Friday, December 26, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసోయా కొనుగోళ్లకు బ్రేక్‌

సోయా కొనుగోళ్లకు బ్రేక్‌

- Advertisement -

రంగు మారిందనే సాకుతో కొనేందుకు ముందుకురాని ప్రభుత్వరంగ సంస్థలు
ఇండ్లల్లో పేరుకుపోయిన నిల్వలు
అగమ్య గోచరంగా రైతుల పరిస్థితి
ఆందోళనకు పిలుపునిచ్చిన అఖిలపక్షం
నేడు కేంద్ర, రాష్ట్ర మంత్రులకు వినతులు


నవతెలంగాణ-ఆదిలాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించక రైతులు నష్టపోతుంటే ఈ యేడు అధిక వర్షాలు పంటలను ముంచెత్తాయి. ఇప్పటికే నష్టాల్లో ఉన్న సోయా రైతుల పరిస్థితి మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు అయింది. నష్టపోయి ఇబ్బందుల్లో ఉన్న రైతులకు ఎంతో కొంత చేతికందిన పంటను విక్రయించే వీలు లేకుండా పోయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలు కోనుగోళ్లకు ముందుకు రావడం లేదు. అధిక వర్షాలతో సోయా పంట తడిసి రంగు మారిదంటూ కొనుగోలు చేయడం లేదు. పంట కొనుగోలు చేయబోమని మార్కెట్‌కు వచ్చిన రైతులను తిప్పి పంపించారు. నలుపు రంగు వచ్చిందని, తెలుపు రంగులో ఉంటేనే కొనుగోలు చేస్తామని ప్రభుత్వరంగ సంస్థలు కొర్రీలు పెట్టడంతో సోయా రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది.ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా నాఫెడ్‌, మార్క్‌ఫెడ్‌ సంస్థలు సోయా కొనుగోళ్లు నిలిపేశాయి.

దీంతో రైతులు పండించిన పంట ఇండ్లలోనే మగ్గుతోంది. సోయా కొనుగోళ్లు చేపట్టాలని రైతులు ఆందోళనలు చేపడుతున్నారు. ఈ విషయంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతు సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. బుధవారం అఖిలపక్ష రైతు సంఘాలు రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించి ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు తీర్మానించాయి. శుక్రవారం ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రానికి వస్తున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావుకు వినతి పత్రాలు ఇవ్వనున్నారు. అదే విధంగా సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి జిల్లాలో సోయా కొనుగోళ్లు ప్రారంభించాలని కోరనున్నట్టు రైతు సంఘాల నాయకులు తెలిపారు.

30శాతం కూడా పూర్తికాని కొనుగోళ్లు
జిల్లాలో సోయా సాగు విస్తీర్ణానికి తగ్గట్టు పంట కొనుగోళ్లు జరగలేదు. నాఫెడ్‌ ద్వారా సోయా పంటకు క్వింటాల్‌ మద్దతు ధర రూ.5328 ఇస్తున్నారు. ఇప్పటి వరకు నాఫెడ్‌ ద్వారా కొనుగోలు చేసిన సోయాబీన్‌ పంట 30 శాతం మాత్రమేనని రైతులు తెలిపారు. కొనుగోళ్లు ఆలస్యంగా ప్రారంభించడంతో మార్కెట్‌ యార్డులో ఆరబెట్టుకున్న సోయా పంట మొంథా తుఫాన్‌తో పూర్తిగా తడిసిపోయి రంగు మారింది. ప్రకృతి వైపరీత్యానికి రైతులు నష్టపోతే రంగు మారిన పంటను కొనుగోలు చేయబోమని ప్రభుత్వరంగ సంస్థలు వెనుకడుగు వేశారు.

రైతుల వద్దే సుమారు నాలుగు లక్షల క్వింటాళ్లు
జిల్లాలో ఈ ఖరీఫ్‌లో 60వేల ఎకరాల్లో సోయా పంట సాగైనట్టు వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ఎకరాకు సుమారు 7 నుంచి 12 క్వింటళ్ల సోయా వస్తుందని అంచనా. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా సోయా దిగుబడులు 4.50లక్షల క్వింటాళ్ల నుంచి 7.20 క్వింటాళ్ల వరకు వచ్చే అవకాశముంది. అయితే, ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 1.64లక్షల క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేసినట్టు అధికారులు లెక్కలు చూపుతున్నారు.

35 క్వింటాళ్లు ఇంట్లోనే ఉంచా..
అమ్మడానికి మార్కెట్‌ యార్డుకు పోతే తేమ శాతం 12 వచ్చింది కానీ నల్లబడ్డాయని కొనుగోలు చేయబోమని తిప్పి పంపించారు. ఐదెకరాల్లో సోయా సాగు చేశాను. చివరికి మిగిలిన దిగుబడిని విక్రయించేందుకు వెళ్తే కొనుగోళ్లు నిలిపేశారు. రుయ్యాడి గ్రామంలోనే వందల క్వింటాళ్ల సోయా పంట నిల్వ ఉంది. ప్రభుత్వం వెంటనే సోయా కొనుగోళ్లు ప్రారంభించి రైతులను ఆదుకోవాలి.
నిమ్మల సుదర్శన్‌రెడ్డ్డి , రైతు, తలమడుగు మండలం (రుయ్యాడి)

రంగు మారిందనే సాకుతో ఆపేశారు
ఈ నెల 20న 35 క్వింటాళ్ల సోయాను బేల మార్కెట్‌ యార్డుకు తీసుకొచ్చాను. రంగు మారిందనే సాకుతో కొనుగోలు చేయడం లేదు. తేమ శాతం అధికంగా ఉందని కోనుగోళ్లు ఆపేశారు. రోజూ పంటను ఆరబెడుతూ మార్కెట్‌లోనే ఉంటున్నాను. నాణ్యత లేదని మొత్తానికే కొనుగోళ్లు ఆపకుండా మద్దతు ధర కొంత తగ్గించైనా వెంటనే కోనుగోలు చేయాలి. ఏ-గ్రేడ్‌, బి-గ్రేడ్‌గా పరిగణించి రైతులకు నష్టం జరగకుండా ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలి.
గోడే విశాల్‌, రైతు, బేల

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -