామాల్లో పడిపోతున్న ఉపాధి పని దినాల వల్ల పేదలు బతకలేరన్నారు. గ్రామీణ ఉపాధి హామీ చట్టమే ఉండాలని, 2025 కొత్త బిల్లు వద్దని అన్నారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి నారి ఐలయ్య, భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నరసింహ, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు ములకలపల్లి రాములు, మహిళా కూలీల జిల్లా కన్వీనర్‌ దండెంపల్లి సరోజ, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చిన్నపాక లక్ష్మీనారాయణ, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్‌, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, మండల కన్వీనర్‌ పోలె సత్యనారాయణ తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -