శంషాబాద్ మండలం కవేలిగూడలో దారుణం
పాత కక్షలతోనేనని అనుమానం
నవతెలంగాణ-శంషాబాద్
గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కవేలిగూడ గ్రామంలో గురువారం జరిగింది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం పాత కక్షల నేపథ్యంలో హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ కె.నరేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మొయినాబాద్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన జంపుల మహేశ్ కుమార్ (24).. శంషాబాద్ మండలం కావేలిగూడ గ్రామంలోని జై భవాని బార్బర్ షాప్‌లో బార్బర్‌గా పని చేస్తున్నాడు. ఇతనికి తల్లి యాదమ్మ, తమ్ముడు ఉదయ్ ఉన్నారు. ఐదేండ్ల క్రితం అతని తండ్రి రంగయ్య అనారోగ్యంతో మరణించాడు. అప్పటి నుంచి కుటుంబ బాధ్యతంతా ఇతనే చూసుకుంటున్నాడు. ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు షాప్‌కు వచ్చి రాత్రి 8 గంటలకు ఇంటికి వెళ్లేవాడు. ఎప్పటిలాగే బుధవారం ఉదయం షాపుకు వచ్చిన మహేశ్.. మధ్యాహ్నం రెండున్నర గంటలకు భోజనం కోసం వెంకటాపూర్ గ్రామానికి వెళ్లి తిరిగి 3.30 నిమిషాలకు షాప్‌కు వచ్చాడు. రాత్రి 9 అయినప్పటికీ ఇంటికి వెళ్లలేదు.
అతని తల్లి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. ఈ క్రమంలో.. కావేలిగూడ గ్రామం వెంచర్‌లో ఓ వ్యక్తి చనిపోయి ఉన్నాడని రాజేందర్‌రెడ్డి అనే వ్యక్తి గురువారం ఉదయం పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. గుర్తు తెలియని వ్యక్తులు మహేశ్ మెడను అత్యంత దారుణంగా కోసి చంపినట్టు గుర్తించారు. నాలుగు కోడిగుడ్లలో ఉన్న నీలాన్ని బయట పడేసి అందులో మిరపకారం పొడి నింపి స్టిక్కర్ అంటించారు. అతను పారిపోకుండా కండ్లల్లో కారం కొట్టి చంపాలనే ఉద్దేశంతో ఇలా చేసినట్టు అక్కడ ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ హత్యతో వెంకటాపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులపై అనుమానం ఉన్నట్టు మృతుని తల్లి యాదమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
వివాహేతర సంబంధమే హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆరు నెలల క్రితం మృతుని ఇంటి ఎదుట ఉన్న బైక్‌ను సైతం గుర్తుతెలియని వ్యక్తులు కాల్చేశారు. వారం రోజుల నుంచి అతన్ని చంపేస్తామని బెదిరింపులు కూడా వచ్చాయని కుటుంబ సభ్యులు తెలిపారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి భయంకరమైన హత్య ఈ ప్రాంతంలో ఎప్పుడూ జరగకపోవడంతో పక్కల గ్రామాల ప్రజలు ఉలిక్కిపడ్డారు. నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
గొంతు కోసి యువకుడి దారుణ హత్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



