Friday, December 26, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఅసమానతలను స్థిరపర్చడమే ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ సిద్ధాంతం

అసమానతలను స్థిరపర్చడమే ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ సిద్ధాంతం

- Advertisement -

మానవత్వ సమాజం కోసం యువతరం పోరాడాలి : కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. స్కైలాబ్‌ బాబు
”మనుధర్మం వద్దు, భారత రాజ్యాంగం ముద్దు”అంటూ పలు జిల్లాల్లో కేవీపీఎస్‌ ఆధ్వర్యంలో మనుధర్మ శాస్త్ర పత్రాలు దహనం

నవతెలంగాణ- మహబూబ్‌నగర్‌/విలేకరులు
మనుషుల మధ్య అసమానతలను స్థిరపర్చడమే ఆర్‌ఎస్‌ఎస్‌-బీజేపీ విధానమని, రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ మనుస్మృతిని తీసుకురావాలని అవి ప్రయత్నం చేస్తున్నాయని కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్‌బాబు అన్నారు. మనువాదానికి వ్యతిరేకంగా సామాజిక సమానత్వం కోసం యువత పోరాడాలని పిలుపునిచ్చారు. ”మనుధర్మం వద్దు, భారత రాజ్యాంగం ముద్దు” అంటూ గురువారం రాష్ట్రవ్యాప్తంగా కేవీపీఎస్‌ ఆధ్వర్యంలో మనుస్మృతి పత్రాలను దహనం చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద మనుస్మృతి పత్రాలను దహనం చేశారు. ఈ సందర్భంగా స్కైలాబ్‌ బాబు మాట్లాడుతూ.. మనుస్మృతిని మట్టుపెట్టకపోతే మరో వెయ్యేండ్లయినా దేశ ప్రజల మధ్య ఐక్యత అసాధ్యమని అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌-బీజేపీ విధానాల వల్ల దేశంలో అసమానతలు పెరుగుతున్నాయని తెలిపారు.

ప్రపంచంలో ఎక్కడా లేని కుల వ్యవస్థను అడ్డం పెట్టుకొని దేశంలో సామాజిక అసమానతలను సృష్టించి, వివక్షతలకు ఆర్‌ఎస్‌ఎస్‌-బీజేపీ కారణమవుతున్నాయని అన్నారు. ఆశాస్త్రీయమైన మనుధర్మ శాస్త్రాన్ని ప్రజలు మట్టిలోనే పాతరేయాలని పిలుపునిస్తూ 1927 డిసెంబర్‌ 25న అంబేద్కర్‌ మను ధర్మ శాస్త్రాన్ని మహారాష్ట్రలోని రాయగడ్‌ జిల్లాలో వేలాది మందితో కలిసి దహనం చేశారని గుర్తుచేశారు. గోవాల్కర్‌ నుంచి నేటి మోహన్‌ భగవత్‌ దాకా.. శ్యాంప్రసాద్‌ ముఖర్జీ నుంచి నేటి మోడీ వరకు.. ఎవరు, ఎప్పుడు, ఎక్కడ మాట్లాడినా మనధర్మం అంటూ మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్‌ జిల్లా కార్యదర్శి ఎం. కురుమయ్య, జిల్లా ఉపాధ్యక్షులు జి. లక్ష్మీదేవి, పి. నాగరాజు, డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శులు కె. ప్రశాంత్‌, వి. భరత్‌, కేవీపీఎస్‌ నాయకులు రాజు, శ్రీను, నవాబ్‌ తదితరులు పాల్గొన్నారు.

వికారాబాద్‌ జిల్లా తాండూరులోని అంబేద్కర్‌ విగ్రహం ఎదుట సామాజిక, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మనుస్మృతి ప్రతులను దహనం చేసి దానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బొంరాస్‌పేట మండలం కొత్తూరు గ్రామంలో మహనీయుల విగ్రహాల ఎదుట మనుస్మృతి శాసనాలను తగలబెట్టారు. నల్లగొండలోని అంబేద్కర్‌ విగ్రహం ఎదుట మనుధర్మ శాస్త్ర ప్రతులను దహనం చేశారు. పెద్దపల్లిలో అంబేద్కర్‌ విగ్రహం మనుస్మృతి ప్రతులను దహనం చేస్తున్న క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. ఆదిలాబాద్‌లోని స్థానిక బాశెట్టి మాధవరావు స్మారక కేంద్రం ఎదుట మనుధర్మ శాస్త్ర ప్రతులను దహనం చేశారు. హనుమకొండలోని అంబేద్కర్‌ సెంటర్‌లో, మహబూబాబాద్‌లో మనుస్మృతి ప్రతులను దహనం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -