ముఖ్యమంత్రి హోదాను మరింత దిగజార్చుతున్నావ్
నువ్వెంత దిగజారినా ఆ స్థాయికి మేము దిగజారం : మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి తీవ్ర విమర్శలు
నవతెలంగాణ-సూర్యాపేట
‘రేవంత్.. నీది కేసీఆర్ స్థాయి కాదు.. నువ్వు గల్లీ స్థాయి నాయకుడివని మరోసారి రుజువైంది.. ముఖ్యమంత్రి హోదాను రోజురోజుకూ దిగజారుస్తున్నావు.. కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే విషం కక్కుతున్నావు. మురుగు కాలువకన్నా అధ్వానంగా నీ నోరు ఉంది. రండలు మాట్లాడే భాషను సీఎం మాట్లాడటం సిగ్గుచేటు’ అని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం ద్వారా రేవంత్‌రెడ్డి తన రాజకీయ స్థాయిని మరోసారి బయట పెట్టుకున్నారని విమర్శించారు.
‘నువ్వెంత దిగజారినా మేము ఆ స్థాయికి దిగజారం.. రెండేండ్ల పాలనలో ఒక్కసారి కూడా కేసీఆర్ నీ పేరు ఎత్తలేదు.. కానీ నువ్వు మాత్రం రోజూ కేసీఆర్ పేరే జపిస్తున్నావు.. పోలీసులు, అధికారులు, మీ గూండాలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కలిసి సర్పంచ్ ఎన్నికల్లో పనిచేసినా ప్రజలు బీఆర్ఎస్ పక్షాన నిలబడి అద్భుతమైన ఫలితాలు అందించారు’ అని అన్నారు. మంచి పనులు చేసి.. మంచి మాటలతో ప్రజా హృదయాలను గెలవాలి కానీ, రేవంత్ మాటలు విని సర్పంచులే సిగ్గుపడుతున్నారని అన్నారు. సాధారణ ఎన్నికలు ఎప్పుడొచ్చినా రేవంత్‌ను రాజకీయంగా ప్రజలే బండరాళ్లు కట్టి మూసీలో పడేస్తారని అన్నారు. తెలంగాణకు అన్యాయం జరిగితే తాము మౌనంగా కూర్చోబోమని.. తెలంగాణ తెచ్చిన పార్టీగా, ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన కొట్లాడటం తమ బాధ్యత అన్నారు. ప్రభుత్వం ఇంకా కండ్లు తెరవకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం తప్పక ప్రారంభిస్తామని హెచ్చరించారు.



